బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించినందుకు నిరసనగా, ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం వారికి అనుమతి ఇచ్చింది. అయితే, ఇది కేవలం ఒక మ్యాచ్‌ను వదులుకోవడం మాత్రమే కాదు, పాక్ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో నెట్టడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక జట్టు షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ను ఆడటానికి నిరాకరిస్తే, దానిని వాకోవర్ గా పరిగణిస్తారు. దీనివల్ల భారత్‌కు నేరుగా 2 పాయింట్లు లభిస్తాయి, పాకిస్థాన్‌కు సున్నా పాయింట్లు మిగులుతాయి. గ్రూప్ దశలో పాయింట్లు కోల్పోవడం వల్ల పాక్ సెమీస్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది.
ఐసీసీ విధించే కఠిన ఆంక్షలు
బహిష్కరణ నిర్ణయం అమలైతే ఐసీసీ కేవలం పాయింట్లతోనే ఆగదు. టోర్నీ పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించినందుకు పాకిస్థాన్‌కు అందాల్సిన వార్షిక ఆదాయ వాటాను ఐసీసీ నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పీసీబీకి ఇది కోలుకోలేని దెబ్బ. అంతేకాకుండా, బ్రాడ్కాస్టర్లకు కలిగే నష్టానికి ప్రతిగా భారీ జరిమానాలు, భవిష్యత్ ఐసీసీ టోర్నీల నుంచి సస్పెన్షన్, పాకిస్థాన్ సూపర్ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు ఇచ్చే ఎన్ఓసీల పై కూడా ప్రభావం పడవచ్చు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాక్ ఏకాకి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ ఇదే పంతమా?
ఒకవేళ పాకిస్థాన్ ఇతర జట్లపై గెలిచి సెమీఫైనల్ లేదా ఫైనల్లో మళ్లీ భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం జరుగుతుంది? నాకౌట్ మ్యాచ్‌ను కూడా బహిష్కరిస్తే, ఎదుటి జట్టు నేరుగా తదుపరి దశకు లేదా ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. టోర్నీ గౌరవాన్ని గంగలో కలిపే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఐసీసీ పాక్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది. రాజకీయ కారణాలతో క్రీడలను బహిష్కరించడం అనేది క్రీడల్లో రాజకీయ జోక్యం కిందికి వస్తుంది, ఇది ఐసీసీ రాజ్యాంగం ప్రకారం నిషేధం
అభిమానుల నిరాశ.. ఆర్థిక నష్టం
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్ భారత్-పాక్ పోరు. ఈ మ్యాచ్ రద్దయితే ప్రకటనలు, స్పాన్సర్లు , టిక్కెట్ల ద్వారా వచ్చే వందల కోట్ల ఆదాయం ఆవిరవుతుంది. పీసీబీ ఈ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే బోర్డు దివాళా తీయడం ఖాయం. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ చేస్తున్న ఈ జిత్తుల రాజకీయం చివరికి పాక్ క్రికెట్‌నే పాతాళానికి తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌పై అకారణ ద్వేషం పెంచుకుని … పాక్, బంగ్లా క్రికెట్లు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకుంటున్నాయి. చెడిపోయేవాడ్ని ఎవరూ బాగు చేయలేరని ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులను చూస్తే సులువుగా అర్థమైపోతుంది.
