రివ్యూ: పంతం

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

లంచం
అవినీతి
కుంభ‌కోణాలు

వీటిపై హీరోలు స్పీచులివ్వ‌డం… అవి చూసి జ‌నాలు చొక్కాలు చించుకోవ‌డం ‘అరె.. ఏం చెప్పాడ్రా’ అంటూ ఊగిపోవ‌డం.. ఈ రోజుల‌న్నీ పోయాయి. ఎందుకంటే ఇవ‌న్నీ అరిగిపోయిన క్యాసెట్లు. ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’ రోజులు కావు.. విన‌గానే షాక్ అయిపోవ‌డానికి, చ‌ప్ప‌ట్లు కొట్టేయ‌డానికి. ఓ విధంగా ‘ఠాగూర్‌’తోనే జ‌నాలు వెక్స్ అయిపోయారు. మ‌ళ్లీ అదే పాయింటు ప‌ట్టుకోవ‌డానికి గ‌ట్స్ ఉండాలి. పాత సినిమాల ఛాయ‌లు క‌నిపించ‌కుండా, ఏదో ఓ మ్యాజిక్ చూపించాలి. ‘కిక్‌’ది అదే స్టోరీ. కాక‌పోతే.. ఎక్క‌డా ద‌ర్శ‌కుడు దొర‌క‌లేదు. ర‌వితేజ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో మ్యాజిక్ చేసేశాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు గోపీచంద్ ‘పంతం’ అనే క‌థ ప‌ట్టుకొచ్చాడు. ఇది కూడా సోకాల్డ్ జెంటిల్‌మెన్ టూ కిక్ సినిమాల వ‌ర‌కూ న‌డిచిన పాత క‌థే. ఉన్న‌వాడి ద‌గ్గ‌ర కొట్టు.. లేని వాడికి పంచి పెట్టు కాన్సెప్టే. మ‌రి… ‘కిక్‌’లా ఏదో ఓ మ్యాజిక్ తోడైందా? ఈ సినిమాని నిల‌బెట్టిందా? ఎన్నో సినిమాల నుంచి విజ‌యం కోసం మొహం వాచిపోయిన గోపీచంద్‌కి త‌న 25వ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇచ్చింది?

క‌థ‌

”చెప్పుకోవ‌డానికి ఇదేం కొత్త క‌థ కాదు సార్‌.. దేశం పుట్టిన‌ప్ప‌టి నుంచీ మ‌నం చెప్పుకుంటున్న క‌థే”క్లైమాక్స్ సీన్‌లో.. కోర్టులో.. న్యాయ‌మూర్తి ముందు గోపీచంద్ చెప్పే డైలాగ్ ఇది.

ఈ డైలాగ్ చెప్ప‌డానికి గోపీచంద్ అంత సేపు ఆగాడు కానీ, సినిమా మొద‌లైన పావు గంట‌కే ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. ఇదేం కొత్త క‌థ కాదు.. సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచీ చూస్తున్న‌దే అని.

హొం మినిస్ట‌ర్‌ని టార్గెట్ చేయ‌డం, తాను ఎక్క‌డెక్క‌డో దాచుకున్న డ‌బ్బుని బ‌య‌ట‌కు తీసుకురావ‌డం, దాన్ని ఓ ట్ర‌స్ట్‌కి అందింవ్వ‌డం ఇదీ హీరో చేసే ప‌ని. మ‌ధ్య‌లో అక్ష‌ర (మెహ‌రీన్‌)తో ఓ ప్రేమ క‌థ కూడా న‌డుపుతుంటాడు. అస‌లు హోం మినిస్ట‌ర్‌ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ దోపిడీ వెనుక క‌థానాయ‌కుడి పంతం, ల‌క్ష్యం ఏమిట‌న్న‌దే సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌

జెంటిల్‌మెన్‌.. ఎప్ప‌టి సినిమా..? అందులో శంక‌ర్ ఏం చెప్పాడు? ఉన్న‌వాళ్ల ద‌గ్గ‌ర నుంచి దోచుకుని లేనివాళ్ల‌కు పెట్ట‌డంలో త‌ప్పు లేద‌న్నాడు.

మంచి పాయింటే. అందుకే… దాని చుట్టూ ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ అన్నీ జెంటిల్‌మెన్‌లు కావుగా.! `పంతం` క‌థ‌, దాన్ని న‌డిపిన తీరు, నేప‌థ్యం.. వీటిని చూస్తే ద‌ర్శ‌కుడి ల‌క్ష్యం చాలా పెద్ద‌దిగానే క‌నిపిస్తుంది. ఈసారి `ఎక్స్‌గ్రేషియా` అనే పాయింట్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్‌పెట్టాడు.

