చీకట్లో ఆ కామాంధులు…నట్టింట్లో ఈ మీడియా ఛానల్స్ !

తెలుగు మీడియా ఛానల్స్‌ అన్నీ కూడా సమాజాన్ని ఉద్ధరించడానికే, మెరుగైన సమాజం కోసమే పని చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటాయి. దమ్ము, ధైర్యం ఉన్న జర్నలిజం మాదే అని కూడా డప్పు కొట్టుకుంటూ ఉంటారు. కానీ తొంభై తొమ్మిది శాతం న్యూస్ ఛానల్స్ రాజకీయ, వ్యాపార స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయన్నది నిజం. రాజకీయ స్వార్థం గురించి పక్కన పెట్టినా ఇతర విషయాల్లో అయినా సమాజం, ప్రజల సమస్యల గురించి నిజాయితీగా పనిచేద్దామన్న కనీస ఆలోచన మన ఛానల్స్‌కి ఉందా?

అలాంటి ఆలోచనే మన మీడియా ఛానళ్ళకు అస్సలు లేదు అని వందశాతం తెలుగు ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పేరోజు చాలా దగ్గరలోనే ఉందని శ్రీ రెడ్డి విషయంలో తెలుగు మీడియా ఛానల్స్ దిగజారుడుతనమే చాలా స్పష్టంగా తెలియచేస్తోంది. శ్రీరెడ్డి సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావడం మంచి విషయమే అనుకుందాం. కానీ ఆ విషయంలో తెలుగు ఛానల్స్ అన్నీ కూడా సెక్స్ విషయాలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించాయన్న మాట వాస్తవం కాదా? శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన వెనకాల కర్త, కర్మ, క్రియ అయిన ఒక ఛానల్‌లో ప్రైమ్ టైం డిస్కషన్‌లో చిన్న పిల్లలను ప్రస్తావిస్తూ నీచమైన విషయాలు మాట్లాడారు. ఇక్కడ ప్రస్తావించడానికి కూడా సిగ్గుపడేలా ఆ విషయాలు ఉన్నాయి. కళ్ళద్దాలు పెట్టుకుని మేధావిలా కనిపించాలని తాయపత్రయపడ్డ ఆ ఛానల్ యాంకర్ కమ్ మీడియా పెద్దకు కనీస విలువలు పాటించాలన్న స్పృహ లేకుండాపోయింది. దశాబ్ధంపైగా జర్నలిజంలో ఉన్న ఆ మహానుభావుడికి జర్నలిజం ఎథిక్స్ తెలియకుండా ఉండే అవకాశం లేదు. కామం గురించి పచ్చిగా మాట్లాడితేనే కాసులు రాల్తాయన్న కక్కుర్తితోనే ఆ మూర్తీభవించిన కమర్షియల్ జర్నలిస్ట్ అలా చేసి ఉంటాడనడంలో సందేహం లేదు. ఇక మీడియా ఛానల్స్ అన్నింటికీ పెద్దన్నలా……తెలుగు నాట ఇలాంటి సంచలనాలు, బుల్లి తెరపై సెక్స్ విషయాలు, వీడియోలు ప్రసారమవ్వడానికి ఆద్యులైన వాళ్ళుగా పేరుగాంచిన నంబర్ ఒన్ ఛానల్‌ది కూడా అదే తీరు. కామం గురించి ప్రైమ్ టైం న్యూస్‌లో అథమ స్థాయి చర్చ ఆ ఛానల్‌లోనూ నడిచింది. సమస్యను ప్రస్తావించడాన్ని, పరిష్కారం చూపించాలన్న ఆలోచనను ఎవరూ తప్పుపట్టరు. కానీ డిస్కషన్ నడిచినంతసేపూ చర్చ అంతా కూడా సెక్స్ విషయాలపైనే ఉండాలని ఛానల్స్ తాపత్రయపడడం మాత్రం అతి జుగుప్సాకరం. అసహ్యించుకోవాల్సిన విషయం కాదా? సాక్ష్యాధారాలతో సహా శ్రీరెడ్డి చెప్పుకొస్తున్న ఆ సినిమా వ్యక్తులకు……ఈ మీడియా ఛానల్స్‌కు ఏమైనా తేడా ఉందా? బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వ్యక్తుల కంటే బాధ్యత లేకుండా వ్యవహరించే సంస్థలు సమాజానికి ఇంకా ప్రమాదకరం కాదా? అది కూడా సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన నాలుగో స్తంభమే కాసుల కక్కుర్తితో విలువలకు తిలోదకాలిస్తూ ఉంటే ఛీ కొట్టాలా? ఛీత్కరించుకోవాలా?

కుటుంబంతో కలిసి టివి చూడాలంటే సభ్యత గల వారు భయపడే స్థాయికి ఈ ప్రోగ్రామ్స్ చేరుకున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com