అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో దాదాపు 40 శాతం మంది ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఓ ప్రముఖ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు మెరికాలోని ప్రస్తుత రాజకీయ వాతావరణం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన మార్పులు, పెరిగిన రాజకీయ ఒత్తిళ్లు, రక్షణ లేదనే భావనను కలిగిస్తున్నాయని భారతీయులు చెబుతున్నారు. సుమారు 71 శాతం మంది ఇండియన్ అమెరికన్లు ట్రంప్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రీన్ కార్డు రావడం దాదాపుగా అసాధ్యం
గ్రీన్ కార్డు నిరీక్షణ దశాబ్దాలుగా ఎన్నారైలను పీడిస్తున్న గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ సమస్య ఈ విరక్తికి మరో ప్రధాన కారణం. అమెరికాలో దశాబ్దాల తరబడి ఉన్నా, పౌరసత్వం రాకపోవడం, హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఎప్పటికప్పుడు మారుతున్న ఇమ్మిగ్రేషన్ పాలసీల వల్ల నిరంతరం అభద్రత వెంటాడుతోంది. ఏప్రిల్ 2026 వీసా బులెటిన్ ప్రకారం, భారతీయ నిపుణులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూడాల్సిన సమయం మరింత పెరగడం వారిని ప్రత్యామ్నాయాల వైపు చూసేలా చేస్తోంది.
పెరుగుతున్న విపక్ష
గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయులపై వర్ణ వివక్ష , ద్వేషపూరిత దాడులు పెరిగాయి. స్వయంగా ట్రంప్ లాంటి వారే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత ప్రచారం పెరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా 19 శాతం మంది తాము బహిరంగంగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించడానికి కూడా భయపడుతున్నట్లు సర్వేలో వెల్లడించారు.
భారత్‌లో పెరుగుతున్న అవకాశాలు
ఒకప్పుడు కేవలం డాలర్ల కోసమే అమెరికా వెళ్లేవారు, కానీ ఇప్పుడు భారత్ లోని ఐటీ , స్టార్టప్ రంగాలు అద్భుతమైన ప్యాకేజీలు, సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అమెరికాలో పెరుగుతున్న జీవన వ్యయం, హెల్త్‌కేర్ ఖర్చులతో పోలిస్తే, సొంత దేశంలో ఉన్నత జీవన ప్రమాణాలు సాధ్యమనే ఆలోచన యువ ఎన్నారైలలో బలపడుతోంది. దీనినే రివర్స్ బ్రెయిన్ డ్రైన్ గా అభివర్ణిస్తున్నారు. ఒకప్పుడు భారతీయులకు స్వర్గధామం గా కనిపించిన అమెరికా, ఇప్పుడు రాజకీయ, సామాజిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ మేధోసంపత్తిని ఆకర్షించడంలో అమెరికా తన పట్టును నెమ్మదిగా కోల్పోతోందనడానికి ఈ సర్వే ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
