ముద్రగడపై జ‌న‌సేనాని వైఖ‌రి మారుతోందా..?

తాను ఒక కులానికి ప్ర‌తినిధి కాద‌నీ, అంద‌రివాడిన‌నీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా సంద‌ర్భాల్లో చెబుతూ ఉంటారు. అన్ని సామాజిక వ‌ర్గాల ప్ర‌తినిధిని అని అంటారు! కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కూడా చాలాసార్లు ఇదే త‌ర‌హాలో స్పందించారు. కాపు ఉద్య‌మంపై కూడా ఆచితూచి మాట్లాడిన సంద‌ర్భాలున్నాయి. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై కూడా సున్నితంగా విమ‌ర్శ‌లు చేసిన గ‌త‌మూ ఉంది. ఈ క్రమంలో టీడీపీ నిర్ణయాన్ని వెనకేసుకొచ్చిన సందర్భమూ ఉంది, కులాల రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఘటనలూ ఉన్నాయి. అయితే, ఈ మ‌ధ్య‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ తో త‌న‌కు ఎలాంటి ప‌రిచ‌య‌మూ లేద‌నీ, త‌న‌కు ఆయ‌న తెలీద‌ని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించిన సంగ‌తి కూడా మ‌నం గుర్తుచేసుకోవాలి.

ఇక‌, అస‌లు విష‌యానికొస్తే… జ‌న‌సేన కోశాధికారిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న మాడిశెట్టి రాఘ‌వ‌య్య‌తోపాటు కొంత‌మంది కీల‌క నేత‌లు కాపు ఉద్య‌మనేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఇంటికి వెళ్లారు. ముద్ర‌గ‌డ‌తో దాదాపు మూడు గంట‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ భేటీకి కొంత‌మంది కాపు ఉద్య‌మ నేత‌లు కూడా హాజ‌రు కావ‌డం విశేషం. అనంత‌రం ఈ భేటీపై రొటీన్ కామెంట్లే చేశారు జ‌న‌సేన నేత‌లు! ఈ స‌మావేశానికి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌నీ, కాపు రిజ‌ర్వేష‌న్లకు సంబంధించి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో… ముద్ర‌గ‌డ కార్యాచ‌ర‌ణ ఏంటో తెలుసుకోవ‌డం కోసం తాము వ‌చ్చామ‌ని జ‌న‌సేన నేత‌లు చెప్పారు. ముద్ర‌గ‌డ‌తో భేటీలో రిజ‌ర్వేష‌న్ల అంశం మాత్ర‌మే చ‌ర్చించామ‌ని అన్నారు. అయితే, అస‌లు విష‌యం వేరే ఉందనీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా క‌లిసి న‌డ‌వాల‌నే అంశాన్నే కీల‌కంగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో ఈ భేటీ కొంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రీ ముఖ్యంగా కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డపై ప‌వ‌న్ క‌ల్యాణ్ మారుతోందా అనే చ‌ర్చ‌కు ఆస్కారం ఇచ్చిన భేటీ ఇది. ఎందుకంటే, ఇది జ‌న‌సేన పార్టీ నుంచి ప‌డిన అడుగు. అంతేగానీ, కాపు ఉద్య‌మ నేత‌లు జ‌న‌సేనతో భేటీ కోసం ప్ర‌య‌త్నించలేదు క‌దా! కాబ‌ట్టి, రాజ‌కీయంగా ఇది అత్యంత కీల‌క‌మైన ప‌రిణామంగానూ చూడొచ్చు. తాను అన్ని సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కుడికి అని ప‌వ‌న్ చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ముద్ర‌గ‌డ‌తో జ‌న‌సేన నేత‌లు ప్రత్యేకంగా భేటీ కావ‌డం, రిజ‌ర్వేష‌న్ల‌తో స‌హా ఎన్నిక‌ల అంశాల‌ను కూడా చ‌ర్చించార‌ని తెలుస్తుండ‌టం విశేషం! నిజానికి, కాపుల్ని ప్ర‌సన్నం చేసుకోవ‌డం కోసం ఇటీవలే రిజ‌ర్వేష‌న్ల అంశ‌మై టీడీపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. అయినా ముద్ర‌గ‌డ సంతృప్తిగా లేరు. ఆ నిర్ణ‌యం వెంట‌నే అమ‌ల్లోకి రావాల‌నీ, లేకుంటే మ‌రోసారి ఉద్య‌మించాల్సి వ‌స్తుందంటూ డెడ్ లైన్లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన నేత‌లు ఆయ‌న్ని క‌ల‌వ‌డం అనేది కాస్త ప్ర‌త్యేకంగానే క‌నిపిస్తోంది. మ‌రి, ఈ భేటీపై జ‌న‌సేన వ్యూహం ఏంట‌నేది మ‌రింత స్ప‌ష్టంగా ప‌వ‌న్ వివ‌రిస్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.