రివ్యూ : ప్రేమమ్ – అంతులేని ప్రేమ ప్ర‌యాణంలో ఒక మజిలీ

మ‌ల‌యాళ చిత్రం ప్రేమమ్‌.. ఒక మ‌ల‌య‌మారుతం! సున్నిత‌మైన ప్రేమ‌క‌థాంశాన్ని ఎంతో రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కించారు. అయితే, ఇంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రానికి తెలుగు రీమేక్ అనేది క‌చ్చితంగా సాహ‌సోపేత‌మైన నిర్ణ‌య‌మే. ఎందుకంటే, ఎంత వ‌ద్ద‌నుకున్నా… మ‌ల‌యాళ చిత్రంతో పోలిక‌లు వినిపిస్తూనే ఉంటాయి. ఆ మ్యాజిక్ మ‌రోసారి ఆవిష్కృతం అవుతుందా అనే అనుమానాలు మొద‌ట్నుంచీ ఉన్నాయి. మ‌రి, ఈ అనుమానాల‌ను నివృత్తి చేసేలా తెలుగు ప్రేమ‌మ్ ఉందా..? మ‌ల‌యాళ చిత్రం నుంచి సోల్ మాత్ర‌మే తీసుకుని… మ‌న నేటివిటీకి ద‌గ్గ‌రుండేట్టుగా సినిమా తెర‌కెక్కించామ‌ని నాగ చైత‌న్య చెబుతూ వ‌చ్చాడు. ఇంత‌కీ ద‌ర్శ‌కుడు చందు ప్రేమ‌మ్‌ను ఎలా తెర‌కెక్కించాడు..? ప‌్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం ఏ మేర‌కు ఆక‌ట్టుకుంది..? ఇలాంటి విష‌యాల‌న్నీ ఇప్పుడే విశ్లేషించుకుందాం.

క‌థేంటి..?

ప్రేమ‌మ్‌… సున్నిత‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. విక్ర‌మ్ (చైతు) జీవితంలో ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగిందీ… ఎన్ని ర‌కాలు మ‌లుపు తిరిగిందీ.. ఆ మ‌లుపుల్లో ఎలాంటి అనుభూతులు పంచిందీ అనేదే ఈ చిత్ర‌క‌థ‌. మొద‌ట్లో… సుమ‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు విక్ర‌మ్‌. ఆ త‌రువాత సితార‌తో మ‌రోసారి పీక‌ల్లోతు ప్రేమ‌లోకి వెళ్లిపోతాడు. చివ‌రిగా త‌న జీవిత భాగ‌స్వామిగా సింధును ఎన్నుకుంటాడు. టూకీగా చెప్పాలంటే ఇదే క‌థ‌. ప్ర‌తీ మ‌నిషి జీవితంలోనూ ఈ ల‌వ్ స్టోరీస్‌లోని ఏదో ఒక సంఘ‌ట‌నకు క‌నెక్ట్ చేస్తుందని చెప్పాలి. ఒక ట‌చ్‌.. ఒక ముద్దు… ఇలా ఏదో ఒక అనుభ‌వాన్ని గుర్తు చేస్తుంది. లేదా, అలాంటి ప్రేమానుభ‌వం పొందాల‌న్న ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తుంది.

విశ్లేష‌ణ:

ఈ చిత్రం ఒక‌ప్ప‌టి ‘నా ఆటోగ్రాఫ్’ని గుర్తుకు తెస్తుంది. ఆ చిత్రంలో కూడా క‌థానాయ‌కుడి ప్రేమ ప్ర‌యాణ‌మే క‌థాంశం. ప్రేమ‌మ్ కూడా అదే స్ఫూర్తితో తెర‌కెక్కింద‌ని చెప్పుకోవ‌చ్చు. తేడా ఏంటంటే.. ఆ చిత్రం వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా క‌థ‌నం సీరియ‌స్‌గా సాగుతుంది. ఇందులో అదే పంథాని కాస్త డోస్ త‌గ్గించి లైట‌ర్‌గా క‌థ‌నాన్ని న‌డిపించిన‌ట్టు అనిపిస్తుంది. ఇక‌, ఈ చిత్రాన్ని రెండు కోణాల్లో విశ్లేషించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఒక‌టీ… మ‌ల‌యాళ ప్రేమ‌మ్ చూసిన‌వారి కోసం, రెండోది… మాతృక‌ను చూడ‌నివారి కోసం!

