వైసీపీకి టీడీపీ మ‌రో పొలిటిక‌ల్ `పంచ్‌`

పొలిటిక‌ల్ పంచ్ అడ్మిన్ ర‌వికిర‌ణ్‌కు టీడీపీ మ‌రో పంచ్ వేసింది. ఇప్ప‌టికే శాస‌న మండ‌లి నేప‌థ్యంలో కార్టూన్ వేసిన అంశంపై పొలిటిక‌ల్ పంచ్ అడ్మిన్ ర‌వికిర‌ణ్‌ను అరెస్టు చేసి, విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, టీడీపీ పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే అనిత విశాఖ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అభ్యంత‌ర‌క‌రంగా పోస్టులు పెట్టారంటూ ఆమె త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టారు. ఈ నేప‌థ్యంలో ర‌వికిర‌ణ్‌పై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు.

రాజ‌కీయ శ‌త్రుత్వాల‌కు ఆరంభ‌మే త‌ప్ప అంత‌ముండ‌ద‌ని ర‌వికిర‌ణ్ ఉదంతం స్ప‌ష్టంచేస్తోంది. హుందాగా సాగాల్సిన రాజ‌కీయాల‌లో చిల్ల‌ర చేష్ట‌లు మొద‌లై ప‌ర‌స్ప‌రం వైష‌మ్యాలు పెర‌గ‌డానికి దోహ‌దం చేస్తున్నాయి. సోష‌ల్ మీడియా దీనికి ఊతంగా మారింది. త‌మ పోస్టుకు ఎన్ని లైకులు వ‌చ్చాయీ, ఎంత‌మంది కామెంట్లు పెట్టాం.. ఎలా దూషించుకున్నార‌నేదే ల‌క్ష్యంగా ఈ పోస్టులు ఉంటున్నాయి.

ఈ త‌ర‌హా నిందాపూర్వ‌క‌మైన పోస్టుల‌కు భార‌తీయ జ‌నతా పార్టీనే శ్రీ‌కారం చుట్టింది. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హించుకోవ‌డానికి వినియోగించుకోవాల్సిన సాంకేతిక విప్ల‌వాన్ని ప్ర‌జ‌ల‌ను చీల్చేయ‌డానికీ, ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాన్ని కించ‌ప‌ర‌చ‌డానికీ ఉప‌యోగించుకుని పై చేయి సాధించాల‌ని చూస్తున్నారు. బీజేపీ రాహుల్ గాంధీపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తూ.. ఈ ర‌క‌మైన ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టింది. అస‌లే అది కాంగ్రెస్‌… ఊరుకుంటుందా.. త‌నవంతుగా బీజేపీపై దుమ్మెత్తిపోయ‌డం ప్రారంభించింది. క్ర‌మేపీ ఇది తెలుగు రాష్ట్రాల‌కూ పాకింది. నిందాపూర్వ‌క‌మైన పోస్టుల‌పై కేసులు పెట్ట‌డం మాత్రం ఆంధ్ర ప్ర‌దేశ్‌లోనే ప్రారంభ‌మైంది. కార‌ణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. త‌న కోస‌మంటూ ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా విభాగాన్నే ప్రారంభించింది. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం అధికార టీడీపీ త‌ప్పిదాల‌ను ఎత్తిచూపుతూ సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఈ అంశంలో పాపం తెలుగు దేశం పార్టీది వెనుకంజే.. తానే ఐటీకి ఆద్యుడ‌న‌ని చెప్పుకునే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్టీకి సోష‌ల్‌మీడియాలో ఈ ప‌రిస్థితి నిజంగా దెబ్బే. సామాజిక మాధ్యమంలో టీడీపీ విభాగం ఎదుర‌య్యే ప‌రిణామాల‌ను ముందే ఊహించి, సంయ‌మ‌నం పాటించదా లేక‌… స‌మ‌ర్థంగా ఎదుర్కొనే స‌త్తా లేకపోయిందా అనేది సందేహంగానే ఉంది. ఎదుటివాడు సెటైర్లు వేస్తుంటే… అందుక‌నుగుణంగానే అడుగేయాలి… స‌మాధానం చెప్పాలి త‌ప్ప‌.. ప్ర‌త్య‌ర్థిని ఎలా దెబ్బ‌తీయాల‌ని వ్యూహాలు ర‌చిస్తూ కూర్చోవ‌డం స‌రికాదు. ముల్లును తీయ‌డానికి గున‌పాన్ని ఉప‌యోగిస్తే ఫ‌లితం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవ‌స‌ర‌ముందా. ప్ర‌స్తుతం బీజేపీ ద‌న్నుతో అప్ర‌తిహ‌తంగా సాగిపోతున్న టీడీపీకి మున్ముందు ఇలాగే ఉండ‌క‌పోవ‌చ్చు. జాగ్ర‌త్త‌ప‌డితే మేలు. ఎస్సీఎస్టీ కేసుతో ర‌వికిర‌ణ్‌ను పావుగా చేసుకుని, చేయ‌గ‌లిగేది ఏమీ ఉండ‌దు.. కొత్త‌కొత్త తిట్లు పుట్ట‌డం త‌ప్ప‌…

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com