ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని విజయపథంలో నడిపించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే ఫార్ములాను తమిళనాడులో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దళపతి విజయ్‌ని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం ద్వారా డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్‌కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారంతో పవన్ కల్యాణ్ తమిళ మీడియాకు ఇంటర్యూ ఇస్తున్నారు.
తంతి టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్యూలో పవన్ కల్యాణ్ విజయ్ నటించిన జననాయగన్ చిత్ర సెన్సార్ వివాదం, కరూర్ ఘటనపై సీబీఐ విచారణ వంటి పరిణామాలపై స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కేవలం విజయ్ గురించే కాకుండా, తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాల అవశ్యకతను వివరించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో తాము సాధించిన విజయం, కూటమి పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉందనే విషయాలను పంచుకున్నారు.
ఆదివారం పవన్ ఇంటర్యూనూ తంతి టీవీ ప్రసారం చేయనుంది. విజయ్ పార్టీ టీవీకే నాయకులు ప్రస్తుతం ఒంటరిగా వెళ్లాలని భావిస్తున్నప్పటికీ, పవన్ చర్చల తర్వాత వారి ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఈ ఇంటర్వ్యూపై అటు విజయ్ అభిమానులు, ఇటు రాజకీయ నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ను ఎన్డీఏలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు సఫలమయ్యారు? సీబీఐ విచారణపై ఆయన స్పందన ఏమిటి? అనే ప్రశ్నలకు ఈ ఇంటర్యూ ద్వారా స్పష్టత రానుంది.


