పిఠాపురం నియోజకవర్గంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులను గుర్తించి, వారి ఆసక్తికి అనుగుణంగా నచ్చిన కోర్సుల్లో చేర్పించే బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వయంగా చేపట్టారు. వీరిలో రాష్ట్రస్థాయిలో 598 మార్కులతో టాపర్గా నిలిచిన విద్యార్థి కూడా ఉన్నారు.
ఇప్పటికే తల్లిదండ్రులు లేని పిల్లలకు తన జీతం నుంచి నెలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న ఆయన, ఇప్పుడు ఈ విద్యా సాయం ద్వారా మరో ముందడుగు వేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, విద్యార్థుల కెరీర్ పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో పలు ప్రముఖ విద్యా సంస్థలు ఈ 31 మంది విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. విద్యార్థులు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారో, ఏ కోర్సుపై వారికి ఆసక్తి ఉందో తెలుసుకొని, సంబంధిత యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఈ అవకాశాన్ని కల్పించారు.
తన పిలుపును గౌరవించి విద్యార్థులకు బాసటగా నిలిచిన విద్యా సంస్థలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో నాయకులు హామీలు ఇవ్వడం సహజం, కానీ ఇచ్చిన హామీలను దాటి తన వ్యక్తిగత చొరవతో, సొంత జీతంతో ప్రజలకు సాయం చేయడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకతను చాటుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో విద్యార్థుల పట్ల ఆయన చూపిస్తున్న ఈ ఆదరణ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రజాప్రతినిధులకు ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. సామాన్య విద్యార్థుల కలలకు రెక్కలు తొడుగుతున్న పవన్ కల్యాణ్ పిఠాపురం వాసుల మనసు గెల్చుకుంటున్నారు.
