ఉపఎన్నికలు రాకూడదు..! త్యాగం క్రెడిట్ రావాలి..! వైసీపీ ఎంపీల వ్యూహం ఇదే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల ఆమోదం మరోసారి వాయిదా పడింది. జూన్ ఐదో తేదీ తర్వాత మరోసారి కలవాలని స్పీకర్ చెప్పారు. ఇప్పటికి ఆమె.. రెండు సార్లు వైసీపీ ఎంపీలతో వ్యక్తిగతంగా మాట్లాడారు. తొలి సారి రాజీనామా లేఖలిచ్చినప్పుడు వారితో మాట్లాడారు. మంగళవారం మరోసారి పిలిపించి మాట్లాడారు. ఈ రెండు సార్లు వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు..తమ రాజీనామాలు ఆమోదించాలనే చెప్పారు. కానీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం మరోసారి ఆలోచించుకోవాలని చెప్పి పంపేశారు. ఎంపీలు .. స్పష్టంగా తమ రాజీనామాలు ఆమోదించాలని చెప్పిన తర్వాత… ఎందుకు స్పీకర్ ..ఆలోచించుకోవాలని చెబుతున్నారనేది చాలా మందికి వస్తున్న సందేహం.

దీనికి వైసీపీ ఎంపీలే పరోక్షంగా సమాధానం చెప్పారు. రాజీనామాలు ఆమోదించాలని.. చెప్పే ముందు వారు..మరికొన్ని మాటలు చెబుతున్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని.. అందుకే రాజీనామాలు చేస్తున్నామని.. స్పీకర్‌కు చెబుతున్నారు. ఒత్తిళ్ల వల్ల రాజీనామాలు చేస్తున్నామంటే..స్పీకర్ అంగీకరించరు. మరోసారి ఆలోచించుకోవాలని చెబుతారు. రెండు సార్లు వైసీపీ ఎంపీలు అదే చెప్పారు. మంగళవారం స్పీకర్‌ను కలిసిన తర్వాత వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి అదే చెప్పారు. ప్రజల నుంచి తమపై చాలా ఒత్తిడి ఉందని స్పీకర్‌కు చెప్పామన్నారు. దీంతో రాజీనామాలను పెండింగ్‌లో ఉంచుకోవాలన్న వైసీపీ వ్యూహం… స్క్రిప్‌ ప్రకారమే నడుస్తోందని స్పష్టమయంది.

అలా అని రాజీనామాలను వెనక్కి తీసుకుంటే.. వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఒక వేళ ఉన్న పళంగా రాజీనామాలను ఆమోదింప చేసుకుంటే.. ఉపఎన్నికలొస్తాయి. అటూ ఇటు కాకుండా.. అంటే రాజీనామాలు ఆమోదించేసినా… ఉపఎన్నికలు రాని సమయాన్ని చూసుకున్నారు. దానికి జూన్ మొదటి వారంలో మహుర్తం పెట్టుకున్నారు. అప్పుడు స్పీకర్‌ను మరోసారి కలిసి…రాజీనామాలను ఆమోదించుకోనున్నారు. అప్పుడు ఉపఎన్నికలు రావు. ఎందుకంటే..ఎంపీల పదవీ కాలం ఏడాదిలోపు ఉంటే.. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించదు. 2014 జూన్‌ 4వ తేదీన లోక్‌సభ మొట్టమొదటిసారిగా సమావేశమైంది. అంటే 2019 జూన్‌ 4తో మోదీ సర్కారుకు ఐదేళ్లు నిండుతాయి. అంటే పదవీ కాలం ఏడాదిలోపే ఉంటుంది కాబట్టి ఉపఎన్నికలన్న ప్రశ్నే రాదు. మొత్తానికి వైసీపీ ఎంపీలు ప్రత్యేకహోదా కోసం తాము పదవులను త్యాగం చేశామన్న క్రెడిట్ పూర్తిగా పొందాలనుకుంటున్నారు. కానీ ఉపఎన్నికలు మాత్రం రాకూడదనుంటున్నారు. దీని కోసం… పక్కా వ్యూహాన్నే అమలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.