ప‌వ‌న్ కి ఈ స‌మ‌స్య‌లేవీ క‌నిపించ‌వా.. చూడ‌రా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా స్పందించారు! అంటే, ఏ ఇష్యూ మీదా… ఫిరాయింపు నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు కట్ట‌బెట్టిన చంద్ర‌బాబు వైనం పైనా..? లేదంటే, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తుందుర్ర‌లో జ‌రుగుతున్న అధికార పార్టీ అణ‌చివేత ధోర‌ణిపైనా..? ఈ రెండూ కాదు..! నిజ‌మే, ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా స్పందించింది ఈ రెండింటి కంటే… ఆయ‌న దృష్టిలో అత్యంత తీవ్ర‌మైన స‌మ‌స్య‌గా క‌నిపిస్తున్న ‘ఉత్త‌రాధి అహంకారం’పై వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌ల్లో కామ‌న్ గా వినిపించే పాయింట్ ఇది. కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ఉత్తరాది అహంకారం అంటూ చాలాసార్లు విమర్శించారు. తాజాగా ఈ ఇష్యూపై ఓ మాజీ భాజ‌పా ఎంపీ కామెంట్ చేశారు. తాము జాత్యాహంకారంతో ఉంటే, ద‌క్షిణ భార‌త‌దేశంతో ఎలా క‌లిసి ఉంటామ‌ని మాజీ ఎంపీ త‌రుణ్ విజ‌య్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. దీంతో త‌రుణ్ విజ‌య్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అక్క‌డితో వివాదం దాదాపుగా స‌మ‌సిపోయింది. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం దీన్ని వ‌ద‌ల్లేదు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పినంత మాత్రాన స‌రిపోదన్నారు. త‌రుణ్ వ్యాఖ్య‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఉత్త‌రాది అహంకారం ఆ మాట‌ల్లోనే వినిపిస్తోంద‌నీ, జాతీయ జెండాను త‌యారు చేసింది ఒక ద‌క్షిణ భార‌తీయుడే అని గుర్తించాలంటూ వ్యాఖ్యానించారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పినంత మాత్రాన జ‌రిగిన అవ‌మానాన్ని మ‌రిచిపోవ‌డం సాధ్యం కాద‌ని స్పందించారు.

రాష్ట్రంలో ఎన్నో అంశాలున్నాయి. స‌మ‌స్య‌లున్నాయి. వాట‌న్నింటిపై ఒక్క‌టంటే ఒక్క వాక్యం ట్వీట్ చేయ‌లేదు. ఎవ‌రో మాజీ ఎంపీ ఏదో కామెంట్ చేశార‌ని ఈ రేంజిలో స్పందించేశారు. కానీ, రాష్ట్రంలో స‌మ‌స్య‌లు ప‌వ‌న్ క‌నిపించ‌డం లేదా..? లేదంటే, వాటిపై స్పందించ‌కుండా ఎవ‌రైనా ప‌వ‌న్ చేతులు క‌ట్టేశారా..? ఓ ప‌క్క ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని అప‌హాస్యం చేస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్న వైనం ప‌వ‌న్ క‌నిపించ‌డం లేదా..? తుందుర్రులో అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ వాతావర‌ణం సృష్టించి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్న మ‌ల్లుల సురేష్ అనే స్వ‌చ్ఛంద సేవ‌కుడిని జైలు పాలుచేసిన వైనం ప‌వ‌న్ దృష్టికి రాలేదా..? అక్క‌డ మ‌ర‌ణించిన రైతు ఆత్మ‌ఘోష అర్థం కావ‌డం లేదా..? అగ్రిగోల్డ్ సంస్థ‌లో క‌ష్టార్జితం డిపాజిట్లు చేసి, అవి తిరిగి వ‌స్తాయో రావో అని ఆందోళ‌న చెందుతున్న సామాన్యుల ఆర్త‌నాదం ప‌వ‌న్ వ‌ర‌కూ వినిపించ‌డం లేదా..?

ఇలాంటివ‌న్నీ వ‌దిలేసి.. ఉత్తరాది, ద‌క్షిణాది అంటూ మాట్లాడ‌ట‌మేంటీ..? దీన్నో పెద్ద స‌మ‌స్య‌గా చిత్రించి ఏం సాధిస్తారు..? దీనిపై ప‌వ‌న్ పోరాటం ఎలా చేస్తారు..? అంతిమంగా ఈ ఇష్యూ ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు..? క‌నీసం ఇప్ప‌టికైనా రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై ఒక్క ట్వీటు చేస్తారేమో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.