చిరంజీవి స్నేహితుడిపై పవన్ ఆరోపణలు..! కారణం రాజకీయమేనా..?

తూర్పుగోదావరి జిల్లా పోరాటయాత్రలో పవన్ కల్యాణ్… కెవీ రావు అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. అదీ కూడా.. ఓ రేంజ్‌లో..! ఉద్యోగాలివ్వరు.. పన్నులు కట్టరు అని తేల్చి చెడామడా విమర్శించేశారు. ఆయనను.. చంద్రబాబు, లోకేష్ కూడా కాపాడలేరని.. తేల్చి చెప్పారు. పోరాటయాత్రకు వచ్చిన చాలా మందికి… ఈ కేవీరావు ఎవరో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే… ఆయన రాజకీయ నాయకుడు కాదు..! అందరికీ తెలిసిన పారిశ్రామిక వేత్త కాదు…! చాలా లో ప్రోఫైల్ మెయిన్‌ టెయిన్ చేసే బడా పారిశ్రామికవేత్త. కాకినాడ సీ పోర్టుకు చైర్మన్. ఆయనపై.. ఇంత వరకూ ఏ పార్టీ నేత కూడా ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడలేదు. కానీ పవన్ కల్యాణ్ మొదటిసారి .. ఘాటు విమర్శలు చేశారు. తీవ్రమైన విమర్శలు చేశారు. ఇంతకీ కేవీరావుతో పవన్ కల్యాణ్‌కు విరోధం ఎందుకు..?

ఇంతకీ కేవీ రావు ఎవరు..? కేవీరావు.. పూర్తి పేరు కర్నాటి వెంకటేశ్వరరావు. కాకినాడ సెజ్ సహా.. అనేక కంపెనీలు ఉన్నాయి. దేశ విదేశాల్లో వ్యాపార వ్యవహారాలు… ఆస్తులు ఉన్నాయి. అంతకు మించి ఈయన.. మెగాస్టార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవికి దశాబ్దాలుగా స్నేహితుడు. చిరంజీవి … అమెరికా పర్యటనకు ఎప్పుడు వెళ్లినా.. కర్మాటి వెంకటేశ్వరరావు అలియాస్… కేవీ రావు ఇంటిలోనే బస చేస్తారు. ఇటీవల మా సిల్వర్ జూబ్లి వేడుకల కోసం… అమెరికా వెళ్లిన చిరంజీవి ఫ్యామిలీకి ఆతిధ్యం ఇచ్చినది.. కేవీరావు కుటుంబమే. లాస్ ఎంజెల్స్ లోని .. కేవీ రావు ఇంట్లోనే చిరంజీవి బస చేశారు. ఈ విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ అన్యాపదేశంగా…తన ప్రసంగంలో చూచాయగా చెప్పుకొచ్చారు. చిరంజీవి నేరుగా బస చేశాడని చెప్పకపోయినా… కేవీ రావుకు.. లాస్ ఎంజెల్స్‌లో ఇళ్లు ఉన్నాయని చెప్పారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన కేవీ రావు విషయంలో.. కుటుంబసభ్యుల మధ్య చర్చ జరిగినప్పుడు.. తెలుసుకున్న విషయాలను పవన్ కల్యాణ్ ఇలా.. తన రాజకీయ విమర్శల కోసం ఉపయోగించుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రాణంగా భావించే అన్నయ్య స్నేహితుడు కేవీరావుని అకారణంగా.. కేవలం ఉదాహరణ అంటూ… అన్యాయాలు, అక్రమాలు, పన్నులు ఎగ్గొట్టే పారిశ్రామికవేత్తలకు… రోల్ మోడల్ గా పవన్ కల్యాణ్ చిత్రీకరించే ప్రయత్నం చేయడాని కారణం ఏమిటన్నది.. మెగా కుటుంబం సర్కిల్స్‌లో విపరీతంగా చర్చకు కారణం అవుతోంది.

అన్నయ్య బాధపడతాడని తెలిసి కూడా.. పవన్ కల్యాణ్ ఎలా విమర్శిస్తారని వారు సందేహపడుతున్నారు. బహుశా కేవీరావుతో.. మెగా ఫ్యామిలీ మితృత్వం చెడిపోవడం వల్ల… పవన్ కల్యాణ్.. విరుచుకుపడ్డారేమోనన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే కేవీ రావుతో చిరంజీవి ఇప్పటి స్నేహం కాదని అంటున్నారు. అందుకే టీడీపీ నేతలు కూడా.. కేవీరావు విషయంలో… చిరంజీవిని అడిగితే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయని.. ఆయన ఇంట్లో చిరంజీవి.. ఎన్నాళ్లు ఉన్నారో కూడా తెలుస్తుందని… పవన్ కు కౌంటర్లు ఇచ్చారు. మొత్తానికి పవన్ కల్యాణ్ మాత్రం.. కేవీ రావును… రాజకీయ విమర్శల్లోకి తీసుకొచ్చారు. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]