ప్రభుదేవా తో ఇంటర్వ్యూ: డాన్స్ లో ఇప్పటికీ చిరంజీవి గారే ఇష్టం

ప్రభుదేవా… ఇండియన్స్ మైఖైల్ జాక్సన్‌!
ప్రభుదేవా వ‌చ్చాకే… ఇండియ‌న్ స్క్రీన్‌కు కొత్త త‌ర‌హా స్టెప్పులు ప‌రిచ‌య‌మ‌య్యాయి.
డాన్స్ ఓ క‌మర్షియ‌ల్ ఎలిమెంట్ అయిపోయింది.
పాటొస్తే.. సిగ‌రెట్ తాగ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లేవాళ్లు కూడా ఈసారి ఎన్ని కొత్త స్టెప్పులు పుట్టుకొచ్చాయో అని ఆస‌క్తిగా చూడ‌డం మొద‌లెట్టారు. హీరో అయ్యాక‌.. ఆ డాన్సుల్ని ఎవ‌రెస్ట్ అంచుల వ‌ర‌కూ తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. త‌న‌లో ఓ ద‌ర్శకుడు కూడా ఉన్నాడ‌ని నిరూపించుకొన్నాడు. ఇన్నేళ్లయినా డాన్స్ పై మ‌మ‌కారం త‌గ్గలేదు. న‌టుడిగా కొన‌సాగుతూ ద‌ర్శకుడిగా వెలుగుతూ కొరియోగ్రాఫ‌ర్‌గానూ సంతృప్తిక‌ర‌మైన జీవితం కొన‌సాగిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాత‌గానూ మారాడు. అభినేత్రి సినిమాకి ప్రభుదేవా కూడా ఓ నిర్మాతే. తాను న‌టించి, నిర్మించిన అభినేత్రి త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా ప్రభుదేవాతో చిట్ చాట్ ఇది.

* మీరు న‌టిస్తున్న తొలి హార‌ర్ కామెడీ సినిమా ఇది.. ఈ జోన‌ర్‌లో న‌టించ‌డం ఎలా అనిపిస్తోంది?
నిజంగా నాకు ఓ కొత్త అనుభ‌వం. కామెడీ సినిమాలు ఇది వ‌ర‌కు కొన్ని చేశా. అయితే అందులో హార‌ర్ ఎలిమెంట్ కూడా ఉండ‌డంతో కొత్తగా అనిపిస్తోంది. మేం కూడా కామెడీ, ఎమోష‌న్స్‌కి పెద్ద పీట వేశాం. హార‌ర్ ఎలిమెంట్ ఉంటుంది. కానీ.. లైట్‌గానే ఆధార‌ప‌డ్డాం.

* అస‌లు నిర్మాత‌గా ఈ సినిమా తీయాల‌న్న ఆలోచ‌న ఎందుకొచ్చింది.?
విజ‌య్‌తో నా బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేద్దామ‌నుకొన్నా. క‌థ రెడీ అయిపోయింది. ఓ హీరోని అనుకొన్నాం. కానీ త‌న కాల్షీట్లు ఎంత‌కీ దొర‌క‌డం లేదు. చేస్తా.. అంటున్నాడు గానీ, ఎప్పుడో చెప్పడం లేదు. ఓ రోజు విజ‌య్ నా ద‌గ్గర‌కు వ‌చ్చి ‘ఎవ‌రో ఎందుకు సార్‌, మీరే ఎందుకు చేయ‌కూడ‌దు?’ అని అడిగాడు. మిగిలిన నిర్మాత‌లంతా ఓకే అన‌డంతో నేను అనుకోకుండా హీరో అయ్యా.

* హార‌ర్ కామెడీ సినిమా అని చెబుతున్నా మీరూ, త‌మ‌న్నా క‌ల‌సి ఇదో డాన్సింగ్ మూవీగా మార్చేసిన‌ట్టున్నారు?
కావాల‌ని స్టెప్పులు వేయ‌లేదు. ఈ సినిమాకి అది అవ‌స‌రం. డాన్స్ టీజ‌ర్లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందుకే ఇంకాస్త క‌సిగా స్టెప్పుల్ని కంపోజ్ చేశాం.

* తమ‌న్నా మీతో పోటీ ప‌డి స్టెప్పులు వేసిన‌ట్టుంది…
అవును. త‌ను గొప్ప డాన్సర్‌. డాన్స్ అంటే చాలు.. త‌న‌లో ఎక్కడ‌లేని ఉత్సాహం వ‌చ్చేస్తుంది. క‌థానాయిక‌లంతా రెండు మూడు గంట‌లు డాన్స్ చేసి అల‌సిపోతారు. కానీ త‌మ‌న్నా రోజంతా డాన్స్ చేయ‌మ‌న్నా చేస్తుంది. ఈ సినిమాతో త‌మ‌న్నాలోని డాన్సింగ్ టాలెంట్ పూర్తి స్థాయిలో వెలుగులోకి వ‌స్తుంది.

