కాట‌మ‌రాయుడు రివ్యూ : అభిమానుల్ని ఆకట్టుకొనే సినిమా

బ‌ల‌మైన అభిమాన గ‌ణం క‌లిగివున్న క‌థానాయకుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఆయ‌న సినిమా అన‌గానే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఆకాశానికి చేర‌తాయి. ఒక మాదిరి క‌థ‌ని కూడా త‌న న‌ట‌న‌తో మ‌రోస్థాయికి తీసుకెళుతుంటారు. ప్రేక్ష‌కుల‌కి ఆ సినిమా న‌చ్చిందంటే ఇక వ‌సూళ్లకి హ‌ద్దే ఉండ‌దు. అందుకే ప‌వ‌న్ సినిమా అంటే అభిమానులతో పాటు, ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటాయి. కెరీర్‌లో రీమేక్ సినిమాల‌తో ఎక్కువ‌గా విజ‌యాలు అందుకొన్న ప‌వ‌న్, మ‌రోసారి రీమేక్ క‌థ‌తోనే `కాట‌మ‌రాయుడు` చేయ‌డంతో సినిమా ఫలితం మరింత మరింత ఆసక్తి ఏర్పడింది. మరి అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా?

* క‌థ‌

న‌లుగురు త‌మ్ముళ్ల‌కి అన్న‌య్య కాట‌మ‌రాయుడు (ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌). ఆ ఊళ్లో ఓ పెద్ద మ‌నిషి. ఏం చేసినా నీతిగా చేయాల‌నేది ఆయ‌న సిద్ధాంతం. ఆ ఊళ్లో మోతుబ‌రి అయిన న‌ర్స‌ప్ప (రావు ర‌మేష్‌) మాత్రం అలా కాదు. నీతి లేని ప‌నులు చేస్తుంటాడు. ఆ విష‌యం తెలుసుకొన్న కాట‌మ‌రాయుడు ఊరి జ‌నం ముందే అత‌ని ఆట క‌ట్టిస్తాడు. అప్ప‌ట్నుంచి కాట‌మ‌రాయుడుని త‌న శ‌తృవుగా చూస్తుంటాడు న‌ర్స‌ప్ప‌. రాయుడ‌ని దెబ్బ తీయ‌డానికి స‌రైన స‌మ‌యం కోసంఎదురు చూస్తుంటాడు. అదే స‌మ‌యంలో ఆ ఊరి గుండా ఎర్ర‌చంద‌నం త‌ర‌లించ‌డానికి బిజినెస్ డీల్ కోసం కాట‌మ‌రాయుడు ద‌గ్గ‌రికి వ‌స్తాడు వ్యాపార‌వేత్త రాడీ (ప్ర‌దీప్ రావ‌త్‌). అది అక్ర‌మం అని రాడీకి, అత‌ని త‌మ్ముడికి బుద్ధి చెప్పి పంపుతాడు కాట‌మ‌రాయుడు. ఆ ర‌కంగా రాయుడుకి రాడీ రూపంలో మ‌రో శత్రువు ఏర్ప‌డ‌తాడు. అయినా స‌రే, తాను న‌మ్మిందే చేసే రాయుడుకి అమ్మాయిలంటే అస్స‌లు ప‌డ‌దు. కానీ త‌న త‌మ్ముళ్ల ప్లాన్‌తో అవంతిక (శ్రుతిహాస‌న్‌)కి ద‌గ్గ‌ర‌వుతాడు. ఇంత‌లో అవంతిక‌పై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. ఇంత‌కీ అవంతిక ఎవ‌రు? ఆమెని హ‌త్య చేయాల‌ని ప్లాన్ వేసింది కాట‌మ‌రాయుడు శ‌త్రువులేనా? అవంతిక‌, రాయుడుల ప్రేమ‌క‌థ ఎక్క‌డిదాకా చేరింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి రీమేక్ సినిమాలు బాగా అచ్చొచ్చాయి. ఆయ‌న‌కి విజ‌యాల్ని అందించిన సినిమాల్లో చాలావ‌ర‌కు రీమేక్‌లే. వాటి స‌ర‌స‌న `కాట‌మ‌రాయుడు` కూడా చేరుతుంది. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `వీర‌మ్‌`కి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. నిజానికి ఇదేం గొప్ప క‌థ కాదు. క‌థ‌నం కూడా చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఏమీ ఉండ‌దు. కానీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌ట‌న‌, ఆయన బాడీ లాంగ్వేజ్‌, ఇమేజ్ వ‌ల్ల ఈ క‌థ మ‌రో స్థాయికి వెళ్లింది. తొలి స‌గభాగం సినిమా అంతా ఇంట్ర‌స్టింగ్‌గా సాగుతుంది. ప‌వ‌న్‌లోని హీరోయిజం, ఆయ‌న కామెడీ చేసిన తీరు, క‌థ‌లో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య భావోద్వేగాల వ‌ల్ల సినిమా వేగంగా, ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ప్రేమ‌లో దించే స‌న్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే రావు ర‌మేష్‌కి, ప్ర‌దీప్ రావ‌త్‌కి బుద్ధి చెప్పే స‌న్నివేశాలు సినిమాని మ‌రింత ర‌క్తిక‌ట్టించాయి. మాస్‌ని మెప్పించేది కూడాఆ స‌న్నివేశాలే తొలి స‌గ‌భాగంలో శ‌త్రువులు అంత‌కంతకు పెరిగిపోవ‌డం, పవ‌న్ ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంవైపు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ఇంట‌ర్వెల్ త‌ర్వాత కూడా కొన్ని స‌న్నివేశాలు అదే ఫ్లోలో సాగిపోతాయి. అయితే శ్రుతిహాస‌న్ కుటుంబం, వాళ్ల తండ్రి నాజ‌ర్ (భూప‌తినాయుడు) ఫ్లాష్ బ్యాక్ తెలిసిపోయాక క‌థ‌లో కొత్త అంశాలు క‌నిపించ‌వు. క‌థంతా రివీల్ అయిన‌ట్టు అనిపించ‌డంతో ఆ త‌ర్వాత స‌న్నివేశాల‌న్నీ ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందేలా ఉంటాయి. దాంతో ఆ భాగాన్నంతా న‌డిపించే బాధ్య‌త‌ని ప‌వ‌న్ త‌న భుజాల‌పై వేసుకోవ‌ల్సి వ‌చ్చింది. పృథ్వీ నేప‌థ్యంలోవ‌చ్చే స‌న్నివేశాలు కూడా హిలేరియ‌స్‌గా లేక‌పోవ‌డంతో క‌థలో మునుప‌టి ఉత్సాహం నీరుగారిపోయిన‌ట్టు అనిపిస్తుంది. మ‌ళ్లీ ప‌తాక స‌న్నివేశాల్లో ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. చివ‌రి ముప్పై నిమిషాలు సినిమాకి కీల‌కంగా మారాయి. మొత్తంగా ఈ సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కి పండ‌గ సంబ‌రాన్నిచ్చేలా ఉంటుంది. ఆయ‌న క‌నిపించే విధానం కూడా చాలా కొత్త‌గా ఉంది. డ్యాన్సుల‌పై కొంచెం దృష్టి పెట్టుండే బాగుండేద‌నిపిస్తుంది.

