ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును మన రాజకీయ నేతలు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో గానీ, దాని చుట్టూ జరుగుతున్న హడావుడి చూస్తుంటే మాత్రం సామాన్యుడికి నవ్వు ఆగడం లేదు. పొదుపు చేయాలనే మంచి ఉద్దేశం కాస్తా, పొదుపు చేస్తున్నామని చాటిచెప్పుకునే భారీ పబ్లిసిటీ స్టంట్‌గా మారిపోయింది. సైకిళ్ల మీద వెళ్లడానికి .. ముందు ఓ కెమెరా టీమ్ ను కారులో పంపుతున్నారు.
దేశవ్యాప్తంగా నేతలు ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తున్నారు. ఒక మంత్రి గారు తన కాన్వాయ్‌లో ఐదు కార్లు తగ్గించామని గర్వంగా చెబుతారు.. కానీ ఆ ఐదు కార్లు తగ్గించామని చెప్పడానికి పది మంది ఫోటోగ్రాఫర్లను, ఒక డ్రోన్ కెమెరాను, సోషల్ మీడియా టీమ్‌ను వెంటబెట్టుకుని వెళ్తారు. ఇక కొందరు నేతలైతే ఒకడుగు ముందుకు వేసి, బిజినెస్ క్లాస్ వదిలేసి ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తూ కెమెరాలకు ఫోజులిస్తున్నారు. పక్క సీట్లో కూర్చున్న సామాన్యుడితో సెల్ఫీ దిగి సామాన్యుడిలా నేను అని ట్వీట్ చేస్తారు. మరో విచిత్రం ఏమిటంటే, పేపర్ పొదుపు చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పంపుతున్న నేతలు, అదే విషయాన్ని ఫ్లెక్సీల మీద ముద్రించి ఊరంతా కట్టేస్తున్నారు.
ప్రధాని పిలుపు వెనుక ఉన్న ఆశయం గొప్పదే అయినా, మన నేతలు దానికి పబ్లిసిటీ రంగు పూసి పలచన చేస్తున్నారు. నిజమైన పొదుపు అనేది నిశ్శబ్దంగా ఉండాలి కానీ, మైకులు పట్టుకుని ఊదరగొడితే అది పొదుపు అవ్వదు . ఆర్భాటాల కోసం చేసే ఖర్చును తగ్గిస్తేనే నిజమైన అస్టరిటీ అని, కేవలం ఫోటోల కోసం చేసే ఈ హంగామాను చూసి దేశం నవ్వుకుంటోందని నేతలు గ్రహించాల్సిన అవసరం ఉందన్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేతల పొదుపు చూసి మిగిలిన వాళ్లు స్ఫూర్తి పొందాలంటే.. వారి పొదుపు నిజాయితీగా ఉండాలి..పబ్లిసిటీ స్టంట్ గా కాదు!
