తెలంగాణ ఏర్పాటు అంశంలో తేజస్వీ సూర్య పార్లమెంట్ లో దేశ విభజనతో పొల్చాడని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫీలవుతున్నారు. ఆయన ఫీలయితే పర్వాలేదు.. అందరూ అలాగే ఫీలవ్వాలని పట్టుబడుతున్నారు. చివరికి చంద్రబాబు కూడా తనలాగే ఫీలయి.. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయాలని.. తానే స్వయంగా ఓ లేఖ రాసేశారు.
ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలుసని గుర్తు చేస్తూ, విభజన ప్రక్రియ చట్టబద్ధంగా, పార్లమెంటు సాక్షిగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల పోరాటాలు, వందలాది మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై కొందరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి తన లేఖలోఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన విద్వేషాలను రగిలిస్తున్నాయని పొన్నం వాదన. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉనికిని, గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వంటి నేతలు కూడా తెలంగాణ ఏర్పాటుపై చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలు మనోభావాలను దెబ్బతీస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
చివరికి ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పార్లమెంటులో తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు వంటి వ్యాఖ్యలను కూడా మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1997లోనే ఒక ఓటు – రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన బీజేపీకి, నేడు విభజన అన్యాయంగా జరిగిందని మాట్లాడే నైతిక హక్కు లేదని హితవు పలికారు. తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుండి తొలగించేలా స్పీకర్‌కు లేఖ రాయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
అసలు పొన్నం చంద్రబాబుకు లేఖ రాయడానికి స్పేస్ లేదు. ఈ వివాదంలో టీడీపీ, చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు. అయినా సరే పొన్నం.. రాజకీయాల్లో చంద్రబాబు కంటే జూనియర్ అయిన మోదీకి , కూటమి నేతలకు వాస్తవాలను వివరించాలని పొన్నం లేఖ రాశారు. రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కోరుకునే సగటు తెలుగువాడి ఆకాంక్షను గౌరవించాలని, చంద్రబాబు తన సహచర నేతలకు ఈ విషయంలో దిశానిర్దేశం చేయాలని కోరారు. ప్రజలు ఇప్పటికే కలిసిమెలిసి ఉంటున్నారు. రాజకీయాల కోసం ఎవరో చేసిన కామెంట్లతో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నా వారితోనే సమస్యలు వస్తున్నాయి. పొన్నం కూడా అందులో భాగమై… చంద్రబాబును భాగం చేయాలనుకుంటున్నారు.
