సినిమాలొద్దు.. ఫంక్ష‌న్లు కావాలా ప‌వ‌న్‌..??

”నాకు సినిమాలంటే పెద్ద‌గా ఆస‌క్తి లేదు.. అటువైపు ఆలోచించ‌లేక‌పోతున్నా”
– ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌చుగా చెప్పే మాట‌.

ఓ స్టార్ హీరో, కోట్ల‌కు కోట్లు పారితోషికం తీసుకుంటున్న హీరో, కేవ‌లం సినిమాల వ‌ల్లే.. పైకి ఎదిగిన వ్య‌క్తి, సినిమా రంగం ద్వారానే ల‌క్ష‌లాది అభిమానుల్ని సంపాదించుకున్న‌వాడు.. ఇలా మాట్లాడ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఆ మాట‌కొస్తే.. ఏ స్టార్ కూడా ‘నాకు సినిమాలంటే ఆసక్తి లేదు’ అని మాట్లాడ‌డు. ‘సినిమాలంటే ప్రాణం.. చివ‌రి శ్వాస వ‌ర‌కూ సినిమాల్లోనే ఉంటా’ అంటూ క‌వ‌రింగులు ఇస్తారు. అలాంటిది ప‌వ‌న్ ఇలా మాట్లాడ‌డం ఎప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.

జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్‌కి ఇప్పుడు సినిమాల్లో న‌టించే తీరిక లేదు. బ‌య‌టి నుంచి ఎంత ఒత్తిడి వ‌స్తున్నా, అభిమానులు – భ‌క్తులు ‘అన్నా నువ్వో సినిమా చేయాల్సిందే’ అంటున్నా ప‌వ‌న్ క‌నిక‌రించ‌డం లేదు. కొత్త క‌థ‌లూ విన‌డం లేదు. 2019 ఎన్నిక‌ల స‌న్నాహాల్లో ప‌వ‌న్ బిజీగా ఉన్నాడు కాబ‌ట్టి.. ఈలోగా ప‌వ‌న్ మ‌రో సినిమా చేస్తాడ‌ని ఆశించ‌డం కూడా త‌ప్పే.

అయితే విచిత్రం ఏమిటంటే.. సినిమాల‌కు దూరంగా ఉంటానంటున్న ప‌వ‌న్.. ఇప్పుడు సినిమా ఫంక్ష‌న్ల‌కు మాత్రం బాగా ద‌గ్గ‌రైపోయాడు. రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్‌కి వ‌చ్చిన ప‌వ‌న్ ఆ సినిమా కోసం ఏకంగా అర‌గంట మాట్లాడేశాడు. నా పేరు సూర్య సినిమా అటూ ఇటూ అయినా.. ఆ సినిమానీ మోసే బాధ్య‌త తీసుకున్నాడు. నేల టికెట్టు ఆడియో ఫంక్ష‌న్లోనూ ప‌వ‌న్ మెరిశాడు. ఇప్పుడు ‘సాక్ష్యం’ ఆడియో ఫంక్ష‌న్‌కి రావ‌డానికి ప‌వ‌న్ ఓకే అన్నాడ‌ని స‌మాచారం. ఇలా వ‌రుస‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టేజీలెక్కి.. సినిమాల కోసం మాట్లాడ‌డం మ‌రోర‌క‌మైన ఆశ్చ‌ర్యం. సినిమాలొద్దుబాబోయ్ అంటున్న ప‌వ‌న్‌కి ఈ సినిమా ఫంక్ష‌న్లు కావ‌ల్సివ‌చ్చిందా? అనే అనుమానం రావ‌డం కూడా అతి స‌హ‌జం.

సాధార‌ణంగా ప‌వ‌న్‌కి సినిమా ఫంక్ష‌న్లంటే పెద్ద‌గా న‌చ్చ‌దు. చాలా కాలం వ‌ర‌కూ త‌న ఆడియో ఫంక్ష‌న్లే చేసుకోలేదు. ప‌వ‌న్‌ని ఓ కార్య‌క్ర‌మానికి పిల‌వాలంటే.. ఎంతో క‌ష్టంగా అనిపించేది. ప‌వ‌న్ రాడ‌ని డిసైడ‌య్యే.. ఆహ్వానం అందించేవారు. మెగా కార్య‌క్ర‌మాలు చాలా వాటికి ప‌వ‌న్ వెళ్ల‌లేదు. వ‌ప‌న్ ఓ ఆడియో ఫంక్ష‌న్ కి అతిథిగా వ‌చ్చాడంటే అదో విడ్డూరంగా, టాక్ ఆఫ్ ది టౌన్‌తో తోచేది. అయితే ప‌వ‌న్‌లో ఈమ‌ధ్య ఊహించ‌ని మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు? అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. రంగ‌స్థ‌లం సినిమా బాగుంది కాబ‌ట్టి ఆ ఫంక్ష‌న్‌ని వ‌చ్చాడ‌నుకుందాం? నేల టికెట్‌కీ, నా పేరు సూర్య కార్య‌క్ర‌మాలకు రావ‌డానికి ప‌వ‌న్‌కి వేర్వేరు కార‌ణాలున్నాయ‌ని భోగ‌ట్టా. ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు రావ‌డం వెనుక.. ప‌వ‌న్ ఉద్దేశ్యం ఒక్క‌టే కావొచ్చు. ‘సినిమాల‌కు దూరంగా ఉన్నా.. ఈ ప‌రిశ్ర‌మ‌కు కాదు’ అని చెప్ప‌డం కావొచ్చు. లేదంటే సినిమా రంగాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్‌ని కాస్త క‌వ‌ర్ చేసుకోవ‌డానికి కావొచ్చు. ప‌వ‌న్ చాలా కార్య‌క్ర‌మాల‌కు కేవ‌లం బ‌ల‌వంతంపైనే వ‌స్తాడ‌ని ఆయ‌న స‌న్నిహితులు కూడా చెబుతుంటారు. క‌నీసం ఇలాగైనా ప‌వ‌న్‌ని చూసుకోవొచ్చు.. ప‌వ‌న్ మాట‌లు వినొచ్చు అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. కాక‌పోతే.. ఇలా ప్ర‌తీ కార్య‌క్ర‌మానికీ ప‌వ‌న్ వెళ్లిపోతే… ఈ క్రేజ్ కూడా క్ర‌మంగా త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. అది కూడా ప‌వ‌న్ గుర్తించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com