ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాధారణంగా నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు , లాక్డౌన్ వంటి అత్యంత కీలకమైన, సంచలనాత్మక నిర్ణయాల సమయంలోనే మోదీ ఇలా జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో, ముఖ్యంగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయిన సమయంలో ప్రధాని ప్రసంగం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇప్పటికే విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న డీలిమిటేషన్ ఆరోపణలను తిప్పికొడుతూనే, మహిళా సాధికారతపై తన చిత్తశుద్ధిని చాటుకునేలా ప్రధాని ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లును నేరుగా అమలు చేసేందుకు ఉన్న రాజ్యాంగపరమైన ప్రత్యామ్నాయాలు లేదా ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశంపై కేంద్ర కేబినెట్ ఇప్పటికే అత్యవసరంగా చర్చించినట్లు సమాచారం. ఒకవేళ ప్రధాని ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు ప్రకటించే సాహసం చేస్తే, అది భారత రాజకీయ చరిత్రలో అతిపెద్ద మలుపుగా మారుతుంది.
దక్షిణాది రాష్ట్రాల నుండి వ్యక్తమవుతున్న నియోజకవర్గాల పునర్విభజన భయాలను పోగొట్టేందుకు కూడా ప్రధాని ఈ వేదికను వాడుకోవచ్చని భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల సీట్లు తగ్గకుండానే మహిళా రిజర్వేషన్లు ఎలా సాధ్యమనే దానిపై ఆయన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను జాతి ముందు ఉంచే అవకాశం ఉంది. మేము మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదు అనే సంకేతాన్ని పంపుతూ, విపక్షాల విమర్శల గాలి తీసేలా మోదీ ప్రసంగం ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాత్రి 8:30 గంటల సమయం దేశ భవిష్యత్తును మార్చే మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోందని అర్థంచేసుకోవచ్చు.


