రివ్యూ : ఆఫీసర్ – ఆర్జీవీ బాలల చిత్రం

రేటింగ్‌: 2.5/5

ఒకసారి మోసపోతే అది అవతలవాడి తెలివి.

రెండోసారి మోసపోతే ఇవతలి వాడి అమాయకత్వం

మూడోసారి మోసపోతే మనవాడి తెలివితక్కువతనం

నాలుగోసారి, అయిదోసారి, ఆరోసారి, కచ్చితంగా మోసపోయేవాడి చాతకానితనం.

ఇంకా పచ్చిగా చెప్పాలంటే వెధవాయితనం.

ఏప్పుడో పాతికేళ్ల క్రితం శివ అనే సినిమా తీసి, అప్పటి నుంచి అదే విజిటింగ్ కార్డుతో కాలం నెట్టుకు వచ్చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ అండ్ ఆయన టీమ్.
తాతల మూతుల నేతుల వాసన చూసుకోడంటూ ఆయన తాబేదారుల ప్రచారం మరి కొంత.

శివ తరువాత నాగార్జునతో రెండు డిజాస్టర్లు తీసాడు రామ్ గోపాల్ వర్మ. రెండు ఫ్లాపులు అంటే హ్యాట్రిక్ కాదుగా, అందుకే ముచ్చటగా మూడోది తీసి ఆ లాంఛనం కాస్తా పూర్తి చేసాడు.అదే ఆఫీసర్.

మాఫియా కథాంశాలు అంటే మహా పిచ్చి ఆర్జీవీకి. అయితే గతంలో ఆయన తీసిన మాఫియా సిన్మాల్లో కాస్త సీరియస్ నెస్ వుండేది. వాటికి లాజిక్కులు వుండేవి. తీసిన సీన్లు చూస్తే, అండర్ వరల్డ్ అంటే ఇలా వుంటుందా అని అనిపించేది.
కానీ ఇప్పుడు తీసిన ఆఫీసర్ సినిమా చూస్తే, చదవేస్తే ఉన్నమతి పోయింది అన్న సామెత గుర్తుకు వస్తుంది. సినిమా మొత్తం చిన్నపిల్లల ఆటలా వుంటుంది. చిన్నపిల్లలు ఉత్తుత్తి తుపాకులు పట్టుకుని, మాఫియా ఆట ఆడుకుంటే అది అచ్చం ఆఫీసర్ మాదిరిగానే వుంటుంది. ఆఫీసర్ సినిమాలో కథ రెండు భాగాలుగా వుంటుంది.ఒకటి విశ్రాంతికి ముందు, రెండవది తరువాత. విశ్రాంతికి ముందు అన్నట్లుగా.

నారాయణ్ పసారి (ఫెరోజ్ అబ్బాసీ) అనే ముంబై పోలీస్ ఆఫీసర్ మీద వచ్చిన ఫేక్ ఎన్ కౌంటర్ ఆరోపణలను విచారించేందుకు హైదరాబాద్ నుంచి వస్తాడు శివాజీ (నాగార్జున). నారాయణ పసారిదే తప్పు అని తేల్చి అరెస్టు చేయించినా, కేసు నిలవదు. దాంతో అతగాడు బయటకు వచ్చి, పగ తీర్చుకునేందుకు ఓ అండర్ వరల్డ్ గ్యాంగ్ ను తయారుచేస్తాడు. శివాజీని అతని టీమ్ ను టార్గెట్ చేస్తాడు. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

అసలు ఆఫీసర్ కథనే డొల్లగా వుంటుంది. నారాయణ్ పసారి అనేవాడు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అని పేరు. అతగాడు క్రిమినల్స్ ను కావాలని ఎన్ కౌంటర్ చేయడం అన్నది ఒక విధంగా కరెక్ట్. ఒక విధంగా తప్పు. ఈ విషయంపై హీరో విచారణ అన్నది చిత్రంగా సాగుతుంది. హీరో తిరుగుతుంటాడు. కొందర్ని కలుస్తుంటాడు. వాళ్లేవో చెబుతుంటారు. మనకి అన్నీ వినిపించవు. ఆఖరికి ఉన్నట్లుండి ఫైల్ తయారుచేసి, పసారిని అరెస్టు చేస్తాడు.

తాను ఇంత చేసింది డిపార్ట్ మెంట్ కోసమే, సిస్టమ్ కోసమే, అలాంటిది తననే అరెస్టు చేస్తారా? అని పసారి రివర్స్ అవుతాడు. ఒక దశలో హీరోను కేసులో ఇరికించగలగుతాడు. అప్పుడు హీరో కూడా తాను చేసిందంతా సిస్టమ్ కోసమే, అలాంటిది తననే ఇరికిస్తాడా? అని ఎదురుతిరుగుతాడు. చిత్రంగా రెండూ ఒకే మాదిరి వ్యవహారాల్లా కనిపిస్తాయి. అయితే మొదటి దాంట్లో విలన్ అని ప్రేక్షకులు భావించే పసారి తెలివిగా నిర్దోషి అని ప్రూవ్ చేసుకుంటే, హీరో మాత్రం బల ప్రయోగం ద్వారానే దాన్ని సాధించి, విలన్ ఆట కట్టిస్తాడు.

