ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధిగానే కాకుండా.. తన రాజకీయానికి హ్యూమన్ టచ్ ఇస్తున్నారు. పిఠాపురం మొత్తాన్ని ఆత్మీయ కుటుంబంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజా ప్రతినిధి పాత్రకు భిన్నంగా, ఆయన అక్కడ ఒక కుటుంబానికి పెద్దన్న తరహాలో ప్రతి ఇంటి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా, నియోజకవర్గంలోని పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో భరోసా కల్పిస్తూ, ఒక పెద్దన్న తన కుటుంబం పట్ల చూపే బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు.
పిల్లల భవిష్యత్‌పై ప్రత్యేక శ్రద్ధ
ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం కల్పించడంతో పాటు, తల్లిదండ్రులు లేని చిన్నారులకు భగవంతుని బిడ్డలు అని పేరు పెట్టి తన సొంత జీతం నుంచి నెలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక తండ్రి తన పిల్లల చదువు కోసం ఎలాగైతే తపన పడతారో, పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం విద్యార్థుల కలలకు రెక్కలు తొడుగుతున్నారు. విద్యా సంస్థలను ఒప్పించి ఉచిత అడ్మిషన్లు ఇప్పించడం ద్వారా ఒక తరం భవిష్యత్తును ఆయన తీర్చిదిద్దుతున్నారు.
ప్రతి ఇంటికి పవన్ పలకరింపులు
సంక్షేమ పథకాలను కేవలం ప్రభుత్వ ఫైళ్లకు పరిమితం చేయకుండా, పండుగ వచ్చిందంటే పిఠాపురంలోని ప్రతి ఆడబిడ్డకు తన తరఫున చీరలు పంపడం, కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవడం ఆయనకు అలవాటుగా మారింది. ఉపాధ్యాయుల సమస్యలైనా, సామాన్యుల ఆరోగ్య అవసరాలైనా పవన్ ఉన్నారు అనే ధీమా ఇప్పుడు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. క్షే జలు ఆయనను ఒక నాయకుడిలా కంటే, తమ ఇంటి పెద్ద దిక్కులా భావించి కష్టాలు చెప్పుకుంటున్నారు. వాటిని ఆయన పరిష్కరిస్తున్నారు.
అభివృద్ధిలోనూ రోల్ మోడల్
పిఠాపుం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా మార్చే క్రమంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఈ వ్యక్తిగత సహాయ – సామాజిక బాధ్యత ఫార్ములా ఒక సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికింది. అభివృద్ధి పనుల కోసం నిధులు తేవడం ఒక ఎత్తు అయితే, తన వ్యక్తిగత ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం మరో ఎత్తు. పిఠాపురం ప్రజల పట్ల ఆయన చూపిస్తున్న ఈ వాత్సల్యం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఒక ఆత్మీయ అనుబంధంగా మారుతోంది.

