” వైసీపీ అధినేత జగన్, వైసీపీ పార్టీ మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ఆరోపణలు, ఫేక్ న్యూస్ పై గట్టిగా మాట్లాడండి ” అని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా సూచించారని ఇటీవల ప్రచారం జరిగింది. ఇది ఎంపీలకే కాదు బీజేపీ నేతలందరికీ వర్తిస్తుంది. కానీ ఒక్క మంత్రి సత్యకుమార్ తప్ప ఇంకెవరూ వైసీపీ, జగన్ చేసే విమర్శలపై స్పందించడం లేదు. ఏవరైనా స్పందిస్తే అది విమర్శనా లేకపోతే రొటీన్‌గా ఏదో ప్రశ్న వేశారా అన్నట్లుగా ఉంది. కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ రాష్ట్ర నేతలు జగన్ పై ఎదురుదాడి చేయడానికి ఎందుకు సందేహిస్తున్నారు.
జగన్‌కు ఘాటుగా సమాధానం ఇస్తున్న మంత్రి సత్యకుమార్
బీజేపీలో జగన్ కు వ్యతిరేకంగా మొదటి నుంచి గట్టిగా మాట్లాడేది సత్యకుమారే. ఎన్నికలకు ముందు పొత్తు ఖరారు కాక ముందు నుంచీ ఆయన జగన్ ను టార్గెట్ చేసుకునేవారు. ఎలాంటి మొహమాటం పెట్టుకునేవారు కాదు. ఆయనపై గతంలో వైసీపీ నేతలు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా సత్యకుమార్ అదే దారిలో ఉన్నారు. తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీల అంశాన్ని రాజకీయం చేయడంతో సత్యకుమార్ మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నామో లేదో చర్చకు రావాలని సవాల్ చేస్తున్నారు. అయితే ఇతర బీజేపీ నేతల నుంచి మాత్రం స్పందన రావడం లేదు.
మిగతా బీజేపీ నేతలంతా ఎందురు నోరు కట్టుకుంటున్నారు?
జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గా మైండ్ గేమ్ ఆడుతున్నారు. అది ఎలా ఉంటుందంటే.. భారతీయ జనతాపార్టీకి తాను దత్తపుత్రుడినని.. టీడీపీతో పొత్తులో ఉన్నా తనను వదిలి పెట్టదని.. కాపాడుతుందన్న అభిప్రాయాన్ని ఆయన కల్పిస్తున్నారు. కారణం ఏదైనా కొన్ని పరిణామాలు అలాగే జరుగుతున్నాయి. దీన్ని ఖండించి.. అలాంటి మినహాయింపులేమీ ఉండవని.. జరగాల్సిన టైంలో అన్ని జరిగిపోతాయని ఏపీ బీజేపీ నేతలే గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. పదవులు తీసుకున్నవారు గట్టిగా మాట్లాడటం లేదు. పదవులు రాని వారు తమకు పదవులు రాలేదని మాట్లాడటం లేదు. కొంత మంది మాట్లాడినా ఎవరూ పట్టిచుకోవడం లేదు. మాట్లాడాల్సిన వారు మాట్లాడితే .. వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. అలా చేయడం వల్ల .. ఆటోమేటిక్ గా వైసీపీతో గ్యాప్ పెరుగుతుంది. అలా పెరిగితేనే.. బీజేపీకీ కూటమిలో పలుకుబడి పెరుగుతుంది.లేకపోతే అంతర్గతంగా వైసీపీతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారన్న అనుమానం బలపడుతుంది.
టీడీపీ స్ఫూర్తిని అర్థం చేసుకోలేరా?
ఏపీలో వాజ్ పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ యాత్ర నిర్వహించాలనుకుంది. చంద్రబాబు టీడీపీ నేతలు కూడా పాల్గొనాలని ఆదేశించారు. దీంతో వారి యాత్ర కోలాహలంగా జరుగుతోంది. బీజేపీ నేతలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తున్నారు. వారికి ప్రభుత్వంలో ప్రాధాన్యం లభిస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈ స్ఫూర్తిని చూపడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. గతంలో బీజేపీలో ఓ వర్గం వైసీపీ పెద్దలతో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు వారికి పెద్దగా పార్టీలో , ప్రభుత్వంలో ప్రాధాన్యం లభించడం లేదు. వారు ఎలాగూ నోరు మెదపడం లేదు. మిగిలిన వారు అయినా వైసీపీపై ఎంత ఎక్కువ ఎదురుదాడి చేస్తే.. కూటమి అంత బలంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తించి ప్రత్యేకంగా సూచనలు చేశారు. కానీ రాష్ట్ర నేతలకు మాత్రం బల్బ్ వెలగడం లేదు.