మ‌ల‌యాళ చిత్రాన్ని చూడ‌నివారి విశ్లేష‌ణ‌లోని ఈ పేరాను చ‌ద‌వాల్సిన ప‌నిలేదు. నిర‌భ్యంత‌రంగా కింది పేరాకు వెళ్లిపోవ‌చ్చు. మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో నివీన్ పాల్… జార్జ్ పాత్ర‌లో క‌నిపించాడు. తెలుగుకు వ‌చ్చేసరికి నాగ చైత‌న్య విక్ర‌మ్‌గా న‌టించాడు. ఇంజినీరింగ్ స్టూడెంట్ పాత్ర‌లో నివీన్ చాలా బాగా ఒదిగిపోయాడు. అంత‌కుముందు సాగే ప్రేమ‌క‌థ‌లో నూనూగు మీసాల కుర్రాడిగా ఫ‌ర్వాలేదు అనిపించుకున్నాడు. అర్బ‌న్ లుక్‌లో క‌నిపించిన నాగ‌చైత‌న్య బాగానే చేశాడు. మాతృక‌లో నటించిన అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోనా సెబాస్టియ‌న్ తెలుగులో సుమ‌, సింధు పాత్ర‌ల్లో న‌టించారు. ఇక‌, పాపుల‌ర్ అయిన మ‌లర్ పాత్ర‌లో అక్క‌డ సాయి ప‌ల్లవి న‌టించింది. నిజానికి, మ‌ల‌యాళ ప్రేమ‌మ్ అభిమానుల‌కు ఎంత‌గానో న‌చ్చింది కూడా సాయి ప‌ల్ల‌వి న‌ట‌నే. తెలుగుకు వ‌చ్చేస‌రికి… ఆ పాత్ర‌లో ఇక్క‌డ సితార‌గా శ్రుతి హాస‌న్ న‌టించింది.

చాక్లెట్ బాయ్‌గా చైతు బాగా సూట‌య్యాడు. త‌న స్కూల్ బ్యూటీ సుమ‌ను ప‌డేయ‌డం కోసం విక్ర‌మ్ ప‌డే త‌ప‌న స‌ర‌దాగా సాగిపోతుంది. నిజానికి, ఇది సీరియ‌స్ థ్రెడ్ ఉన్న ఎపిసోడ్ కాక‌పోయినా… కొన్ని సన్నివేశాల‌ను స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఓన్ చేసుకుంటాడు. అక్క‌డి నుంచి ఐదేళ్ల త‌రువాత‌… కాలేజీలో ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా విక్ర‌మ్ క‌నిపిస్తాడు. అదే కాలేజీకి లెక్చ‌ర‌ర్‌గా వ‌చ్చిన సితార‌ ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌రువాత‌, విక్ర‌మ్ ఒక యంగ్ ఎంట్ర‌ప్రిన్యూవ‌ర్‌గా మార‌తాడు. జీవితంపైనా భ‌విష్య‌త్తుపైనా స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో ల‌క్ష్యాల‌తో ఉంటాడు. సరిగ్గా అదే స‌మ‌యంలో సింధు అత‌డి జీవితంలోకి వ‌స్తుంది. ఆమె విష‌యంలో ఈసారి ఓ సిర్థ‌మైన నిర్ణ‌యం తీసుకుంటాడు.

నిజానికి, ఇలాంటి చిత్రాల‌ను రీమేక్ చేయ‌డం ఒక సాహ‌సం. ఎందుకంటే, అడుగ‌డుగునా పోలిక‌లు వినిపిస్తాయి. అయితే, ప్రేమ‌మ్ రీమేక్ విష‌యంలో ద‌ర్శ‌కుడు చందు స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ప్ర‌థ‌మార్ధం యావేరేజ్‌గా ఉంద‌ని అనిపించినా, ద్వితీయార్థం బాగుంది. ఇక‌, కామెడీ విష‌యానికొస్తే.. కాలేజీలో లెక్చ‌ర‌ర్లుగా న‌ర్రా శ్రీ‌నివాస్‌, బ్ర‌హ్మాజీలు బాగానే న‌వ్వించారు. క్లైమాక్స్‌లో క‌మీడియ‌న్ శ్రీ‌నివాస‌రెడ్డి పాత్ర మ‌రికొన్ని న‌వ్వుల్ని పంచుతుంది.