ప్ర‌మాదాల వ‌ల్ల గాయ‌ప‌డిన‌, మ‌ర‌ణించిన వాళ్ల‌కు సహాయం అందాలంటే.. ఫైళ్ల‌పై సంత‌కాలు జ‌రగాలి. అలా జ‌ర‌గాలంటే.. అధికారుల చేతులు త‌డ‌పాలి. లంచం లేనిదే అక్క‌డ ఏ ప‌నీ జ‌ర‌గ‌డం లేదు. ఆ లంచాలు ఇవ్వ‌లేక‌… చాలా కుటుంబాలు ప్ర‌భుత్వ స‌హాయం కోసం ఎదురుచూస్తూ.. ఎదురు చూస్తూ.. గ‌డిపేస్తున్నాయి. నిజానికి మంచి పాయింటే ఇది. కానీ.. దాన్ని డీల్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడి సామర్థ్యం ఏమాత్రం స‌రిపోలేదు. అస‌లు త‌ప్పు ఎక్క‌డ జరుగుతోంది? ఈ త‌ప్పుకు ప్ర‌ధాన కార‌కులు ఎవ‌రు? అనే విష‌యాల‌పై రీసెర్చ్ జ‌ర‌గ‌లేదు. అన్నీ పైపై స‌న్నివేశాలే. గ‌వ‌ర్న‌మెంటు ఆఫీసులో స‌హాయం కోసం వెళ్లిన ఓ వృథ్ధ జంట‌కు జ‌రిగిన అవ‌మానం, ‘మీ క‌ళ్ల ముందు చ‌నిపోతే.. స‌హాయం ఇస్తారా’ అంటూ.. అక్క‌డిక్క‌డే ఓ వృద్ధురాలు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం… హృద‌యాల్ని క‌దిల్చివేసే స‌న్నివేశం. పేప‌ర్‌పై చాలా బాగా రాసుకున్న ఇలాంటి సీన్లు తెర‌పైకి వ‌చ్చేట‌ప్పుడు తేలిపోయాయి. ఎక్క‌డ ఏ స‌న్నివేశాన్ని ఎలివేట్ చేయాలో, ఎక్క‌డ ఏ ఎమోష‌న్‌తో కొట్టాలో.. ద‌ర్శ‌కుడికి అర్థం కాలేదు.

రాబ‌రీ స‌న్నివేశాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉండాలి? ‘ధూమ్‌’ లాంటి సినిమాలు చూసిన‌వాళ్ల‌కు ఈ దొంగ‌త‌నాలు ఏమాత్రం ఆన‌వు. లాజిక్కులు ప‌ట్టించుకోకుండా… హీరో త‌న బుర్ర వాడ‌కుండా.. సుల‌భంగా డ‌బ్బులు దొబ్బేస్తుంటాడు. విశ్రాంతి ముందు సంప‌త్‌తో ఓ డైలాగ్ చెప్పింది.. ‘ఇక్క‌డేదో ట్విస్టు ఉంది సుమా’ అనిపించారు. కానీ.. రెండో భాగం మొద‌లైన‌.. రెండో నిమిషంలోనే అది తేలిపోతుంది. విక్రాంత్ ఫ్లాష్ బ్యాక్ ఒక్క‌టే ద‌ర్శ‌కుడు కాస్త బెట‌ర్‌గా డీల్ చేశాడ‌నిపిస్తుంది. కాక‌పోతే… అక్క‌డ కూడా శ్రీ‌మంతుడు ఛాయ‌లు కొన్ని క‌నిపిస్తాయి. కోర్టు సీనులో డైలాగులు ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం.. అవే ఈ సినిమాని నిల‌బెడ‌తాయి అని లెక్క‌లేసుకుని ఉంటారు. కానీ.. వాటినీ స‌రైన రీతిలో తీయ‌లేక‌పోయాడు. అది కోర్టా? లేదంటే హీరో ప్రెస్ మీటా? అన్న‌ట్టు సాగింది ఆస‌న్నివేశం. ఓ ప‌క్క వాద‌న‌లు జ‌రుగుతుంటాయి? మ‌రోవైపు అదే కోర్టు హాలులో మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు హీరో స‌మాధానాలు చెబుతుంటాడు? న్యాయ స్థానాలు, అక్క‌డ తీర్పు ఇచ్చే ప‌ద్ధ‌తుల‌పై ద‌ర్శ‌కుడికి మ‌రీ అంత అవ‌గాహ‌న లేక‌పోతే ఎలా? మ‌ధ్య మ‌ధ్య‌లో హీరో మంచిత‌నం, ఉదాత్త‌త చెప్పే స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డ వేశారు. వాటి వ‌ల్ల సింప‌తీ వ‌స్తుంద‌ని ఆశ‌. కాక‌పోతే.. అవే ఈ సినిమాని మ‌రీ బోరింగ్‌గా త‌యారు చేశాయి.

