సెంటిమెంట్ కొన‌సాగించిన త్రివిక్ర‌మ్‌

తెలుగు భాషంటే త్రివిక్ర‌మ్‌కి ఎంత మ‌మ‌కార‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న టైటిళ్లు అచ్చ తెలుగులో ఉంటాయి. డైలాగులు కూడా అంతే. త‌న క‌థానాయిక‌ల్ని కూడా తెలుగులోనే మాట్లాడ‌మంటారు. వాళ్ల‌తోనే డ‌బ్బింగ్ చెప్పించుకోవ‌డం ఓ సెంటిమెంట్‌గానూ మార్చుకున్నారు. ‘అజ్ఞాత‌వాసి’ కోసం కీర్తి సురేష్‌తో డ‌బ్బింగ్ చెప్పించారు. ‘అ.ఆ’ స‌మ‌యంలోనూ అంతే. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తొలిసారిగా డ‌బ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడు ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌’లోనూ అదే సెంటిమెంట్ కొన‌సాగింది. ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది పూజా హెగ్డే. త‌న‌తో తొలిసారి డ‌బ్బింగ్ చెప్పించారు. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. తొలిసారి త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది పూజా. సాధార‌ణంగా ప్ర‌తీ క‌థానాయిక త‌న గొంతు తానే వినిపించాల‌నుకుంటుంది. కానీ ద‌ర్శ‌క నిర్మాత‌లు భ‌య‌ప‌డుతుంటారు. దానికి తోడు భాష రానివాళ్ల‌తో డ‌బ్బింగ్ చెప్పించ‌డం ఓ ప్ర‌హ‌స‌నం. వాళ్ల కోసం ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించాలి. డ‌బ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పిస్తే రెండ్రోజుల్లో ముగిసేది.. క‌థానాయిక‌ల విష‌యానికొస్తే వారం రోజులైనా ప‌డుతుంది. కానీ త్రివిక్ర‌మ్ మాత్రం ప‌ట్టుబ‌ట్టి త‌న క‌థానాయిక‌ల‌తో డ‌బ్బింగ్ చెప్పిస్తున్నాడు. ఇదే సెంటిమెంట్ ఇక ముందూ కొన‌సాగుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com