విశ్లేషణ: పవన్ కళ్యాణ్ కెసి ఆర్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడా?

పవన్ కళ్యాణ్ టూర్ ముగిసింది. టూర్ కి ముందు, తర్వాత టివి డిబేట్ లు,స్పీచుల మీద విశ్లేషణలు, విమర్శలు అన్నీ పూర్తయ్యాయి. ఇక మరి కొద్ది రోజుల పాటు పవన్ రాజకీయ అంశాల మీద కంటే సినిమా డబ్బింగ్ మీద, ఆడియో ఫంక్షన్ మీద, ప్రమోషన్ మీద ఫోకస్ చేస్తాడు కావచ్చు. మరి ఇది పార్ట్ రాజకీయం అని ప్రత్యర్థుల విమర్శలూ మొదలవుతాయి. కానీ జాగ్రత్తగా పరికించి చూస్తే పవన్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ కి కెసి ఆర్ స్ట్రాటజీ కి పోలికలు కనిపిస్తున్నాయి. అంటే దీనర్థం పవన్ కూడా కెసి ఆర్ లాగా కాకలు తీరిన రాజకీయ నాయకుడు అని కాదు, కేవలం ఆ స్ట్రాటజీ కి ఈ స్ట్రాటజీ కి కొన్ని పోలికలు ఉన్నాయని మాత్రమే. అయితే ఇది తెలిసే చేస్తున్నాడా తెలీకుండానే చేస్తున్నాడా అనేది చెప్పడం కష్టం. కాస్త లోతుగా పరిశీలిస్తే –

1. కెసిఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నన్ని రోజులూ ఆయన మీద ఉన్న ఒక ప్రధాన విమర్శ ఎప్పుడో ఆయనకి మెలకువ వచ్చినపుడు ఫాం హౌస్ నుంచి వస్తాడనీ, ఏవేవో విషయాల మీద మాట్లాడేసి మళ్ళీ గాయబ్ అయిపోతాడనీ, మళ్ళీ ఎప్పుడొస్తాడో ఆయనకే తెలీదనీ – ఇలా ఉండేవి ఆయన మీద విమర్శలు. అనుదినం రాజకీయాల మీద స్పందించడం అనేది కెసి ఆర్ ఏనాడూ చేయలేదు. ఇప్పుడు పవన్ కూడా అదే చేస్తున్నాడు. ముందు రోజు వరకూ మీడియాకి కూడా సమాచారం ఇవ్వకుండా సడెన్ గా నిర్ణయాలు తీసుకోవడం, సడెన్ గా పర్యటనలు చేయబూనుకోవడం. రాజకీయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళకి ఈ పోలిక సుస్పష్టం గా కనిపిస్తోంది.

