ఆ సామాజిక వ‌ర్గాల క‌ల‌యికే జ‌న‌సేనాని ల‌క్ష్యం!

సొంత అజెండాతోనే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా ప‌ర్య‌ట‌న చేస్తున్నారా? లేదా ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తున్న‌ట్టు ఇత‌రుల అజెండాను త‌న భుజాల మీద వేసుకున్నారా అనే చ‌ర్చ‌ను కాసేపు ప‌క్క‌న పెడ‌దాం. గ‌డ‌చిన రెండ్రోజులుగా ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో కొన్ని రెండు కీల‌క అంశాల‌పై త‌న వాణినీ బాణినీ వివ‌రిస్తూ… ఆ రెండు అంశాల ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పొచ్చు. మొద‌టిది… వైకాపా అధినేత జ‌గ‌న్ గురించి మాట్లాడ‌టం! అనుభ‌వం ఉన్న‌వారే ముఖ్యమంత్రిగా అర్హుల‌నీ, అధికారం వ‌స్తే త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌రా అంటూ ప్ర‌తిప‌క్షాన్ని ఉద్దేశించి అభిప్రాయ‌ప‌డుతున్నారు. సో.. ప‌రోక్షంగా ఇది ఎవ‌రికి మేలు చేస్తోందనేది అంద‌రికీ తెలిసిందే. ఇక‌, రెండోదీ అత్యంత కీల‌క‌మైందీ కులాల చ‌ర్చ‌!

కులం గురించి పవన్ బ‌లంగానే మాట్లాడుతున్నారు. వైజాగ్‌, రాజ‌మండ్రిలో కూడా ఇదే అంశంపై మాట్లాడారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఇక్క‌డ ప్ర‌స్థావ‌నార్హం. నెల్లూరులో తాను ఇంట‌ర్ చ‌దువుకునే రోజుల్లో, త‌న జూనియ‌ర్ ఒక‌బ్బాయి గుడ్ల‌వ‌ల్లేరు చ‌దువుకోవ‌డానికి వెళ్లాడ‌ని చెప్పారు. ఏడాది త‌రువాత ఆ కుర్రాడు ఏడ్చుకుంటూ తిరిగి వ‌చ్చేశాడ‌నీ, ఎందుకంటే అక్క‌డ కులం పేరుతో త‌న‌ని ఏడిపిస్తున్నార‌ని వాపోయాడ‌ు అన్నారు. ఆ త‌రువాత‌, విజ‌య‌వాడ‌లో కులాల పోరాటాలు త‌న‌కు బాగా తెలుసు అని ప‌వ‌న్ చెప్పారు. ఒక స‌మాజం ముందుకెళ్లాలంటే కులాల‌ను దాటి వెళ్లాల‌న్నారు. టీడీపీకి తాను మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వెన‌క అభివృద్ధితో పాటు మ‌రో కార‌ణం కూడా ఉంద‌న్నారు. ఇక్క‌డ కులాల మ‌ధ్య ఐక్య‌త లేద‌న్నారు. వంగ‌వీటి రంగా మరణం ఒక తప్పు అనీ, దాని వ‌ల్ల నెల‌రోజుల‌పాటు విజ‌య‌వాడ త‌గ‌ల‌బ‌డింద‌న్నారు. అంతేకాదు, వంగ‌వీటి హత్య‌కు సంబంధం లేని కుటుంబాలు న‌లిగిపోయాయ‌నీ, వారిలో క‌మ్మ‌వారున్నారు, సంబంధం లేకుండా అరెస్ట్ అయిన కాపులున్నారు అన్నారు. తాను నెల్లూరులో పెరిగాన‌నీ, అక్క‌డ త‌న కులం ఏంట‌ని ఎవ్వ‌రూ అడ‌గ‌లేద‌న్నారు. కానీ, ఒక కులమంటే మ‌రో కులానికి ఎదురు అనే భ‌యాందోళ‌న‌లు ఇప్ప‌టికీ మన సమాజంలో ఉన్నాయ‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మొత్తానికి, పవ‌న్ ఆవేదన ఏంట‌నేది అర్థ‌మౌతోంది. గ‌తంలో తాను టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా ఆ రెండు కులాల మ‌ధ్య సఖ్య‌త‌ను కాంక్షించాన‌ని అంత‌ర్లీనంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా త‌న త‌ప‌న అదే అనే ఆవేద‌న‌తోనే మాట్లాడుతున్నారు. స‌మాజం ముందుకెళ్లాలంటే కులాల‌ను దాటి వెళ్లాల‌ని అంటున్నారు. వ‌రుస క్ర‌మంలో ప‌వ‌న్ తాజా ప్ర‌సంగాల‌ని గ‌మ‌నిస్తే… ముందుగా, అనుభ‌వం ఉన్న నాయ‌కుడు ముఖ్య‌మంత్రి కావాల‌న్నారు. ఆ త‌రువాత‌, అధికారం వ‌చ్చే వ‌ర‌కూ ఎదురు చూడమ‌ని కోర‌డం ప్రతిపక్షానికి త‌గ‌దన్నారు! ఆ త‌రువాత‌, ఆ రెండు కులాల క‌ల‌యిక చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. కుల వివ‌క్ష‌లు లేని స‌మాజం కోరుకోవ‌డం క‌చ్చితంగా మంచి విషయమే. కాక‌పోతే, ఈ కోరిక వెన‌క అంబేద్క‌ర్ ఆశ‌యం ఒక్క‌టే ఉంటే ఫ‌ర్వాలేదు. కానీ, దాన్ని దాటి వేరే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కూడా ఏదో అస్ప‌ష్టంగా ప‌వ‌న్ మాట‌ల్లో ఉంద‌నే అనుమానాల‌కు తావు ఇచ్చే విధంగా తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయా అనే అభిప్రాయాన్ని కొంత‌మంది వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.