కొంత ఇబ్బందిప‌డ్డాను అంటున్న పొన్నాల‌!

కాంగ్రెస్ లో రెబెల్స్‌, స్వ‌తంత్రంగా పోటీకి దిగుతామంటున్న అసంతృప్త‌ నేత‌ల‌తో ముగ్గురు స‌భ్యులు బుజ్జ‌గింపులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీన్లో భాగంగా సీనియ‌ర్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య హైద‌రాబాద్ లోని ఒక ప్ర‌ముఖ హోట‌ల్లో ముగ్గురు స‌భ్యుల బృందాన్ని క‌లిశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. గెలుపే ల‌క్ష్యంగా పార్టీలో ఇప్పుడున్న ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు హైక‌మాండ్ ఈ త‌ర‌హా చొర‌వ తీసుకోవ‌డం మంచి ప‌రిణామం అన్నారు. పాండిచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, శివ‌కుమార్ లు త‌న‌కు మంచి మిత్రుల‌నీ, వారితో భేటీ సంద‌ర్భంగా స‌మ‌స్య‌ల‌న్నీ వివ‌రించాను అన్నారు. టిక్కెట్ల పంపిణీ పూర్త‌వుతున్న నేప‌థ్యంలో పార్టీప‌రంగా ఉత్ప‌న్న‌మౌతున్న ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

పొత్తులు, రాజ‌కీయాలు, ఎన్నిక‌ల‌కు త‌న‌కు కొత్త కాద‌నీ, కానీ తానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ల‌క్ష్మ‌య్య అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ విష‌యాల గురించి మరింత వివ‌రంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు! రేప‌టి వ‌ర‌కూ స‌మ‌యం ఉంది కాబ‌ట్టి, కొన్ని స‌వ‌ర‌ణ‌లు కూడా జ‌రుగుతాయ‌నే ఆశాభావం త‌న‌కు ఉంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ, పొన్నాల ఆ క‌మిటీ ముందు ప్ర‌స్థావించిన స‌మ‌స్య‌లేంట‌నేవి మాత్రం నేరుగా చెప్ప‌లేదు. అన్నీ చెప్పెయ్య‌మంటారా అంటూ ఉల్టా ప్ర‌శ్నించారు. తాను పీసీసీ అధ్య‌క్షుడిగా ఉండ‌గా పొత్తుల‌కు పోగా 113 సీట్ల‌లో 32 మంది వెన‌క‌బ‌డిన వ‌ర్గాల స‌భ్యుల‌కు టిక్కెట్లు ఇచ్చాన‌ని గుర్తుచేశారు. జ‌నాభా దామాషా ప‌ద్ధ‌తి ప్ర‌కారం ప్ర‌భుత్వంతోపాటు, పార్టీలో కూడా అంద‌రికీ ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని అప్పుడు నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఇప్పుడు కూడా అదే అమ‌లు చేస్తార‌ని తాను భావిస్తున్నాను అన్నారు.

అస‌లు విష‌యాన్ని పొన్నాల ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీల‌కు అన్యాయం జ‌రిగింద‌నేది క‌మిటీకి చెప్పిన‌ట్టు ఆయ‌న వ్యాఖ్య‌ల్లో అర్థ‌మౌతోంది. తాను పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు బీసీల‌కు న్యాయం జ‌రిగింది అంటే, దాన‌ర్థం ఇప్పుడు జర‌గ‌డం లేద‌నే క‌దా. గ‌తంలో పార్టీ తీసుకున్న నిర్ణ‌యాల ప్ర‌కారం సీట్ల కేటాయింపులు జ‌ర‌గ‌లేద‌న్న అసంతృప్తి పొన్నాల స్ప‌ష్టంగానే వ్య‌క్తం చేశారు. ఇంకోటి, చివ‌రి నిమిషం వర‌కూ మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి, మార్పులేంటో సోమ‌వారం సాయంత్రానికి తెలిసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.