తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన వీకెండ్ పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఈ విందు దుబాయ్‌లో జరగాల్సి ఉండగా, ద్ధ మేఘాలు, ప్రతికూల పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో వేదిక హైదరాబాద్‌కు మారినట్లు గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. కేవలం వినోదం కోసమే కాకుండా, దుబాయ్ కేంద్రంగా సాగే భారీ పెట్టుబడులు, బినామీ లావాదేవీలపై చర్చించడానికే ఈ కీలక భేటీ జరిగిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఈ భేటీలో పాల్గొన్న వారి బ్యాక్‌గ్రౌండ్ కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త నమిత్ శర్మ, రాజస్థాన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సిట్టింగ్ ఎంపీ ఈ పార్టీలో ఉన్నారు. పోలీసుల దాడుల సమయంలో నమిత్ శర్మ గాల్లోకి కాల్పులు జరపడం ఈ అనుమానాలను మరింత పెంచింది.
గతంలో దుబాయ్‌లో కేదార్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనను కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లో కలకలం రేపాయి. ఇప్పుడు మళ్లీ దుబాయ్ కనెక్షన్‌తోనే ఈ పార్టీ జరగాల్సి ఉండటం, అందులోనూ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ఇతర రాష్ట్రాల రాజకీయ నేతలు పాల్గొనడం చూస్తుంటే.. దీని వెనుక కేవలం డ్రగ్స్ వ్యవహారమే కాకుండా భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీల కోణం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతానికి పోలీసులు డ్రగ్స్ కేసుగా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు.
పాత వ్యవహారాలు, దుబాయ్ బినామీ పెట్టుబడులు అన్నీ వెలుగులోకి తీసుకు వచ్చేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.


