ఎంపిల మీదే దృష్టి పెట్టండి – పవన్ కల్యాణ్

ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంటు సభ్యులమీద వత్తిడి తీసుకురావడమే కార్యక్రమమని, తాను తెలుగుదేశం, బిజెపి పార్టీలను సమాన దూరంలో వుంచాననీ కాకినాడ సభద్వారా పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.

ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని నిలిపి అభివృద్ధి ఇవ్వగలదని ఆయన తిరుపతి సభలో స్పష్టంచేస్తూ కాకినాడ సభలో తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయించుకుందామని అదే సభలో స్పష్టం చేశారు. ఆతరువాతే కేంద్రంలో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేకేజికి స్ధూలంగా ఆమోదాన్ని ప్రకటించారు.

రెండున్నర ఏళ్ళుగా మాటలతో గడిపేస్తున్న కేంద్రం, ప్రాధేయపడటమే పనైపోయిన రాష్ట్రం పాకేజిని రూపొందించడం, ఆమోదించడం రాత్రికి రాత్రే జరిగిపోయాయంటే పవన్ కల్యాణ్ 9 వతేదీ సభ కు విషయం లేకుండా చెయ్యాలన్నదే ఆలోచన అని ఎవరైనా అర్ధంచేసుకోవచ్చు!

అంకెలు, స్పష్టత లేని పేకేజిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 10 వతేదీ బంద్ కు పిలుపు ఇచ్చాయి. శాశనసభను జగన్ పార్టీ స్తంభింపజేస్తోంది.

ఈ నేపధ్యంలో, ఈ పరిణామాలన్నిటికంటే బాగా ముందుగానే పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్న కాకినాడసభలో ఆయన పరిణతిని ప్రదర్శించారు. ప్రజల మద్దతు వున్న బంద్ ను వద్దని చెప్పలేదు. బంద్ ను విజయవంతం చేయాలని కూడా చెప్పలేదు.

ఎంపిలపై వత్తిడి తీసుకురావడమే ప్రధానమని తొలిదశ ఆందోళనా కార్యక్రమాన్ని సూచించారు. హోదా ఇవ్వని బిజెపిమీదే ప్రధానంగా గురిపెట్టారు. ”పాచిపోయిన లడ్డూలను వాళ్ళమీదే తిప్పికొట్టాలి” అంటూ హోదాసాధించడానికి తిరగబడాలని తెలుగుదేశానికి సలహా ఇచ్చారు.

తెలుగుదేశాన్ని బిజెపిని ఈ భుజం మీద మోశాను అన్న పవన్ దెప్పిపోటులో ఆరెండింటినీ విమర్శించే నైతిక హక్కు తనదేనన్న సంకేతం కూడా కనబడుతోంది.

సినిమా డైలాగులతో, నాటకీయ హావభావాలతో పవన్ కల్యాణ్ ఉపన్యాసం ప్రజల్ని ఆకట్టుకోలేకపోయిందని విమర్శకులు అంటున్నారు.

నిజానికి రాజకీయనాయకులే టివి కెమేరాలముందు…లేని ప్రశాంతతను మొహంలో చూపించడం, ఆకస్మిక ఆగ్రహాన్ని చూపించడం చేస్తూవుంటారు. వారిదే అసలైన నటన. స్వాభావికంగానే కళాకారుడైన పవన్ కల్యాణ్ తన ఉద్వేగాలను దాచుకోవడంలేదు. మూడు దశాబ్దాల క్రితం ఎన్ టి ఆర్ వ్యక్తీకరణలు ఎలా వుండేవో ఇపుడు పవన్ కల్యాణ్ ఎక్స్ ప్రెషన్స్ కూడా అలాగే వున్నాయి.

ఎన్ టి ఆర్ చరిత్ర సృష్టించారు… పవన్ కల్యాణ్ ఏంచేస్తారో చూడాలి!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com