న‌టీన‌టులు

గ‌త పాతిక సినిమాల‌తో గోపీచంద్ ఏం చేశాడో, ఈ సినిమాలోనూ అదే చేశాడు. క‌థ‌లోలానే అత‌ని న‌ట‌న‌లోనూ కొత్త‌ద‌నం లేదు. కాక‌పోతే.. ఈమ‌ధ్య మ‌రింత స్టైలీష్ లుక్‌తో క‌నిపించ‌డం అల‌వాటు చేసుకున్న గోపీ.. ఈసారీ అలాంటి లుక్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. మెహ‌రీన్ హీరోయిన్ స్టేజీ దాటిపోయి… ఆంటీల ప్లేసులోకి చేరిపోనుందా? అనే అనుమానం వేస్తోంది. త‌న పాత్ర‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. దానికి స‌రిప‌డేట్టుగానే ఆమె న‌ట‌న సాగింది. మిర్చి సంప‌త్ ఎప్ప‌ట్లా బాగా అరిచాడు. జ‌య‌ప్ర‌కాష్ రొటీన్‌గానే రాయ‌ల‌సీమ యాస‌లో డైలాగులు చెప్పాడు. ఫృథ్వీ న‌వ్వించ‌డానికి రెడీగానే ఉన్నా.. ద‌ర్శ‌కుడు స‌రిగా వాడుకోలేదు. దాదాపుగా పాత్ర‌ధారులంద‌రిదీ ఇదే ప‌రిస్థితి.

సాంకేతికంగా

గోపీసుంద‌ర్‌కి దిష్టి త‌గిలిన‌ట్టుంది. అందుకే… కొన్ని పాడైపోయిన ట్యూన్లు ఈ సినిమాకి ఇచ్చేసి ఆ దిష్టిని పోగొట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ‘దేశ‌మంటే మ‌ట్టీ కాదు.. దేశ‌మంటే మ‌నుషులోయ్‌’ అంటూ సామెత‌ల్ని, సూక్తుల్ని ప‌ట్టుకుని ఓ పాట త‌యారు చేశారు. ఆ పాట‌కీ, సంద‌ర్భానికీ, వేసే స్టెప్పుల‌కూ సంబంధం లేక‌పోవ‌డంతో ఈ పాటే ఓ కామెడీ ట్రాక్‌లా క‌నిపిస్తుంది. కెమెరా వ‌ర్క్ బాగుంది. ఓ పాట‌ని లేపేసి ఎడిట‌ర్ చాలా మంచి ప‌ని చేశాడు. ద‌ర్శ‌కుడు ఓ బ‌ల‌మైన పాయింట్ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ… దాన్ని న‌డిపించే ద‌మ్ము క‌థ‌, క‌థ‌నాల్లో లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నం నెర‌వేర‌లేదు.

తీర్పు: ”లోప‌లున్న‌ది బ‌య‌ట‌కు తీస్తాం.. బ‌య‌ట ఉన్న‌ది లోప‌ల‌కు తోస్తాం టింగ్ టింగ్‌” ఇదీ ఈ సినిమాలోని డైలాగే.
`”హిట్ క‌థ‌ల్ని కొట్టి బ‌య‌ట‌కు తీశా… దాంతో సినిమా తీసి మిమ్మ‌ల్ని థియేట‌ర్‌లోకి తోశా… టింగ్ టింగ్‌…” అని ఫీలైపోయి. ఈ క‌థ వండేశాడు. ఎలాగో హిట్ ఫార్ములా క‌దా అని గోపీచంద్ ఓకే చెప్పేశాడు. డ్రైవింగ్ రానివాడు ఫెరారీ కార్ జోలికి వెళ్ల‌డం, ఫ్లాపుల్లో ఉన్న‌వాడు ఫార్ములా ని న‌మ్ముకోవ‌డం రెండూ ఒక్క‌టే అని ఈ సినిమా మ‌రోసారి తేల్చేసింది.

ఫినిషింగ్ ట‌చ్‌: ప‌గ ప‌ట్టిన పంతం…

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close