ఆపద్ధర్మంలో కేసీఆర్ అధికారాలేమిటి..?

తెలంగాణలోఇప్పుడు ప్రజా ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉంటాయన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రభుత్వాలు అంటూ ఉండవని… ఒకటే ప్రభుత్వం ఉంటుందని.. దానికి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టంగా చెప్పారు. అంటే కేసీఆర్ తెలంగాణ సీఎంగా తనను తాను క్లెయిమ్ చేసుకున్నారు. అయితే అక్కడే కాస్తంత మినహాయింపు ఇచ్చారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు..నైతికత అంశం వస్తుందని… అలాంటి సమయంలో.. మోరల్ వాల్యూస్ పాటిస్తే.. సరిపోతుందని చెప్పుకొచ్చారు. రాజకీయాలలో నైతిక విలువలు గురించి చెప్పుకుంటే.. అదో పెద్ద గ్రంధం అవుతుంది.

తెలంగాణ రాష్ట్ర సమితికి కచ్చితంగా..అధికారం అనేది అడ్వాంటేజ్ అవుతుంది. సాధారణంగా.. గడువు ముగిసే సమయంలో ఈసీ రాజ్యాంగం ప్రకారం నిర్వహించే ఎన్నికలకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. అధికారం యంత్రాంగం అంతా.. ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటుంది. ఎన్నికల నిర్వహణ సమయంలో… ఈసీ అధికారుల్ని అధీనంలోకి తీసుకున్నా.. వారిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం తప్పక ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. ఆ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. కేసీఆర్ అలాంటి సహజమైన అధికారం చేజారకుండా.. తన దగ్గర ఉంచుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ అధికారాన్ని వాడుకోవడం నైతికత కాదు. మరి కేసీఆర్ ఏం చేస్తారు..?

కేర్‌ టేకర్‌ సీఎంగా కేసీఆర్ ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా.. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తాయి. ఫ్యూన్‌ను బదిలీ చేసినా.. తప్పదు. ఇప్పటికే బీజేపీ సహా… విపక్ష పార్టీలన్నీ… రాష్ట్రపతి పాలనవిధించాలని… కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండ కూడదని డిమాండ్లు చేస్తున్నాయి. రేపు కేసీఆర్.. అధికారుల బదిలీలు.. ఓటర్లకు ఏమైనా ప్రయోజనాలు కల్పించే నిర్ణయాలు తీసుకుంటే.. ఈ పార్టీలు చేసే రచ్చ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది కేసీఆర్ పలుకుబడిని దెబ్బతీస్తుంది. కావాలని అధికారాన్ని వదిలేసుకుని.. లేని పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు వస్తాయి. అందుకే కేసీఆర్… కేర్ టేకర్ సీఎంగా విధాన నిర్ణయాలేమీ తీసుకోకుండా… తెర వెనుక అధికారం ఉపయోగించుకోవడానికే పరిమితమయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com