ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, దానివల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగవచ్చునని ..అయినా తగినన్ని నిల్వలు ఉన్నాయని మోదీ ముఖ్యమంత్రులకు భరోసా ఇచ్చారు. 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందకుండా చూడాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా ఇంధన కొరత ఉందనే తప్పుడు ప్రచారాలను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గాలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల ఎరువులు ,ఇతర ముడి సరుకుల ధరలు పెరగకుండా, సరఫరా ఆగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చర్చించారు. గతంలో కోవిడ్ సమయంలో ప్రదర్శించిన టీమ్ ఇండియా స్ఫూర్తితో కేంద్రం మరియు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ప్రధాని సమీక్షించారు. పరిస్థితులు విషమిస్తే వారిని స్వదేశానికి తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రస్తుతం కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం , పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అమలులో ఉన్నందున, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. వారికి బదులుగా ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటేరియట్ విడిగా సమావేశం అవుతుంది.