* డాన్స్, న‌ట‌న‌, ద‌ర్శక‌త్వం, నిర్మాత‌… ఇలా ఎన్నో కోణాల్లో మీ ప్రతిభ చూపించారు.. చూపిస్తున్నారు. వీటిలో మీకు బాగా సంతృప్తినిచ్చిన విభాగం ఏమిటి?
క‌చ్చితంగా డాన్స్ మాస్టర్‌గానే. నేను కంపోజ్ చేసినా, మ‌రోక‌రు కంపోజ్ చేసిన మూమెంట్స్ వేసినా.. డాన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తా.

* రోజుకి ఎన్ని గంట‌లు డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు?
ప్రతీ రోజూ చేయ‌ను. షూటింగ్ మ‌రో నాలుగు రోజుల్లో ఉంద‌న‌గా డాన్స్ మొద‌లెడ‌తా. ప్రతీ స్టెప్పూ కొత్తగా ఉండాల‌ని, నాలో నేను మ‌ద‌న‌ప‌డి స్టెప్పుల్ని డిజైన్ చేయ‌ను. మ‌నం ఏం చేయాల‌నుకొన్నా.. అది బీట్‌ని బ‌ట్టే ఉంటుంది.

* న‌వ‌త‌రం అంతా డాన్స్‌లు బాగా చేస్తోంది. మీ అభిమాన డాన్సర్ ఎవ‌రు?
చిరంజీవి గారే. ఆయ‌న డాన్స్‌లో ఓ అద్భుత‌మైన గ్రేస్ ఉంటుంది. ఇప్పటి వాళ్లంతా బాగా చేస్తున్నారు. ప్రతీ సినిమాలోనూ క‌నీసం ఒక్క పాట‌లో అయినా గ్రేట్ డాన్సింగ్ మూమెంట్స్ ఉంటున్నాయి.

* చిరంజీవి 150వ సినిమా కోసం డాన్స్ కంపోజ్ చేస్తున్నారా?
చేయాల‌ని ఉంది. కానీ.. ఇంకా పిలుపు రాలేదు.. (న‌వ్వుతూ)

* మీలోనూ ఓ ద‌ర్శకుడు ఉన్నాడు… మిగిలిన వారి డైరెక్షన్ లో చేసిన‌ప్పుడు స‌ల‌హాలిస్తారా?
ఏం ఇవ్వను. ఎందుకంటే ఎవ‌రి ఆలోచ‌న వారిది. ఎవ‌రి శైలి వారిది. ద‌ర్శకుడు ఓ క‌థ చెప్పి ఓకే అన్న త‌ర‌వాత ఏ విష‌యంలోనూ జోక్యం చేసుకోను. సినిమా మొత్తం అయ్యాక స్క్రీన్ పై చూసుకోవ‌డంలో ఓ తృప్తి ఉంటుంది. ఈలోగా ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని మార్పులూ, చేర్పులూ అంటూ సినిమాని పాడుచేయ‌డం నాకు ఇష్టం ఉండ‌దు.

* ఇప్పటి కొరియోగ్రాఫ‌ర్స్‌పై మీ అభిప్రాయం ఏమిటి?
నిరూపించుకోవాల‌న్న త‌ప‌న ఉంది. అందుకే కొత్త కొత్త మూమొంట్స్ కంపోజ్ చేస్తున్నారు. కొన్ని స్టెప్పులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్టెప్పులు కంపోజ్ చేయ‌డానికి ఎంత క‌ష్టప‌డి ఉంటారో ఓ కంపోజ‌ర్‌గా నాకు తెలుసు. అందుకే ఏదైనా మంచి డాన్స్ చూస్తే వెంట‌నే కొరియో గ్రాఫ‌ర్ ఎవ‌రో తెలుసుకొని.. ఫోన్ చేసి అభినందిస్తా.

* ఇన్నేళ్ల నుంచి ప‌రిశ్రమ‌లో ఉంటున్నారు. డాన్స్‌.. న‌ట‌న‌.. సినిమా… ఇవేం బోర్ కొట్టడం లేదా?
లేదు. ఎందుకంటే నాకు చిన్న చిన్న విష‌యాల్లో చెప్పలేనంత సంతృప్తి దొరుకుతుంటుంది. ప్రతీ రోజూ కొత్తగానే ఫీల్ అవుతా. ఓ మంచి స్టెప్ వేస్తే.. ఆ ఎన‌ర్జీ ఆ రోజంతా ఉంటుంది. మ‌రో పాతికేళ్లయినా ఈ ఉత్సాహం పోదేమో?

* మ‌ళ్లీ డైరెక్షన్ ఎప్పుడు?
త్వర‌లోనే. ఓ క‌థ సిద్దం చేస్తున్నా. తెలుగులో కూడా ద‌ర్శక‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయి.

* ఆల్ ద బెస్ట్‌
థ్యాంక్యూ…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close