చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగోలేనప్పు ఓఆర్ఎస్ పట్టించమని డాక్టర్లు చెబుతారు. ఈ ఓఆర్ఎస్ శరీరంలో కోల్పోయిన ద్రవాలను, లవణాలను తక్షణమే పునరుద్ధరించే ఒక సంజీవని వంటిది. ముఖ్యంగా విరేచనాలు , వాంతులు లేదా అధిక చెమట కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది. అటువంటి సమయంలో ఓఆర్ఎస్ లోని సోడియం, పొటాషియం, చక్కెర , సిట్రేట్ల మిశ్రమం ప్రేగుల ద్వారా నీటిని వేగంగా గ్రహించేలా చేసి, ప్రాణాపాయం నుండి కాపాడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం తయారు చేసిన ఓఆర్ఎస్, కేవలం శక్తినిచ్చే పానీయం మాత్రమే కాదు, అది శరీర అంతర్గత వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే ఒక అత్యవసర వైద్య చికిత్స. ఇంత గొప్ప ఓఆర్ఎస్ను చాలా కంపెనీలు.. కూల్ డ్రింక్‌లా తయారు చేసి అమ్ముతున్నాయి. పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇవి తాగడం వల్ల మరింతగా అనారోగ్యానికి గురవుతున్నాయి. ప్రాణాపాయం కూడా వస్తోందని గుర్తించిన హైదరాబాద్‌కు డాక్టర్ శివరంజని వాటిపై పోరాటం చేస్తున్నారు.
డాక్టర్ శివరంజని పోరాటం
సామాన్య ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన బ్రాండింగ్ ఓఆర్ఎస్ అమ్మకాలు వాటి మార్కెటింగ్ తీరుపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శివరంజని పోరాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ఫార్ములా ప్రకారం తయారు చేసిన పానీయాలను మాత్రమే ORS అని పిలవాలి. కానీ, కొన్ని కంపెనీలు కేవలం చక్కెర, ఫ్లేవర్లతో కూడిన సాధారణ ఎనర్జీ డ్రింక్స్‌ను ORS అనే పేరు వచ్చేలా , ఆ భ్రమ కలిగేలా మార్కెటింగ్ చేస్తున్నాయి. డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న రోగులకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇటువంటి చక్కెర పానీయాలు ఇస్తే అవి విరేచనాలను తగ్గించకపోగా, పరిస్థితిని మరింత విషమింపజేస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ఇటువంటి బ్రాండింగ్‌ను అరికట్టాలని ఆమె కోరుతున్నారు. ఈ పోరాటంలో భాగంగా ఆమె గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆమె చేసిన ఫిర్యాదులు , కోర్టులో దాఖలు చేసినప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫలితంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-ఓఆర్ఎస్ పానీయాలపై ORS అనే పదాన్ని వాడకూడదని, వాటిని తప్పుదోవ పట్టించేలా మార్కెటింగ్ చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆమె పోరాటానికి లభించిన ఒక పెద్ద విజయంగా గత ఏడాది హైలెట్ అయింది.
డాక్టర్ శివరంజనిపై అంతర్జాతీయ సంస్థల న్యాయపోరాటం
డాక్టర్ శివరంజని చేసిన ప్రయత్నం వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని అంతర్జాతీయ సంస్థలు జాన్సన్ అండ్ జాన్సన్ , కెన్వ్యూ అంటున్నాయి. డాక్టర్ శివరంజని చేస్తున్న విమర్శలు తమ బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంస్థలు వాదిస్తున్నాయి. ఆమె కేవలం తన సోషల్ మీడియా వ్యూస్ పెంచుకోవడానికి, వాణిజ్యపరమైన లబ్ధి కోసమే తమ ఉత్పత్తులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అవి ఆరోపిస్తున్నాయి. తాము చట్టప్రకారం, నిర్దేశించిన ప్రమాణాల మేరకే ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, నిరాధారమైన ఆరోపణలతో వినియోగదారుల్లో అనవసర ఆందోళన కలిగిస్తున్నారని పేర్కొంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపాయి.
గ్యాగ్ ఆర్డర్ వస్తుందని డాక్టర్ శివరంజని ఆందోళన
ఈ వివాదం ముదురుతున్న తరుణంలో, తనపై ఈ అంశంలో మాట్లాడకుండా ఉండేలా గ్యాగ్ ఆర్డర్ అంటే మాట్లాడకుండా కోర్టు ఇచ్చే ఉత్తర్వు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ శివరంజని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జూనియర్ డాక్టర్ల సంఘాలు , ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ శివరంజనికి అండగా నిలుస్తున్నారు. ఒక వైద్యురాలిగా ప్రజారోగ్యం పట్ల ఆమెకున్న నిబద్ధతను ప్రశంసిస్తూ, కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గకూడదని అంటున్నారు. మరోవైపు, మార్కెట్లో లభించే ఏ పానీయం ఓఆర్ఎస్, ఏది కేవలం సాఫ్ట్ డ్రింక్ అనే విషయంలో సామాన్యులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రస్తుతానికి ఈ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉంది. ఒకవైపు వినియోగదారుల హక్కులు, ప్రజారోగ్య భద్రత, మరోవైపు అంతర్జాతీయ సంస్థల వ్యాపార హక్కుల మధ్య జరుగుతున్న ఈ పోరాటం భవిష్యత్తులో దేశంలోని ఫుడ్ అండ్ బెవరేజ్ మార్కెటింగ్ తీరుతెన్నులనే మార్చే అవకాశం ఉంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఇటు వైద్య లోకానికి, అటు కార్పొరేట్ ప్రపంచానికి అత్యంత కీలకమైన మార్గదర్శకంగా నిలవనుంది.


