అడవులు అంటే అడవులే. అడవుల మధ్యలో ప్రైవేటు భూమి ఎవరికైనా ఉంటుందా?. అది మాకు వారసత్వంగా వచ్చిందని ఎవరైనా చెబితే ..పత్రాలు చూపిస్తే అబ్బా మేధావి అనుకోరా?. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని చూసి అంతే అనుకోవాలి. మంగళంపేట అడవుల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రైవేటు భూమి ఉందట. అది వారసత్వంగా వచ్చిందని కొన్ని పత్రాలు సృష్టించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వారికి అలా సృష్టించడం పెద్ద విషయమేం కాదు.
అయితే ఆ వారసత్వ భూమి కొంత అయితే.. చుట్టూ అడవే కాబట్టి కావాల్సినంత కలిపేసుకుని సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఈ అంశంపై పెద్ద దుమారం రేగింది. తాజాగా పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. ఎలా ఆక్రమించారో స్పష్టంగా చూపించారు. ఎక్కడైనా పొలాల మధ్యలో ఫామ్ హౌస్ కట్టుకుంటారు. కానీ పెద్దిరెడ్డి కుటుంబం అడవి మధ్యలో జంగిల్ హౌస్ కట్టుకున్నారు. అది కూడా అత్యంత విలాసంగా. అసలు అక్కడ కట్టడానికి ఎలా అనుమతులు అటవీ శాఖ ఇచ్చిందో వారికే తెలియాలి. అంతేనా.. ఆ ఇంటి దగ్గరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నారు. ఇవన్నీ పవన్ వీడియోలో స్పష్టమయ్యాయి.
ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకునే దిశగా పవన్ కల్యాణ్ తన శాఖా పరంగా ప్రయత్నాలు ప్రారంచారు. అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం మేం క బ్జా చేయలేదు.. ఆ భూమికి రికార్డులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు అడవిలో భూమి ఎలా వచ్చిందో వారు చెప్పాల్సి ఉంది. భూఆక్రమణల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్నంత పేరు .. చిత్తూరు జిల్లాలో ఎవరికీ లేదు. అనేక కబ్జా కేసులు వారి కుటుంబసభ్యులపై ఉన్నాయి. ఆర్డీవో ఆఫీసులో భూరికార్డులను తగులబెట్టించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.


