ప‌వ‌న్‌, జ‌గ‌న్‌, లోకేష్‌.. వార‌సులు కానివారెవ‌రు..?

గురివింద గింజ తన నలుపెరుగదు అని ఓ సామెత ఉందిలెండి..! ఆంధ్రా రాజ‌కీయాల్లో ‘వార‌స‌త్వం’ గురించి లెక్చ‌ర్లు దంచేస్తున్న కొంత‌మంది తీరు గ‌మ‌నిస్తే ఇదే గుర్తొస్తోంది. వారు ఒక‌టి అంటే, మ‌నం రెండు అనేయాలి, అంతే! అన్న‌దాన్లో ఉన్న‌దేంటీ, ఉన్న‌దానిలో జ‌నం విన్న‌దేంటీ అనే విశ్లేష‌ణాత్మ‌క దృక్ప‌థం ఈ ‘వార‌స‌త్వ‌’ చ‌ర్చ‌ల్లో క‌నిపించ‌డం లేదు. తాజాగా వైకాపా ఎమ్మెల్యే రోజా ఈ రాజ‌కీయాల గురించి ప‌వ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై మాట్లాడే హ‌క్కు ప‌వ‌న్ కి లేద‌న్నారామె. వార‌స‌త్వ సినిమాల‌పై ప‌వ‌న్ మాట్లాడితే బాగుంటుంద‌ని ఆమె అన్నారు. చిరంజీవి లేక‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డున్న‌ాడ‌నీ ఎద్దేవా చేశారు. ఇంత‌కీ… ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ ఏంటంటే, ఉత్త‌రాంధ్ర పర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న విశాఖ‌లో మాట్లాడుతూ… వార‌స‌త్వ రాజ‌కీయాలు అంటే త‌న‌కు న‌చ్చ‌వ‌నీ, ముఖ్య‌మంత్రి కుమారుడు అయినంత మాత్రాన సీఎం పీఠం ఆశించ‌డం త‌ప్పు అని చెప్పారు. సో.. దానికి రోజా ఇచ్చిన కౌంట‌ర్ ఇది.

ఇక‌, మంత్రి నారా లోకేష్ విష‌యానికొద్దాం. ఈయ‌న కూడా వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై స్పందించారు. గతవారం ఓ సంద‌ర్భంలో మంత్రి మాట్లాడుతూ… వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను ఎవ్వ‌రూ ఆహ్వానించ‌డం లేద‌ని లోకేష్ అన్నారు. ‘ఫ‌లానా నాయ‌కుడి వార‌సులు’ అన‌గానే ప్ర‌జ‌లు ఓట్లేసే ప‌రిస్థితి లేద‌న్నారు. వార‌సుల‌కు అవ‌కాశాలు రావ‌డం అనే మాట‌లో కాస్త నిజం ఉన్నా, సమ‌ర్థంగా ప‌నిచేయ‌క‌పోతే రాజ‌కీయాల్లో నిల‌బ‌డ‌లేర‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ఎవ‌రైతే ప‌రిష్క‌రిస్తారో వారినే ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని చెప్తూనే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే అవ‌కాశం త‌మ‌కు వార‌స‌త్వంగా వ‌స్తోంద‌నీ దాన్ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌నీ ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు. ఈయ‌న ఇలా స్పందించేయ‌డానికి కూడా కార‌ణం.. జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యాఖ్య‌లే! ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంత్రి లోకేష్ గురించి మాట్లాడాల‌ని ఓ అభిమాని ప‌వ‌న్ ను కోరితే… ‘నాకు చంద్ర‌బాబు లాంటి నాన్న‌గారు లేరు. మా నాన్న హెడ్ కానిస్టేబుల్‌, ఆయ‌న గురించి ఎంతైనా మాట్లాడ‌తా. లోకేష్ నాన్న ముఖ్య‌మంత్రి, ఇక లోకేష్ సామ‌ర్థ్య‌మేంటో నాకు తెలీదు’ అన్నారు.

ప‌వ‌న్‌, జ‌గ‌న్‌, లోకేష్‌… ఈ ముగ్గురూ వార‌స‌త్వ తానులో ముక్క‌లే! కాబ‌ట్టి, ఒక‌ర్నొక‌రు ప్ర‌త్యేకంగా వ్యాఖ్యానించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇక, అభిమానులూ ద్వితీయ శ్రేణి నేతలూ ఈ అంశంపై చర్చలకు దిగుతుండటం విడ్డూరం. జ‌గ‌న్ ను వెన‌కేసుకుంటూ వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌కు ర‌మ్మంటూ ఎమ్మెల్యే రోజా స‌వాల్ చేయ‌డం… హార్డ్ కోర్ అభిమానం పేరుతో ప‌వన్ ను వెన‌కేసుకుంటూ కొంత‌మంది టీవీ ఛానెల్స్ లో ర‌చ్చ చేయ‌డం… మా లోకేష్ బాబు తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవ చేస్తున్నారంటూ పచ్చ అభిమానులు సమర్థించుకోవడం… ఇవ‌న్నీ వింటుంటే హాస్యాస్పదంగా లేవూ..! తెల్లారితే చాలు, రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ రావాల‌ని ప‌దేప‌దే చెప్తున్న జ‌గ‌న్‌.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి మాట్లాడ‌కుండా రాజ‌కీయాలు చేస్తున్నారా..? వ‌్య‌వ‌స్థ స‌మూలంగా మారిపోవాల‌ని లెక్చ‌ర్లు ఇచ్చే ప‌వ‌న్ కూడా చిరంజీవి ప్ర‌స్థావ‌న లేకుండా ప్ర‌సంగిస్తున్నారా..? ప్ర‌జాసేవ నేర్చుకుంటున్నా అని చెప్తుండే మంత్రి లోకేష్‌… చంద్ర‌బాబు ప్ర‌స్థావ‌న లేకుండా మాట్లాడుతున్నారా..? ఇంత స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటే, సో కాల్డ్ అనుచ‌ర‌గ‌ణం వార‌స‌త్వ చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ ఒకరిపై ఒకరు జ‌బ్బ‌లు చ‌రుకోవ‌డం.. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిదే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.