వైఎస్ వివేకా హత్యపై రాజుకున్న రాజకీయం..! ఈ అనుమానాలకు బదులెవరిస్తారు..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై రాజకీయం రాజుకుంది. ఉదయం నుంచి గుండెపోటు అంటూ నివాళి అర్పిస్తూ వచ్చిన వైసీపీ నేతలు… ఆ తర్వాత వివేకానందరెడ్డి మృతదేహం పోస్టుమార్టానికి వెళ్లిన తర్వాత నుంచి మాట మార్చారు. తమకూ అనుమానాలున్నాయని ప్రారంభించి..చివరికి..అది చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణరెడ్డి కలిసి చేయించారని ఆరోపణల స్థాయికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లిన జగన్మోహన్ రెడ్డి… వివేకాకు నివాళులర్పించి.. మీడియా ముందు అనేక ఆరోపణలు చేశారు. ఎలా హత్య చేశారో.. విపులంగా వివరించిన జగన్.. డ్రైవర్‌పై నెట్టేందుకు.. పోలీసులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓ లెటర్ పోలీసులు తనకు చూపించారని.. ఆయన చెప్పుకొచ్చారు. హత్యకు గురయ్యేవాళ్లు లెటర్ ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తు తీరు చూస్తూంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని.. సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. తమ ఇంట్లో హత్యలు జరుగుతున్నాయని.. జగన్ ఆరోపించారు. వైఎస్ ను దెబ్బతీయడానికి రాజారెడ్డిని హత్య చేశారని..తర్వాత తన తండ్రిని చంపేశారన్నారు. తన తండ్రి హత్యపై ఇప్పటికీ అనుమానాలున్నాయన్నారు. తనపై కూడా హత్యాయత్నం జరిగిందని.. ఎయిర్ పోర్టులో కత్తులతో దాడి చేశారన్నారు. అంతకు ముందు విజయసాయిరెడ్డి కూడా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి.. దాదాపుగా ఇవే ఆరోపణలు చేశారు. చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ రెడ్డిలపై ఆరోపణలు చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్నారు. సీబీఐ విచారణ కావాల్సిందేనన్నారు.

టీడీపీ నేతలు మాత్రం.. మొత్తం వ్యవహారంలో అనేక అనుమానాలను…వైసీపీ నేతల ముందు ఉంచారు. పరిస్థితి చూస్తేనే హత్య అని పక్కాగా తెలిసిపోయినా… గుండెపోటు,సహజ మరణం అని చిత్రీకరించేందుకు ఎందుకు ప్రయత్నించారన్న ప్రశ్న మొదటగా.. టీడీపీ నుంచి వైసీపీకి వస్తోంది. హత్య గురించి మొట్టమొదటగా తెలుసుకున్న వ్యక్తి వివేకా పీఏ కృష్ణారెడ్డి. ఆయన వైఎస్ కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అవినాష్, జగన్ మామ గంగిరెడ్డి మొదటగా వచ్చారు. అవినాష్.. వివేకా ఆ పరిస్థితుల్లో చనిపోయి ఉన్నా ..పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పైగా డెడ్ బాడీని హాల్లోకి మార్చి.. తన మనుషులతో రక్తపు మరకల్ని కడిగే ప్రయత్నం చేశారు. సగం కడిగేశారు కూడా. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులతో అవినాష్ రెడ్డి… గుండెపోటు కారణంగా కింద పడి చనిపోయారు.. చిన్న విషయం..కేసు అవసరంలేదని చెప్పారని.. ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. కేసు పెట్టాలని వివేకా కూతురు, అల్లుడు.. గట్టిగా వత్తిడి చేసిన తర్వాతనే కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారంటున్నారు.

అంతే కాదు.. పరిసరాలు చూస్తేనే హత్య అని తెలిసిపోతుంది. కానీ.. సాక్షి మీడియా కూడా ఉదయం అంతా గుండెపోటు మరణం అని ప్రచారం చేసి.. సంతాపం ప్రకటించింది కానీ.. వివేకా హత్య దృశ్యాలు అసలు చూపించలేదు. పైగా.. చనిపోయిన తర్వాత ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి… గాయాలన్నింటికీ కట్టు కట్టించినట్లు తెలుస్తోంది. దీంతో కావాలనే సాక్షి మీడియా.. వివేకాది సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న అనుమానాలు టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. తీవ్ర గాయాలైన ఫోటోలు, పోస్టుమార్టానికి మృతదేహాన్ని తరలించడంతో… అప్పటి నుంచి అనుమానాస్పద కేసు అని వైసీపీ నేతలు అనడం ప్రారంభించారు. చివరికి జగన్మోహన్ రెడ్డి సాయంత్రం..నరికి చంపారని.. ఉదయమే తనకు తెలుసన్నట్లుగా మాట్లాడారు. తెలిసినా..సహజమరణంగానే ఎందుకు జగన్ మీడియా ప్రచారంచేసిందనేది.. చాలా మందికి అర్థం కాని విషయం. చివరికి దానికి రాజకీయ రంగు పులిమారు. నేరుగా టీడీపీపై ఆరోపణలు ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు మిస్టరీ బయటకు రావాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు.

మామూలుగా అయితే ఓ చిన్న వైసీపీ కార్యకర్త లేదా..మరో వ్యక్తి ఎవరైనా అనుమానాస్పదంగా మరణించి ఉంటే.. దానికి జగన్ మీడియా అల్లే కథలు సాధారణ ప్రజలకు సహజంగానే అర్థమవుతాయి. గుంటూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే.. దానికి సాక్షి చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే.. ఎవరైనా వైసీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినా.. దానిపై కథలు, కథలుగా వార్తలు ప్రచారం చేస్తుంది సాక్షి మీడియా. అలాంటిది వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైనా… సహజమరణం అన్నట్లు కవర్ చేసుకోవడానికి ప్రయత్నించడం అశ్చర్యానికి గురి చేసే అంశమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com