వద్దంటే.. ఇవ్వమనిలే..! డొనేషన్లపై పవన్ మాటలకు అర్థాలే వేరులే..!

“ఎలాంటి బహుమతలు తీసుకు రావొద్దు.. మీ ఆశీస్సులే మాకు చాలు..” .. అని ఏదైనా ఆహ్వానపత్రికలో కనిపిస్తే…దానర్థం కానుకలు తీసుకు రాకుండా రావొద్దని..!. అలాగే పవన్ కల్యాణ్ కూడా.. నేను “డొనేషన్ల కోసం అమెరికాకు రాలేదని” అన్నారంటే.. దానర్థం డొనేషన్ల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పడం. పవన్ కల్యాణ్ అమెరికా పర్యటనలో ఇదే జరిగింది. డొనేషన్ల కోసం రాలేదని… చెప్పి డొనేషన్లు అడగడం ఇందులో చాలా చిన్న విషయమే.. అసలు విషయం ఏమిటంటే.. అలాంటి డొనేషన్లు ఏవైనా.. అధికారికంగా… జనసేన ఖాతాలోకి వేయవద్దంటున్నారు. చెక్కు రూపంలోకానీ.. క్యాష్ రూపంలో కానీ.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఆడిటర్‌కు ఇవ్వాలనడమే… “పవన్ ఆమెరికా యాత్ర”లోని అసలు ట్విస్ట్.

డొనేషన్లు వద్దంటే ఇవ్వమని..!

పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నారు. తను ఏ వీసా మీద వెళ్లారో కానీ.. అక్కడ ఉండే ప్రవాసుల H1B వీసా సమస్యను కూడా పరిష్కరిస్తాననే పెద్ద పెద్ద స్పీచ్‌లో ఏపీలో ఇచ్చినట్లు ఇచ్చారు. పలు నగరాల్లో పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా… తాను డొనేషన్ల కోసం రాలేదని… ప్రతి ప్రసంగం ముందు.. చివర చెప్పుకొచ్చారు. ఎలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందబ్బా.. అని సమావేశానికి వచ్చిన వాళ్లు.. మీటింగ్‌ హాలు నుంచి బయటకు వచ్చే సరికి… వారి కోసం మరో చిన్న కాన్ఫరెన్స్ ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లే సరికి వాళ్లకు..”ఎలాంటి బహుమతలు తీసుకు రావొద్దు.. మీ ఆశీస్సులే మాకు చాలు..” అని పెళ్లి పత్రికలో కనిపించే కొటేషన్ గుర్తుకు వస్తుంది. అంటే.. అక్కడ అద్దెపల్లి శ్రీధర్ లాంటి వాళ్లు.. మీ చందా ఎంత…? అని లెక్క రాసుకోవడానికి పెన్ను తీసుకుని రెడీగా ఉంటారు. ” పవన్ అంటే ప్రాణం.. ఆయన పార్టీకి సాయం చేస్తాం.. శక్తి మేర.. జనసేన ఖాతాలో జమ చేస్తామని..” ఎవరైనా చెబితే.. మరో షాక్ తగులుతుంది.

జనసేన ఖాతాకు వద్దు .. పవన్ వ్యక్తిగత ఆడిటర్‌కు ఇవ్వాలి..!

ఎందుకంటే… ఈ అద్దేపల్లి టీం… ఇంకో బిగ్ షాక్ ఇస్తుంది. చాలు సూటిగా… సుత్తి లేకుండా.. ఓ సూచన చేసేస్తుంది. జనసేన పార్టీ వెబ్‌సైట్‌లో ఉంది కదా..అని దానిలో జమ చేసేయకండా.. డబ్బులైనా, చెక్కులైనా.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఆడిటర్ రత్నం ఉంటారు… ఆయనకు ఇవ్వండి అనేది ఆ సందేశం. అదేమిటి…పార్టీ కోసం చందాలు కావాలంటే.. అధికారికంగా తీసుకుంటారు కానీ… ఇలా పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఆడిటర్ చెక్కులు, నగదు రూపంలో తీసుకోవడం ఏమిటి…? అని ఎవరికైనా సందేహం వస్తే.. దాన్ని మనసులోనే దాచుకోవాలి. బయటపెట్టకూడదు. అమెరికాలో పవన్ కల్యాణ్ వెళ్లిన ప్రతీ చోటా ఇదే జరిగింది. దాంతో పవన్ అభిమానులు ముక్కున వేలేసుకుని.. జేబును గట్టిగా పట్టేసుకుని బయటకు వచ్చారు.

ఇదేనా జనసేన రాజకీయం..!

వీరి నిర్వాకాన్ని ఓ జనసేన అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పవన్ కల్యాణ్ అమెరికా వెళ్లి … తన బృందంతో చేయిస్తున్న పని ఇదా.. అని చాల మంది ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితిని కల్పించారు. సరే రాజకీయ నాయకుల మాటకు అర్థాలే వేరు అనుకుందాం.. పవన్ కూడా రాజకీయ నాయకుడే కాబట్టి… అలా డొనేషన్లు వద్దు అని చెప్పి.. వసూలు చేస్తున్నాడనుకుందాం.. కానీ అక్రమంగా.. . నిబంధనలకు విరుద్ధంగా.. చెక్కులు, నగదు రూపంలో తీసుకోవడం ఎందుకు..? అదీ కూడా పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఆడిటర్ వసూలు చేయడం ఎందుకనేదే … చాలా మందికి అర్థం కావడం లేదు..!

—సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.