సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్న యువ కళాకారులు ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలుగా మారుతున్నారు. ముఖ్యంగా వైసీపీ వంటి పార్టీలు తమ ప్రత్యర్థులను అప్రతిష్ట పాలు చేసేందుకు, వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఈ ఇన్ఫ్లూయెన్సర్లను భారీ ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమో, లేదా రాజకీయ అండ దొరుకుతుందనే భ్రమలోనో పడి ఈ యువత తమ క్రియేటివిటీని రాజకీయ కలుషితం చేస్తున్నారు. ఫలితంగా, స్వచ్ఛమైన వినోదాన్ని పంచాల్సిన వేదికలు కాస్తా వివాదాస్పదం అవుతున్నాయి.
అనుదీప్ కటికల ఉదాహరణ కామెడీ హద్దులు దాటితే జైలే !
ఇటీవల స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల ఉదంతం ఇందుకు ఒక నిలువెత్తు నిదర్శనం. హాస్యం పేరుతో వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన స్క్రిప్టులతో వీడియోలు చేయడం అతడిని జైలు పాలు చేసింది. రాజకీయ ప్రేరేపిత కంటెంట్ ద్వారా వచ్చే తాత్కాలిక పాపులారిటీ కంటే, దాని వల్ల ఎదురయ్యే చట్టపరమైన చిక్కులే ప్రమాదకరమని ఈ ఘటన నిరూపిస్తోంది. పార్టీల ఐటీ సెల్ ఇచ్చే స్క్రిప్టులను గుడ్డిగా నమ్మి వీడియోలు చేసే వారు, తీరా కేసులు నమోదైనప్పుడు మాత్రం ఆ పార్టీల నుంచి ఎలాంటి సహాయం అందక ఒంటరివారైపోతున్నారు.
బలిపీఠంపై బ్రాండ్ వాల్యూ
ఒక ఇన్ఫ్లూయెన్సర్ , స్టాండప్ కమెడియనా.. లేదా యూట్యూబర్ పక్షపాత రాజకీయాల్లో తలదూర్చగానే వారి బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. సమాజంలో అన్ని వర్గాల ఆదరణ పొందాల్సిన కళాకారులు, ఒక పార్టీకి తొత్తులుగా మారినప్పుడు వారి ఫాలోయింగ్‌లో చీలిక వస్తుంది. అక్రమ సంపాదనకు ఆశపడి పోలీస్ రికార్డుల్లోకెక్కడం వల్ల వారి భవిష్యత్తు నీడలా మారుతుంది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ నుంచి ఇతర ఉపాధి అవకాశాల వరకు ఈ కేసులు వారిని వెంటాడుతూనే ఉంటాయి. అధికారం ఉన్నప్పుడు రెచ్చగొట్టే వారు, అధికారం పోగానే కనీసం గుర్తు కూడా పట్టరనే వాస్తవాన్ని ఈ సోషల్ మీడియా సైకోలు గుర్తించలేకపోతున్నారు.
కళాకారులు మేల్కొనాల్సిన సమయం
వినోదం ఆరోగ్యకరంగా ఉన్నంత కాలమే ప్రజలు ఆదరిస్తారు. అది రాజకీయ స్వార్థానికి బానిసైనప్పుడు ప్రజలు అసహ్యించుకుంటారు. ఇన్ఫ్లూయెన్సర్లు, కమెడియన్లు పార్టీల ట్రాపులో పడకుండా తమ సొంత ప్రతిభను నమ్ముకోవాలి. అడ్డగోలు సంపాదన కోసం జైలు గోడల మధ్య జీవితాన్ని నాశనం చేసుకోవడం విజ్ఞత అనిపించుకోదు. కళాకారులు సమాజానికి దిశానిర్దేశం చేయాలి కానీ, రాజకీయ చదరంగంలో బలిపశువులుగా మారకూడదు. ఈ విషయంలో యువ కళాకారులు అప్రమత్తంగా ఉండకపోతే, వారి పేరు చరిత్రలో కళాకారులుగా కాకుండా రాజకీయ ఉన్మాదులుగానే మిగిలిపోతుంది.
