జనసేన సిద్ధాంతాలు ప్రకటించిన పవన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న క‌రీంన‌గ‌ర్ లో మాట్లాడారు. పార్టీకి సంబంధించి కొన్ని సిద్ధాంతాల‌ను ప్ర‌క‌టించారు. వాటి సాధ‌న కోస‌మే జ‌న‌సేన పోరాటం చేస్తుంద‌న్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌ను విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌పై కూడా ప‌వ‌న్ స్పందించారు. వారంతా త‌న సోద‌రులే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ల ప‌సిబిడ్డ అనీ, భ‌ద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. తాను పాతికేళ్ల సుదీర్ఘ ప్ర‌యాణం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌నీ.. త‌న‌తో కలిసి ప్ర‌యాణించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ యువ‌త‌ను ప్ర‌శ్నించారు. ఆంధ్రా త‌న‌కు జ‌న్మ‌నిస్తే.. తెలంగాణ పున‌ర్జ‌న్మ‌ను ఇచ్చింద‌న్నారు. జై తెలంగాణ నినాదం వింటే త‌న‌కు పుల‌కింత క‌లుగుతుంద‌న్నారు. అది వందేమాత‌రం లాంటి ప‌ద‌ం అన్నారు.

ఏ రాజ‌కీయ పార్టీ అయినా సిద్ధాంతాలు లేకుండా ముందుకెళ్ల‌ద‌న్నారు. అలాగే జ‌న‌సేన కూడా ఏడు సిద్ధాంతాలు త‌యారు చేసుకుంద‌న్నారు. కులాల‌ను క‌లిపే ఆలోచ‌నా విధానం, మ‌తాలు ప్ర‌స్థావ‌న లేని రాజ‌కీయం, భాష‌ల్ని గౌర‌వించే సంప్ర‌దాయం, సంస్కృతిని కాపాడే స‌మాజం, ప్రాంతీయ‌త‌ను విస్మ‌రించ‌ని జాతీయ వాదం, అవినీతీ అక్ర‌మాల‌పై రాజీలేని పోరాటం, ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించే విధానం… ఇవే ఆ ఏడు సిద్ధాంతాలు! ఇవి ప్ర‌క‌టించిన త‌రువాత‌.. ఒక్కో అంశాన్ని మ‌రింత విఫులంగా ప‌వ‌న్ చెప్పారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి కూడా ఇవాళ్ల కూడా మాట్లాడారు. ప్ర‌జ‌ల కోసం, ఒక ల‌క్ష్యం కోసం పోరాడిన‌వాళ్లంటే త‌న‌కు మొద‌ట్నుంచీ ఇష్ట‌మ‌నీ, అలాగే.. కేసీఆర్ తో కూడా కొన్ని అంశాల‌పై విభేదించే ప‌రిస్థితి కూడా ఉంటుంద‌న్నారు. త‌న‌కు వ్య‌క్తుల‌తో ఎప్పుడూ గొడ‌వ‌లు లేవ‌నీ, విధి విధానాల‌తోనే విభేదాలు ఉంటాయ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. ద్వేషించేవాళ్ల గురించి ఆలోచించేంత టైం లేద‌నీ, త‌న‌ను ప్రేమించేవాళ్లు ఇంతమంది ఉన్న‌ప్పుడు అలాంటివి ప‌ట్టించుకోవాల్సిన ప‌నేముంద‌న్నారు.

ఇక‌, ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సంబంధించి పవన్ ప్ర‌స్థావించారు. తెలంగాణ‌లో ఆ మ‌ధ్య జ‌రిగిన మ‌హా స‌భ‌ల‌కు ఆంధ్రా ప్రాంతం వారికి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ఇదే అంశం త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. గుంటూరు శేషేంద్ర శ‌ర్మ కుటుంబానికి చెందిన‌వారు ఈ విష‌యం త‌న‌కు చెప్పార‌నీ, తెలుగు మ‌హా స‌భ‌ల్లో శేషేంద్ర శ‌ర్మ‌కుగానీ, గుర‌జాడ వంటివారికిగానీ స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని వార‌న్నార‌ని చెప్పారు. అయితే, తెలంగాణ క‌వులూ క‌ళాకారుల‌కు స‌రైన గుర్తింపు ద‌క్కాల్సిన త‌రుణ‌మిద‌నీ, ఈ స‌భ‌ల్ని అలానే చూడాలిగానీ.. ఇత‌రుల‌కు ప్రాధాన్య‌త త‌గ్గించాల‌న్న ఉద్దేశంతో జ‌రిగిన‌ట్టు కాద‌ని వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు చెప్పాన‌ని ప‌వ‌న్ అన్నారు. తెలంగాణ‌లో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నీ, దీనిపై మ‌రింత అవ‌గాహ‌న మార్చి 14 లోపు ఇస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ప‌వ‌న్ ప్రెస్ మీట్ ఇలా సాగింది. సిద్ధాంత ప్ర‌క‌ట‌న త‌ప్ప‌.. మిగ‌తా అంశాల‌న్నీ కాస్త రొటీన్ గానే అనిపించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.