న‌టీన‌టులు – ప‌నితీరు:

మూడు విభిన్న‌మైన భావ వ్య‌క్తీక‌ర‌ణ‌లున్న ఒకే పాత్ర‌లో న‌టించ‌డం ఏ న‌టుడికైనా క‌చ్చితంగా చాలెంజ్ అవుతుంది. ఈ విష‌యంలో చైతు స‌క్సెస్ అయ్యాడు. వ‌యోబేధాల‌ను చ‌క్క‌గా ప‌లికించాడు. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా మెచ్యూరిటీ లెవెల్స్ మ‌ధ్య తేడాను న‌ట‌న‌లో చూపించ‌గ‌లిగాడు. ఇక‌, హీరోయిన్ల విష‌యానికొస్తే సితార పాత్ర‌లో శ్రుతి హాస‌న్ ఆక‌ట్టుకుంది. చీర‌క‌ట్టులో ఆమె ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. సితార పాత్ర‌కు శ్రుతి స‌రైన ఎంపిక అనిపించేలా చేసింది. ఇక‌, అనుప‌మ‌, మ‌డోన్నా పాత్ర‌లకు స్కోప్ త‌క్కువ‌. దాంతో ఉన్నంతంలో ఈ ఇద్ద‌రూ ఫ‌ర్వాలేద‌నిపించారు. సుమ తండ్రి పాత్ర‌లో పృథ్వి న‌టించారు. ఎడిటింగ్ టేబుల్ మీద ఈ పాత్ర‌ను ఇంకాస్త క‌త్తింరించి ఉంటే బాగుండేది. లేదా, క‌థ‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఇంకాస్త బ‌ల‌మైన స‌న్నివేశాలైనా ఆ పాత్ర‌కు ఇచ్చి ఉంటే బాగుండేది.

పాట‌లు:

‘ఎవ‌రే ఎవరే’… చూడ్డానికి అందంగా ఉంటుంది. మంచి లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించారు. ‘బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్’లో చైతు డ్రెస్సింగ్ స్టైల్స్ బాగున్నాయి. ‘ఏ మచ్చీ’ ఈ పాట యూత్‌తోపాటు కుర్రాళ్ల‌ను ఆక‌ర్షించే అవ‌కాశం ఉంది. మిగ‌తా పాట‌లు ఫ‌ర్వాలేదు. క‌థ‌తోపాలు అలాఅలా సాగిపోతాయి.

పాజిటివ్స్‌:

  • విక్ర‌మ్‌-సితార‌ల మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌. ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ
  • నిజ జీవితానికి రిలేట్ అయ్యే కొన్ని స‌న్నివేశాలు
  • ఎడిటింగ్, సినిమాటోగ్ర‌ఫీ
  • అతిగా లేని హాస్యం
  • పాట‌ల్లో విభ‌న్న ర‌కాలు
  • బోర్ కొట్టించ‌ని నిడివి
  • నేప‌థ్య సంగీతం
  • పెద్ద ప్ల‌స్ పాయింట్ ఏంటంటే… నాగార్జున‌, వెంక‌టేష్ సర్‌ప్రైజ్ ఎంట్రీ!

నెగెటివ్స్‌:

  • గుండెను పిండేసే ఎమోష‌న్స్ లేక‌పోవ‌డం
  • ముగ్గురు హీరోయిన్ల‌తో హీరో జ‌త‌క‌ట్ట‌డం… సినిమాటిక్‌గా సాగ‌డం

జ‌డ్జిమెంట్‌:

ప్రేమ‌మ్ ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్‌. అభిమానుల‌కు కావాల్సిన అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా ఇందులో ఉన్నాయి. కాబ‌ట్టి, బాక్సాఫీస్‌కి ద‌స‌రా పండుగ అని చెప్పొచ్చు. అయితే, క‌థాప‌రంగా స‌న్నివేశాల‌ప‌రంగా భావోద్వేగాల‌కు ఇంకాస్త ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది.

తెలుగు360 రేటింగ్ : 3.5/5

విడుద‌ల తేదీ: అక్టోబ‌ర్ 7, 2016
ద‌ర్శ‌కుడు: చ‌ందు మొండేటి
సంగీతం: గోపీ సుంద‌ర్‌, రాజేష్ మురుగేస‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘట్ట‌మ‌నేని
తారాగ‌ణం: నాగ‌చైత‌న్య‌, శ్రుతి హాస‌న్‌, అనుప‌మ‌, మ‌డొన్నా త‌దిత‌రులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close