* న‌టీన‌టులు… సాంకేతిక‌త‌

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌న్ మేన్ షో ఇది. ఆయ‌నలోని హీరోయిజం, కామెడీలో ప్ర‌తిభ మ‌రోసారి ఈ సినిమాతో బ‌య‌టకొచ్చాయి. త‌న పాత్ర‌కి ఎంత‌కావాలో అంతే చేసినా తెర‌పై అడుగ‌డుగునా ప‌వ‌న్‌క‌ళ్యాణే హైలెట్‌గా నిలిచాడు. శ్రుతిహాస‌న్ పాత్ర‌కి చెప్పుకోద‌గ్గ ప్రాధాన్య‌మేమీ లేదు. కాక‌పోతే ఆమె అందంతో ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేసింది. పాట‌ల్లో చాలా బాగా క‌నిపించింది. న‌లుగురు అన్న‌ద‌మ్ముల పాత్ర‌ల్లో అజ‌య్‌, క‌మ‌ల్‌, శివబాలాజీ, చైత‌న్య‌కృష్ణ చాలా బాగా న‌టించారు. అలీ, ప‌వ‌న్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చాలా బాగుంటాయి. అలీ, ప‌వ‌న్‌ల మ‌ధ్య మ‌రోసారి కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింది. రావు ర‌మేష్‌, త‌రుణ్ అరోరా, ప్ర‌దీప్ రావ‌త వంటి బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ విలనిజం మాత్రం పండ‌లేదు. ఎవ్వ‌రూ ప‌వ‌న్‌కి ధీటుగా క‌నిపించ‌లేదు. నాజ‌ర్‌, పృథ్వీ త‌దిత‌రుల పాత్ర‌లు సోసో అనిపిస్తాయి. టెక్నిక‌ల్‌గా మాత్రం సినిమా సౌండ్ అని చెప్పొచ్చు. అనూప్ సంగీతం బాగుంది. ప్ర‌సాద్ మూరెళ్ల కెమెరా ప‌నిత‌నం కూడా బాగా కుదిరింది. ప‌ల్లెటూరి అందాల్ని చాలా బాగా చూపెట్టాడు. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ మైన‌స్ అని చెప్పొచ్చు. ఏ స‌న్నివేశంలోనూ ప‌వ‌న్ స్థాయి గ్రాండ్‌నెస్ క‌నిపించ‌దు. ద‌ర్శ‌కుడు మ‌రోసారి తాను రీమేక్ క‌థ‌ల్నితీయ‌డంలో దిట్ట అని నిరూపించుకొన్నారు. క‌థ‌ని న‌డిపిన విధానంలో ఆయ‌న క్లారిటీ చాలా బాగుంది. ప‌వ‌న్ పెట్టిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా చాలా నీటుగా సినిమాని తీర్చిదిద్దారు.

* ఫైన‌ల్‌గా…

త‌న ఇమేజ్‌కి త‌గ్గ క‌థ‌తో వ‌చ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో నీరుగారిపోయిన అభిమానుల‌కి `కాట‌మ‌రాయుడు`తో విందు భోజనంలాంటి సినిమా అని చెప్పొచ్చు, అయితే అభిమానులు కాని సాధారణ ప్రేక్షకులను , ఓవర్సీస్ లోను ఈ సినిమా ఆకట్టుకోవడం కొంచెం కష్టమే

తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com