టీఆర్ఎస్‌పై బీజేపీ ఎంత పోరాటం చేసినా విలువ ఉంటుందా…?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ.. బస్తీ బాట అనే కార్యక్రమం చేపట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు… ఈ కార్యక్రమాన్ని భుజాలపైన వేసుకుని నడిపిస్తున్నారు. బస్తీల్లో పేదల మనసు చూరగొనాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం పూట బస్తీల్లో సమావేశాలు పెట్టి.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌ను.. ఆయన కుమారుడ్ని అవినీతి పరులంటూ విమర్శిస్తున్నారు. కానీ వాటికి అటు మీడియాలోనే కాదు.. ఇటు ప్రజల్లో కూడా.. ఏ మాత్రం పట్టరానిదిగా బస్తీబాట కార్యక్రమం తయారయింది. దీనికి కారణం.. ఆ పార్టీ ఢిల్లీ నాయకత్వమే. ముఖ్యమంత్రి కేసీఆర్‌…తెలంగాణ గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే.. నిండు సభలో చెప్పిన తర్వాత.. ఇక మురళీధర్ రావు లాంటి నేతలు.. తెలంగాణకు వచ్చి ఎంత హడావుడి చేస్తే ఎవరు పట్టించుకుంటారు..?

కొద్ది రోజుల క్రితం వరకూ.. భారతీయ జనతాపార్టీ నేతల్లో ఎంతో కొంత ఉత్సాహం ఉంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు.. కాస్తంత శక్తి కూడదీసుకుని బస్సు యాత్ర చేశారు. కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. కొంత మంది కేంద్రమంత్రులను కూడా పిలిపించి.. హంగామా చేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీనేనని గట్టిగా ప్రకటించారు. కానీ తొలి విడత బస్సు యాత్ర ముగిసే సమయానికి తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా .. రివర్స్‌లో బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసి కూడా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎలా చెబుతారని మండిపడ్డారు. అంతేనా.. మిగతా తెలంగాణలో పరిస్థితి సంగతేమో కానీ.. బీజేపీకి అంతో ఇంతో ఓటు బ్యాంక్ ఉందని భావిస్తున్న హైదరాబాద్‌లో పరువు కాపాడుకునే ప్రయత్నం చేయండని చెప్పి వెళ్లిపోయారు.

2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో బీజేపీ ఐదు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెల్చుకుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో పరిస్థితి బీజేపీకి ఏ మాత్రం సానుకూలంగా లేదు. ఉన్న సీట్లు ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఈ విషయమే… తెలంగాణ బీజేపీ నేతల ముందు ఉంచి అమిత్ షా కొన్ని చిట్కాలు చెప్పి వెళ్లినట్లు తెలుస్తోంది. అందులో భాగమే… బస్తీబాట అంటున్నారు. ఇప్పుడిప్పుడే బీజేపీ మార్క్ పాలిటిక్స్‌ను పాతబస్తీ ఏరియాలో కొనసాగించేందుకు.. రాజాసింగ్‌ బయటకు వస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా.. ఓట్లు పొందడం అసాధ్యం కాబట్టి.. తీవ్రమైన విమర్శలే బీజేపీ నేతలు చేస్తున్నారు. కానీ వాటికి ఎలాంటి విలువ లేదు. అందుకే వారికి వ్రతం చెడిపోతోంది.. ఫలితము కూడా దక్కడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com