అంతా ఓటీటీ మార్కెట్ గురించి బెంగ పెట్టుకొంటున్నారు కానీ, అసలు ముప్పు హిందీ డబ్బింగ్ తో ఏర్పడింది. ఒకప్పుడు సౌత్ సినిమాలకు హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ అనూహ్యంగా ఉండేది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు. గోపీచంద్, రవితేజ, రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి హీరోలకు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా వచ్చేవి. ఓరకంగా ఆయా హీరోల పారితోషికం కంటే, హిందీ డబ్బింగ్ రైట్స్ ఎక్కువగా ఉండేవి. బెల్లంకొండకు ఓ దశలో రూ.12 నుంచి రూ.15 కోట్లు పలికేవి. కొన్ని సినిమాలకు ఆయన పారితోషికం తీసుకోకుండా డైరెక్ట్ గా హిందీ రైట్స్ తీసుకొనేవారు. రవితేజ యాక్షన్ సినిమా చేస్తే… ఆయన పారితోషికం హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో వచ్చేవి. సోనీ ఛానల్ లో.. మన సినిమాలే ఎక్కువగా కనిపించేవి. ఈ హీరోలకు నార్త్ లో పాపులారిటీ పెరగడానికి ఆ ఛానల్ ఓ కారణం. కానీ ఇప్పుడు హిందీ డబ్బింగ్ మార్కెట్ అమాంతంగా పడిపోయింది. మన యాక్షన్ చూసీ చూసీ వాళ్లకు మొహం మొత్తేసింది. దాంతో మన సినిమాల్ని లైట్ తీసుకొంటున్నారు.
హిందీ మార్కెట్ అమాంతంగా పడిపోవడంతో ఈ హీరోల పరిస్థితి తారు మారు అయిపోయింది. మరోవైపు ఓటీటీ రేట్లు తగ్గుమొహం పట్టాయి. హిందీ హక్కుల కోసం ఆశ పడే నిర్మాతలు ఇప్పుడు ఆ ఆశల్ని వదులుకొని సినిమాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మేరకు హీరోలు పారితోషికం తగ్గించుకోవడం, లేదంటే నిర్మాణ వ్యయం లో కోత విధించడం కీలకమైన అంశాలు. వీటిపై హీరోలు దృష్టి పెట్టినట్టు అనిపించడం లేదు. మళ్లీ హిందీ డబ్బింగ్ రైట్స్ మామూలు స్థాయికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అలా రావాలంటే మాత్రం – కంటెంట్ పై దృష్టి పెట్టాలి. వీళ్ల చేతిలో కొన్ని హిట్స్ పడాలి. నార్త్ వాళ్ల ఆలోచనలు, వాళ్ల టేస్ట్ ని ఇంకా సున్నితంగా, నిశితంగా అర్థం చేసుకోవాలి. అందరికీ రీచ్ అయ్యే కంటెంట్ తోనే హిందీ మార్కెట్ పై మళ్లీ పాగా వేయగలరు. ఆ దిశగా ఆలోచిస్తే తప్ప.. పడిపోయిన హిందీ మార్కెట్ ని మళ్లీ యధాస్థాయిలోకి తీసుకురాలేం.


