ప‌వ‌న్ కమిటీకి రాజ‌కీయ రంగు వ‌చ్చేసిన‌ట్టే..!

రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌నిచేస్తాం అనడం కూడా రాజ‌కీయ‌మే అవుతుంది కదా..! కేంద్రం, ఆంధ్రా లెక్క‌లు తేల్చుతానంటూ జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ (జె.ఎఫ్‌.సి) తొలి స‌మావేశం నేడు హైద‌రాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో జ‌ర‌గ‌బోతోంది. భాజ‌పా, టీడీపీ స‌ర్కారుల‌కు ప‌వ‌న్ ఇచ్చిన డెడ్ లైన్ నేటితో పూర్త‌యింది. 15లోగా త‌న‌కు కేటాయింపులు, ఖర్చులకు సంబంధించిన లెక్క‌లు ఇవ్వాల‌ని కోరారు. ప‌వ‌న్ అడిగిన వివ‌రాలు ఇచ్చేందుకు టీడీపీ స‌ర్కారు సిద్ధంగా ఉన్న‌ట్టుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. కానీ, వివ‌రాలు కావాలంటే వెబ్ సైట్ల‌లో ఉన్నాయంటూ కొంత‌మంది మంత్రులు అన్నారు. కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు ఈ లెక్క‌ల గురించి సీరియ‌స్ గా తీసుకోలేదు. కానీ, ఆంధ్రా కేటాయింపుల‌కు సంబంధించి స‌మ‌గ్ర స‌మాచార‌మంతా త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని ఈ క‌మిటీ స‌భ్యుల్లో ఒక‌రైన లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ ఇదివ‌ర‌కే చెప్పారు. మొత్తానికి, జె.ఎఫ్‌.సి. కేంద్రం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రాష్ట్రం కొంత సానుకూలంగా స్పందించి, తీవ్రంగా వ్యతిరేకించలేదు.

నిజానికి, ఈ క‌మిటీలో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ వంటి మేధావులూ ఆర్థికవేత్త‌లు మాత్ర‌మే ఉంటార‌ని జె.ఎఫ్.సి. ఏర్పాటు చేస్తానన్న మొద‌టి రోజున ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. కానీ, ఆ త‌రువాత తరువాత క‌మిటీ క‌ల‌ర్ మారుతూ వ‌చ్చింది. ఏపీ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నామంటున్న వామ‌ప‌క్షాలు హాజ‌రౌతాయ‌ని ఆ మ‌ర్నాడు ప్ర‌క‌టించారు. సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌తో ప‌వ‌న్ కూడా భేటీ అయ్యారు. ఇంకోప‌క్క మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ కూడా జాయిన్ అయ్యారు. ఈ మ‌ధ్య ఆయ‌న కూడా ప్ర‌త్యేక హోదా కోసం ఉత్త‌రాంధ్ర నుంచి ఢిల్లీ వ‌ర‌కూ రైలు యాత్ర చేశారు. రాజకీయ రంగ పునః ప్ర‌వేశం ప్రయత్నంలో ఆయన ఉన్నారు. వీరితోపాటు, ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు రఘువీరాతో కూడా ప‌వ‌న్ మాట్లాడ‌టం విశేషం! వారిని కూడా జె.ఎఫ్‌.సి.కి ఆహ్వానించారట. అయితే, ఈ తొలి స‌మావేశానికి ఏపీ కాంగ్రెస్ నుంచి ప్ర‌తినిధుల్ని పంపిస్తామ‌ని ర‌ఘువీరా చెప్పార‌ట‌.

ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప్ర‌స్తుతానికి ఏ పార్టీలో లేక‌పోయినా… ఆయన టీడీపీ వ్య‌తిరేకవాది అనడంలో సందేహం లేదు. ఇక‌, కొణ‌తాల రామ‌కృష్ణ కూడా అంతే. ర‌ఘువీరా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక‌, ఇత‌ర మేధావులూ ఆర్థిక‌వేత్త‌లూ ఎవ‌ర‌నేది స‌మావేశం మొద‌లైతే త‌ప్ప తెలీదు. రాజ‌కీయంగా చూసుకుంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక శ‌క్తులన్నీ జె.ఎఫ్.సి.లో చేరిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. అన్నిటికీ మించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీని కూడా ఈ స‌మావేశానికి ఆహ్వానించ‌డ‌మే చాలామందికి మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. మోడీ వ్య‌తిరేక శ‌క్త‌ల‌తోపాటు, టీడీపీ వ్య‌తిరేక నేత‌ల‌ను ఈ వేదిక ద్వారా ఏకం చేస్తున్న అభిప్రాయం క‌లుగుతోంది. ఇక‌, ఈ తొలి స‌మావేశంలో ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌బోయే కార్యాచ‌ర‌ణ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.