ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు ఆయన అభిమానులను, రాజకీయ వర్గాలను కొంత ఆందోళనకు గురిచేసింది. అయితే ఆయన సమస్య చిన్నదేనని స్పష్టమయింది. పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, అలసట వంటి కారణాలతో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు ముక్కుకు సంబంధించిన డేకేర్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
వెంటనే ఇంటికి చేరుకున్న పవన్
శుక్రవారం ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటనే వైద్యులను సంప్రదించగా, వారు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించి సైనసైటిస్ తీవ్రతను గుర్తించారు. తక్షణమే శస్త్రచికిత్స అవసరమని సూచించడంతో శనివారం సాయంత్రం డాక్టర్ మనుస్రుత్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ అయ్యి తన నివాసానికి చేరుకున్నారు.
వారం పది రోజుల విశ్రాంతి
వైద్యులు ఆయనకు కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటివరకు ఆయన తన అధికారిక కార్యక్రమాలను, పర్యటనలను రద్దు చేసుకున్నారు. మే నెలకు ముందుగానే ఆయన పూర్తి స్వస్థత చేకూరి మళ్ళీ ప్రజల మధ్యకు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, మరింత శక్తివంతంగా తిరిగి రావాలి అని చంద్రబాబు ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోండి పవనన్నా అని లోకేష్ పేర్కొన్నారు.
పవన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు
అభిమానులు కూడా తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సైనసైటిస్ అనేది సాధారణ సమస్యే అయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని, అందుకే ఈ సర్జరీ తప్పనిసరైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
