అరిస్తే అనుభవం రాదు పవన్.. ! పరిణితి చూపించాలి..!!

తనకు అనుభవం లేదంటూ.. ఇతర రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ ఒక్కసారిగా బరస్టయ్యారు. “పుట్టగానే ఎవరూ రాజకీయాల్లోకి రారు… కురువృద్ధులుగా పుడతారా”.. అంటూ పార్టీ కార్యకర్తల ముందు ఆవేశ పడిపోయారు. .. “అనుభవం వస్తుంది. కిందా, మీద పడతాం. లేస్తాం. అప్పుడు చూపిస్తాం. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం” అని పిడికిలి బిగించి గాల్లో చేయి విసిరారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. పవన్ కల్యాణ్ ఒక్కటి మాత్రం సీరియస్‌గా ఆలోచించలేకపోతున్నారు. ఇతర పార్టీల నేతలు.. పవన్ కల్యాణ్‌ను అనుభవం లేదని..అంటోంది.. వయసు చూసో… రాజకీయాల్లోకి వచ్చిన సమయం చూసో కాదు..! కేవలం… రాజకీయంలో పవన్ కల్యాణ్ చూపిస్తున్న పరిణితి గురించే.. !

రాజకీయాల్లో అనుభవం అన్నది… ఆయా నేతలు చేసే రాజకీయాన్ని బట్టే అంచనా వేసుకుంటారు కానీ.. ఆయన పదేళ్లయిందా.. ఇరవై ఏళ్లయిందా అన్నది కాదు చూసేది. రాజకీయ వ్యూహాలు ఎంత తెలివిగా వేస్తారన్నదానిపైనే.. అనుభవం ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉంది..?. అయినా గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం తెచ్చుకున్నారు కదా..!. ఇంటా బయటా ఎన్ని విమర్శలున్నా చంద్రబాబుతో పోటీగా.. రాజకీయం నెట్టుకొస్తున్నారు కదా..!. అదంతా వయసుతో వచ్చిన అనుభవం కాదు.. రాజకీయం నేర్చుకుంటే వచ్చిన అనుభవం.

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి… నిండా ముఫ్పై ఏళ్లు లేవు. తండ్రి మరణించేవరకూ..రాజకీయ వాసన కూడా తెలియదు. దూరంగా చదువుకుంటూ ఉన్నారు. హఠాత్తుగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 25 ఏళ్లప్పుడు జీరోగా..రాజకీయం ప్రారంభించారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక ఎంపీ. చంద్రబాబు ధైర్యంగా.. విభజన హామీలపై కేంద్రం పెద్దలతో మాట్లాడే బాధ్యతలను కూడా అప్పగిస్తున్నారు. ఇదంతా సమయం గడవడం వల్ల వచ్చిన అనుభవం కాదుగా..!. రామ్మోహన్‌కి ఇప్పుడు ఏ బాధ్యత అయినా అప్పగిస్తారు.. నీకు అనుభవం లేదనే ధైర్యం చంద్రబాబు కూడా చేయలేరు.

రాజకీయాల్లో భిన్నమైన రంగం. ఎప్పటికప్పుడు రాజకీయం రూపు మార్చుకుంటూనే ఉంది. ఎప్పుడో ఓ సారి బయటకు వచ్చి మాటలు చెబితే..రాజకీయం అయిపోదు. సినిమా షెడ్యూళ్లలా.. పోరాటయాత్రలు చేసుకోవడం రాజకీయం కాదు. ఏ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేయడం అంత కన్నా రాజకీయం కాదు. ఇవన్నీ పవన్ కల్యాణ్ చేస్తున్నారు కాబట్టి.. అనుభవం గురించి మాట్లాడుతున్నారు. పవన్ ఇలాగే ఉంటే.. మరో పదేళ్ల తర్వాత…కూడా అనుభవం అనే విమర్శలు వస్తూనే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు..

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com