ఈ విష‌యంలో రాహుల్ మాట నిత్య స‌త్యం!

ఇప్పుడు భార‌త‌దేశ రాజ‌కీయాల్లో అతిపెద్ద స‌మ‌స్య… ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కంటే, వ్య‌క్తిగ‌త రాజ‌కీయ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కే నాయ‌కులు ప్రాధాన్య‌త ఇస్తుండ‌టం! బీహార్ లో జ‌రిగింది ఇదే. ఆర్జేడీతో బంధం తెంచుకుని, 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే నితీష్ కుమార్ మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసేశారు. ఈ ప‌రిణామాల‌పై ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీహార్ ప్ర‌జ‌ల‌ను నితీష్ కుమార్ నిలువునా మోసం చేశార‌ని విమ‌ర్శించారు. మ‌త త‌త్వ శ‌క్తుల‌కు వ్య‌తిరేకంగా ప‌రిపాల‌న చేస్తార‌న్న న‌మ్మ‌కంతో నితీష్ కు ప్ర‌జ‌లు గెలిపిస్తే, త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం ఇవాళ్ల నితీష్ అలాంటివారితోనే చేతులు క‌లుపుతున్నారు అన్నారు. నితీష్ ప్లానింగ్ అంతా గ‌డ‌చిన నాలుగైదు నెల‌లుగా తెలుస్తూనే ఉంద‌నీ, ఇప్పుడు స‌మ‌యం చూసుకుని గోడ దూకేశార‌న్నారు. ‘భార‌త దేశ రాజ‌కీయాల్లో ఇదే అస‌లు స‌మ‌స్య, వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం ఏదైనా చేసే వెసులుబాటు ఉంది. ఎలాంటి నియ‌మాలూ, విలువ‌లూ, విశ్వ‌స‌నీయ‌తా అనేవి లేకుండా పోతున్నాయి’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బీహార్ ప‌రిణామాల నేప‌థ్యంలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. విశ్వసనీయతా, విలువలూ అనేవి రాజకీయాల్లో వెతక్కూడని అంశాలుగా మారిపోయాయి. నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్ని నీతులు చెబుతున్నా.. లాలూ ప్ర‌సాద్ యాదవ్ కీ ఆయ‌న‌కీ పెద్ద తేడా ఏముంది చెప్పండీ..? అవినీతి ప‌రుడైన లాలూ కుమారుడిని మంత్రి వ‌ర్గం నుంచి పంపించ‌లేని నిస్స‌హాయ‌త‌తో రాజీనామా చేశార‌ని నితీష్ చెప్పుకుంటున్నారు. ఒక‌వేళ, ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే ఎన్నిక‌లు వెళ్లి ఉంటే… ఆయ‌న అత్యంత నీతిప‌రుడ‌నీ, అవినీతిని స‌హించ‌ని నాయ‌కుడ‌నీ దేశ‌వ్యాప్తంగా గొప్ప‌గా చెప్పుకునేవారు. దేశంలో నితీష్ కి మ‌రింత ఇమేజ్ బాగా పెరిగేది. లాలూ కుటుంబం అవినీతి అనేది ఇప్ప‌టి మాట కాదు. ఆ విష‌యం తెలిసి.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే అవినీతి మ‌య‌మైన ఆర్జేడీ, కుంభ‌కోణాల‌తో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టారు. తూచ్‌.. ఇప్ప‌టికిప్పుడు త‌న‌కు ఏదో అవినీతి మ‌ర‌క‌లు అంటేస్తున్నాయ‌ని రాజీనామా చేసి.. మ‌ళ్లీ సీఎం ప‌గ్గాలు అందుకోవ‌డం కూడా ప‌చ్చి స్వార్థ రాజ‌కీయ‌మే.

రాహుల్ గాంధీ చెప్పిన‌ట్టు భార‌తదేశ రాజ‌కీయాల్లో ఇదే అస‌లు స‌మస్య‌గా మారింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను త‌మ అదుపాజ్ఞ‌ల్లోకి తెచ్చుకోవాల‌నే ఏకైక ల‌క్ష్యంతో కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు ఇలాంటి విలువ‌ల్లేని రాజ‌కీయాల‌కు తెర లేపిందని అన‌డంలో సందేహం లేదు. ఆ మ‌ధ్య అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, త‌రువాత త‌మిళ‌నాడు, త్వ‌ర‌లో ఒడిశా, ఆ తరువాత ఢిల్లీ, అటుపై మరో రాష్ట్రం. ఇప్పుడు బీహార్ నంబ‌ర్ వ‌చ్చింది, అంతే! విశ్వ‌స‌నీయ‌తా విలువ‌లూ నియ‌మాలూ లాంటివి ఏవీ లేవు. రాష్ట్రాల‌న్నీ కేంద్రం మోచేతి కింద బ‌త‌కాలి! రాష్ట్రాలు స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించే శ‌క్తి ఉండ‌కూడ‌దు. ఈ ల‌క్ష్య సాధ‌న కోసం ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఉన్న వెసులుబాట్ల‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనువుగా భాజ‌పా వాడేస్తోంద‌ని అన‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.