ఈపాటి కథకు ఆర్జీవీనే అక్కర్లేదు. పైగా కథకు అల్లుకున్న సన్నివేశాలు భలే ఫన్నీగా వుంటాయి. గడగడలాండించే మాఫియా డాన్ లు ఇట్టే జనం మధ్యనే తిరిగేస్తుంటారు. కర్రల అడతీలో కొలువు తీరతారు. ఇట్టే చచ్చిపోతుంటారు. పసారి ఏకంగా హోంమంత్రినే చంపేసినా ఏమయిందో తెలియదు. అసలు పసారి దోషి అని శివాజీ ఎలా నిర్థారణకు వచ్చాడన్నది అర్థం కాదు.

ఎంత సేపూ టిష్యూం..టిష్యూం..అంటూ కాల్పులు. ఫైట్లు. హీరో పోలీసుల నుంచి పారిపోయే సీన్ అయితే ఫన్నీకి పీక్స్. క్లయిమాక్స్ టైమ్ లో ఇటు పక్క హీరో మాత్రమే వుంటాడు. కానీ భారీగా రెండు వైపులా కాల్పులు జరిగిపోతుంటాయి. ఎవరు ఎందుకు కాలుస్తున్నారో అర్థం కాదు.

కథ, కథనాలు అల్లడంలో తన చాతకాని తనాన్ని, వైఫల్యాన్ని, కొత్త సౌండ్ టెక్నిక్ అనే పదం వాడి మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో సీన్ తాలూకా ఇంటెన్సిటీని బట్టి, సంబంధం లేని భారీ మ్యూజిక్ వినిపించడం అలవాటుగా వుండేది. ముఖ్యంగా క్రయిమ్ సినిమాల్లో. ఇప్పుడు ఆఫీసర్ లో చేసింది అదే. సన్నివేశంలో ఏమీ వుండదు. భారీగా శబ్దకాలుష్యం మాత్రం వుంటుంది.

అంటే చిన్న పిల్లలు, బొమ్మ తుపాకి పట్టుకుని టిష్యూం..టిష్యూం అని శబ్దాలు చేస్తూ ఆడుకున్నట్లు అన్నమాట. ఈ శబ్దాలు వింటూ వుంటే, క్రైం థ్రిల్లర్ లో హార్రర్ థ్రిల్లర్ మిక్స్ చేసి జనాల చేత ఆ కాక్ టైల్ తాగించాలని ఆర్జీవీ కలగన్నట్లు వుంది.
సిట్ అనగానేమి? అన్నది రాజీవ్ గాంధీ మర్డర్ టైమ్ నుంచి జనాలకు తెలుసు. సినిమాలో కొత్తగా వివరంగా చెబుతుంటే భలే ఫన్నీగా వుంటుంది. ఆరంభంలో పోలీస్ ట్రయినర్ అంటాడు. తరువాత సిట్ ఆఫీసర్ అంటాడు. ఆ తరువాత వెనక్కు వెళ్లకుండా అక్కడే వుంచమని కోరానని అంటాడు. అంతా దర్శకుడి ఇష్టమే.

ఇలాంటి సినిమాలో నాగార్జున అలా అలా చేసేసాడు. పసారిగా ఫిరోజ్ బాగా చేసాడు. మిగిలిన వారు ఓకె. కావ్య క్యారెక్టర్ ప్రవేశపెట్టి, పేరెంట్స్ ఎపిసోడ్స్ ను మధ్య మధ్యలో చేర్చి, సినిమాకు ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ ఇవ్వాలని చూసాడు. కానీ అవన్నీ అలా అలా తేలిపోయాయి తప్ప, సిన్సియర్ ఎటెంప్ట్ అనిపించలేదు. అంతెందుకు హీరో భార్య బాంబు దాడిలో చనిపోయినట్లు తీసిన సన్నివేశం కూడా వర్మ కు సినిమా తీత మీద సీరియస్ నెస్ లేదని అనడానికి ఓ ఉదాహరణ. తక్కువలో, త్వరగా చుట్టేద్దాం అని ముందే డిసైడ్ అయ్యారని ఆ సీన్ చెబుతుంది.

వర్మ, నాగార్జున లాంటి హేమా హేమీల కాంబినేషన్ సినిమా అన్నపుడు సినిమాటొగ్రఫీ, మిగతా సాంకేతిక విలువలు ఎలాగైనా కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే వుంటాయి. ఆఫీసర్ లోనూ అలాగే వున్నాయి. తప్ప మరీ ఎక్స్ ట్రార్డినరీగా మాత్రం కాదు.

ఇంకానా ఇకపై చాలు అన్నట్లుగా. వర్మ సినిమాలు తీయడం ఆపకపోవచ్చు కానీ, చూడడం ఆపకపోతే, ఇలా మోసపోవడం అన్నది కొనసాగుతూనే వుంటుంది. వర్మ సినిమాలు చూడడం ఆఫీసర్ తో నైనా ఆపేసారు అని టాక్ వస్తే, అప్పుడైనా ఆయన మంచి సినిమా తీసి ఇస్తారేమో? అనుమానమే.

ఫినిషింగ్ టచ్

ఆఫీసర్ (వర్మ) చాయిస్…వెళ్లడం వెళ్లకపోవడం మీ చాయిస్

రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com