2. కెసిఆర్ ఉద్యమ సమయం లో మాట్లాడే మాటలు చాలా పదునుగా ఉండేవి. ఆ రోజుల్లో మిగతా నాయకులు కెసి ఆర్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడం లో విఫలం అయ్యారనే చెప్పాలి. ఒక సారి వచ్చి “నిజాం అంత గొప్పోడు ఎవ్వరూ లేరు. ఈ ఆంధ్రోళ్ళ పాలన తో పోలిస్తే నిజాం పాలన వేలరెట్లు గొప్పది” అని అర్థం వచ్చేట్టు మాట్లాడేసి యధావిధిగా గాయబ్ అయిపోయేవాడు. మిగతా పార్టీల నాయకులందరూ వరసకట్టి వచ్చి ఆ వ్యాఖ్యల్ని ఖండించే వాళ్ళు. కెసి ఆర్ ఆ వ్యాఖ్యలు చేసిన నాటి నుండీ పది రోజుల వరకు రోజూ ఎవరో ఒక నాయకుడు తక్షణం కెసి ఆర్ ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చేవారు. కానీ స్పందించడానికి కెసి ఆర్ బయటికి వస్తే కదా, అడగడానికి మీడియాకి చిక్కితే కదా. తీరా ఏ మూణ్ణెల్ల తర్వాతో వచ్చి, పాత వ్యాఖ్యలని సమర్థించుకోవడం కానీ, వాటి మీద ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యలు అసలు పట్టించుకోవడం కానీ చేయకుండా – “ఆంధ్రోళ్ళ బిరియానీ పేడ లా ఉంటుంది” లాంటి ఇంకో కొత్త వ్యాఖ్య చేసి వెళ్ళిపోయేవాడు. మాళ్ళీ ఈ ప్రత్యర్థి నాయకులంతా నిజంగా ఆంధ్రా బిరియానీ బాగుంటుందని సమర్థించుకుంటూ, “కెసి ఆర్ కోడలు ఆంధ్ర కి చెందిందే, బహుశా ఆమె చేసిన బిరియానీ తిని ఆ అభిప్రాయానికి వచ్చి ఉంటాడు” లాంటి సెటైర్లు వేసుకుంటూ ఓ పది రోజులు మీడియా లో టైం పాస్ చేసే వారు. ఆ నాయకులు ఫెయిలయిన విషయం ఏంటంటే, కెసి ఆర్ వచ్చిన ప్రతీసారీ వాళ్ళు “ట్రాప్” అయ్యారు. ఆ పది రోజుల పాటు కెసి ఆర్ కోరుకున్న టాపిక్ మీదే అందరూ మాట్లాడారు. మీడియా సైతం ఆ TRaP లోనే TRP ని వెతుక్కుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలిసే చేస్తున్నాడో తెలీక చేస్తున్నాడో తెలీదు కానీ ఆ వారం రోజులూ, ఆయన ప్రసంగాలకి “హైపర్” అయిపోయేవళ్ళూ, ఆయన మీద “కత్తి” నూరేవాళ్ళూ, మిత్రపక్షలూ, ప్రతిపక్షాలూ మొత్తం తన గురించే మాట్లాడుకునేలా “ట్రాప్” చేయడం లో సక్సెస్ అయ్యాడు. మళ్ళీ నెక్స్ట్ పర్యటన కి మళ్ళీ కొత్త విషయాలుంటాయి.

3. ఇక కెసి ఆర్ స్థాయి లో కాకపోయినా పవన్ కళ్యాణ్ కూడా ఉపన్యాసాల్లో ఆరితేరిపోయాడు. కెసిఆర్ తో పోల్చే స్థాయి కాదు కానీ, కొంచెం నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే బాబు, జగన్, లోకేష్ ల తో పోలిస్తే మంచి వక్తగా ఆరితేరాడు. ఒక్కోసారి “కొమరం పులి” లాంటి సినిమాల ఆడియో ఫంక్షన్లలో అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడిన పవన్, ఇప్పుడీ స్పీచులిస్తున్న పవన్ ఒక్కడేనా అనేంత మార్పు కనిపిస్తోంది.

4. ఇంతే కాదు, ఉపన్యాసాల్లో కొంతమంది నాయకులని టార్గెట్ చేసి పదునైన కామెంట్స్ చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా స్పీచ్ కి “సెంటిమెంట్” రంగరించే ప్రయత్నం చేయడం, ఎవ్వరూ ఊహించని టాపిక్ లని సడెన్ గా నెత్తికెత్తుకోవడం, అనవసరంగా సెల్ఫ్ గోల్ చేసుకోవడం, ఇలా చాలా అంశాల్లో కెసి ఆర్ స్ట్రాటజీ కి పవన్ స్ట్రాటజీ కి పోలికలు కనిపిస్తున్నాయి.

అయితే పవన్ ఉద్దేశ్యపూర్వకంగా కెసిఆర్ ని అనుస(క)రిస్తున్నాడా అనేది మనం చెప్పలేం. అలాగని కెసిఆర్ ని ఫాలో అయినంత మాత్రాన ఆయనలా సక్సెస్ అవ్వాలనీ లేదు, కొన్ని సార్లు పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టూ కావచ్చు. ఏది ఏమైనా, ఈ స్ట్రాటజీలు కాదు రాజకీయాల్లో సక్సెస్ ని నిర్దేశించేది – ఎంత చిత్తశుద్ది ఉందీ, ఎంతవరకు ప్రజల పల్స్ ని అర్థం చేసుకున్నదీ, వారి సమస్యలు తీర్చగల శక్తి ఉందని ఎంతవరకు కన్విన్స్ చేయగలిగేదీ లాంటి అనేక అంశాలు ఆ సక్సెస్ ని డిక్టేట్ చేస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.