లోకేష్‌కు స్పీడ్‌ బ్రేకర్‌?

అఖిలేష్‌ యాదవ్‌ యుపి ముఖ్యమంత్రి అయిన నాటినుంచి అక్కడ అఖిలేష్‌ ఇక్కడ లోకేష్‌ అన్న వాదనకు బాగా బలం వచ్చింది. రాష్ట్ర విభజన, ఎపిలో అధికారం తర్వాత లోకేష్‌కు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఇదిగాక చాలా విషయాల్లో అందులోనూ, మానవ వనరుల మదింపు, ఆర్థిక వనరుల సమీకరణలో లోకేశ్‌ కీలక పాత్ర వహిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.మీడియాను కూడా ఆయనే సమీక్షిస్తుంటారు. మంత్రివర్గంలోనూ చేరతారనే భావం బలంగా వుంది.ఇలాటి తరుణంలో లోకేష్‌ ఎందుకో వేగం తగ్గించారని ఆ పార్టీ నేతలంటున్నారు. యుపిలో అఖిలేష్‌కు తండ్రి సమాజ్‌వాది సర్వాధినేత ములాయం సింగ్‌ ఆగ్రహం అవాంతరాలు వేసినట్టే ఇక్కడ ఈయనకు కూడా నాన్న నుంచి ఏమైనా అడ్డంకులు ఎదురవుతున్నాయా? లేక తను అనుకున్నట్టు చేయలేకపోతున్నాననే అసంతృప్తి పెరిగిందా? తెలియదు గాని ఆ మాట మాత్రం నిజమని సన్నిహితుల కథనం. ఇదెంత వరకూ పోయిందంటే చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కుమారుడు లోకేష్‌ ఎందుకో స్పీడు తగ్గించాడని ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేశారట.మరి ఇది వ్యూహాత్మకమా లేక ఉద్దేశపూర్వకమా తెలియదు.లోకేష్‌ తెలంగాణ వ్యవహారాలు చూస్తారని మొదట చెప్పినా ఓటుకు నోటు,జిహెచ్‌ఎంసి ఎన్నికలతో అది పూర్తిగా బెడిసికొట్టింది. నాన్న మొత్తం బిచాణా ఏత్తేశాక తానేం చేయాలనే సందేహం కూడా వచ్చి వుండొచ్చు. ఏమైతేనేం చినబాబును మళ్లీ రంగం మీదకు తెచ్చి పరుగులు తీయించేందుకు పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు ఏంచేస్తారో చూడాల్సిందే. ఎందుకంటే ఆయన కుమారుడి సహాయాన్ని కోరుకుంటున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి కూడా కొడుకును మంత్రిగా చూడాలని ముచ్చటపడుతున్నట్టు కొన్ని వర్గాల సమాచారం. నిజానికి ఒకసారి మంత్రిని చేస్తే లోకేష్‌ పాత్ర పరిమితమై పోతుందని ఆయన అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఏమైతేనేం.. ముందు ఆయన ఈ దశలో నిరాసక్తత లేదా నిర్లిప్తత పెంచుకోవడం మంచిది కాదని, చంద్రబాబు ఆయనకు సరైన పాత్ర నిచ్చి ఏవైనా కీలక బాధ్యతలు అప్పగించడం మంచిదని అనుచరగణం సూచిస్తున్నారు…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com