జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. తొలి సభ్యత్వం తీసుకున్న పవన్ కల్యాణ్ పార్టీ నిధికి రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. 150 మందితో ప్రారంభమైన జనసేన ప్రయాణం, నేడు 12.98 లక్షల మంది సభ్యులకు చేరుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ అంకెను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పార్టీని కేవలం ఓట్లు వేసే యంత్రాంగంలా కాకుండా, ఒక సామాజిక శక్తిగా మార్చడానికి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను మూడు ప్రత్యేక విభాగాలుగా వర్గీకరించారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి సభ్యత్వం తీసుకునే సాధారణ సైనికులను ఉద్యమిలుగా, క్షేత్రస్థాయిలో నూతన సభ్యులను చేర్పిస్తూ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వారిని సాధక్ లుగా ఆయన అభివర్ణించారు. ఇక పార్టీకి ఆర్థికంగా, మేధోపరంగా, సాంకేతిక, సేవా రూపంలో సహకారం అందించే వారిని ప్రధాత లుగా గుర్తించి, వారికి తగిన గౌరవం కల్పిస్తామని ప్రకటించారు.
కష్టపడి పనిచేసే కార్యకర్తలే పార్టీకి అసలైన సంపద అని పవన్ పేర్కొన్నారు. గతంలో పార్టీలో చేరిన 6 లక్షల మంది సభ్యులు నేడు రెట్టింపు అయ్యారని, ఇది ప్రజల్లో జనసేన పట్ల పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ముఖ్యంగా సామాన్య కూలీల నుంచి విద్యావంతులైన మేధావుల వరకు అందరూ ఈ సభ్యత్వ నమోదులో భాగస్వాములు కావడం ఒక గొప్ప మార్పుకు సంకేతమని ఆయన విశ్లేషించారు. జనసేన పుట్టిన గడ్డపై తొలి అడుగులు విజయవంతంగా పడ్డాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, ప్రజల గొంతుకగా నిలబడతామని హామీ ఇచ్చారు.
