ర‌జ‌నీ ఆవేశానికి అప్పుడే తూట్లు

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఏర్పాటు చేసిన `స‌భ‌`లో ర‌జ‌నీ మాట‌లు చూస్తుంటే… తొలిసారి రాజ‌కీయాల‌పై అనుకూలంగా మాట్లాడిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. త‌మిళ రాజ‌కీయాల్లో కుళ్లు పేరుకుపోయింద‌ని – యుద్దానికి సిద్దంగా ఉండాల‌ని అభిమానుల‌కు పిలుపు ఇవ్వ‌డం చూస్తుంటే.. రాజ‌కీయ రంగాన ర‌జ‌నీ మేక‌ప్ వేసుకోవ‌డానికి సర్వం సిద్ధం అన్న సంకేతాలు అందుతున్నాయి. ర‌జనీ మాట‌లు క‌చ్చితంగా అభిమానుల్ని ఉత్సాహంలో ముంచెత్తేవే. త‌మిళ‌నాట రాజ‌కీయంగా మార్పు కోరుకొనే వాళ్ల‌కు ర‌జ‌నీ ఏకైక ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తున్నాడు. ర‌జ‌నీ రాక‌తోనే త‌మిళ రాజ‌కీయాల్లో మార్పు త‌థ్య‌మ‌ని ఓ వ‌ర్గం అక్క‌డ బ‌లంగా న‌మ్ముతోంది.

అయితే ర‌జ‌నీ వ్యాఖ్యాల్ని సినిమా డైలాగులా, ఓ జోక్‌లా తీసుకొంటున్న‌వాళ్లూ ఉన్నారు. ర‌జ‌నీ రాజ‌కీయాల‌కు ప‌నికి రాడ‌ని మొహంమీదే చెప్పేస్తున్నారు అక్క‌డి ప్ర‌ముఖులు. ర‌జనీ చెప్పేదొక‌టి చేసేదొక‌టి… ఎప్పుడు ఏం మాట్లాడ‌తాడో తెలీద‌ని ఎద్దేవా చేస్తున్నారు యాంటీ ర‌జ‌నీ ఫ్యాన్స్‌. బిజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అయితే ర‌జ‌నీ రాజ‌కీయాల‌పై ఘాటుగా స్పందించారు. ర‌జ‌నీకి మ‌తి స్థిమితం లేద‌ని, రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని అనేశారు. ర‌జ‌నీరాజ‌కీయాలు అనే టాపిక్‌ని అక్క‌డ రాజ‌కీయ రంగంలో త‌ల‌పండిపోయిన‌వాళ్లు పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌నే చెప్పాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌జ‌నీ కాంత్ త‌మ పార్టీకి మ‌ద్ద‌తిస్తే బాగుణ్ణు అంటూ ఆయ‌న చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేసిన‌వాళ్లు సైతం.. ర‌జ‌నీకాంత్ వ్యాఖ్యాల్ని లైట్‌తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించేదే. తెలుగునాట కూడా అంతే. చిరంజీవి రాజ‌కీయాల్లోకి వ‌చ్చే సంద‌ర్భంగా సాక్షాత్తూ.. సినిమా వాళ్లే ”చిరు రాజ‌కీయాల‌కు ప‌నికి రాడు” అని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. దిగితే గానీ లోతు తెలీదు.. చూద్దాం. ర‌జ‌నీ దిగాక ఏం అవుతుందో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.