పికె టు పికె- జగన్‌ తీరు నాట్‌ ఒకె..

కేంద్రంలో నరేంద్ర మోడీని,బీహార్‌లో నితిష్‌ కుమార్‌ను గద్దెక్కించిన కీలక వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంతకిశోర్‌ యుపిలో కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోయారు. కాని ఆయన వ్యూహ రచన మాత్రం ఇప్పటికీ గిరాకిలోనే వుంది.ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ సలహాదారుగా వున్న ప్రశాంత కిశోర్‌ ఈ మధ్యనే పార్టీ జిల్లా నేతలతో ముఖాముఖి ఇష్టాగోష్టి జరిపారు.

ఇదంతా మీడియాలో బాగానే ప్రచారమైంది. ఎన్నికల మూడ్‌ తీసుకురావడానికి ఇలాటివి అవసరమని జగన్‌ బృందం భావిస్తున్నదనేందుకు ఇదో ఉదాహరణ. అయితే ఈ సందర్భంలో ప్రశాంత కిశోర్‌ ఇచ్చిన సలహాలు సూచనలు ఆసక్తికరంగా వున్నాయి. మొదటి విషయం ఏమంటే ఆయన ఎక్కువగా జగన్‌ శైలిని సవరించుకోవాలన్నారట. మరింత కలివిడిగా కార్యకర్తలకు దగ్గరగా వుండాలని చెప్పారట. మీరు హైదరాబాద్‌లో వున్నంత వరకూ ఎపిలో ఎలా ప్రభావం చూపించలేరని తేల్చిపారేశారు. వీలైనంత త్వరలో విజయవాడ తరలాల్సిందేనని చెప్పారట. ఇక అప్పుడప్పుడు ధర్నాలు నిరసనలు చేస్తే చాలదు- మీ నాన్న లాగా పాదయాత్ర జరిపి ప్రజలకు దగ్గర కావాలని కూడా సలహా ఇచ్చారు. ఇవన్నీ చేసినా ఒంటరిగా అధికారంలోకి రావడం అంత తేలిక కాదు. పవన్‌ కళ్యాణ్‌ జనసేనతోనూ వామపక్షాలతోనూ మంచిగా వుంటే తప్ప మీకున్న లోటు తీరదని ప్రశాంత్‌ ప్రబోధించాడని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటి వరకూ వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలే ఎక్కువగా చేస్తున్నారు. మరి వారి వైఖరి మార్చుకుంటారా? బిజెపితో వైసీపీ దగ్గరవుతున్న సూచనలు కూడా వున్నాయి. ఆ పరిణామాలెలా వుంటాయి? చూడాల్సిందే. అవన్నీ ఎలా వున్నా జగన్‌ ధోరణి మారాలని మాత్రం ఆయనే నియమించుకున్న పికె చెప్పి వెళ్లడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.