రోబో 2.0.. తెలుగులో రిస్క్ తీసుకొనేది ఎవ‌రు?


త‌మిళ‌నాటే కాదు, యావ‌త్ భార‌త‌దేశంలోని సినీ అభిమానుల్ని త‌న వైపుకు తిప్పుకొంటున్న సినిమా రోబో 2.0. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ ఏం లేవు. లుక్కులూ టీజ‌ర్లూ బ‌య‌ట ప‌డ‌లేదు. అయినా రోబో 2.0 వార్త‌ల్లోనే ఉంది. తాజాగా రోబో 2.0 మేకింగ్ వీడియోని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఆ వీడియో చూసి నోళ్లు తెరిచేస్తున్నారంతా. హాలీవుడ్ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం తీసిపోనివ్వ‌కుండా రోబో సినిమాని తెర‌కెక్కిస్తున్నాడ‌న్న సంగ‌తి ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. `ఐ` సినిమా నిరాశ‌కు గురి చేసినా.. `క‌బాలి` అంచ‌నాల్ని అందుకోక‌పోయినా – రోబో 2.0 పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెల‌కొంది. రోబో రైట్స్‌కి దాదాపుగా రూ.40 కోట్లు పెట్టి కొన్నారు అప్ప‌ట్లో. ఇప్పుడు ఆ రేటు డ‌బుల్ అయ్యింద‌ని టాక్‌. అంటే ఈ సినిమాని రూ.80 కోట్ల‌కు అమ్మాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార్ట‌. ఓ డ‌బ్బింగ్ సినిమాపై ఆ స్థాయిలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి నిర్మాత‌లు జంకుతున్నారు. అయితే .. తెలుగు సినిమా స్టామినా పెరిగింది. చిన్న సినిమాలే హిట్ టాక్ తెచ్చుకొంటే అల‌వోక‌గా రూ.40 కోట్లు వ‌సూలు చేసేస్తున్నాయి. ఇది ర‌జ‌నీ సినిమా. పైగా శంక‌ర్ ద‌ర్శ‌కుడు. అందుకే.. రోబో 2.0పై న‌మ్మ‌కాలు పెరిగిపోతున్నాయి. తెలుగు నుంచి ఓ నిర్మాత దాదాపుగా రూ.55 కోట్ల‌కు ఈ సినిమా కొనాల‌ని ట్రై చేశాడ‌ట‌. అయితే త‌మిళ నిర్మాత‌లు మాత్రం రూ.80 కోట్ల‌కు పైసా త‌గ్గేది లేద‌ని చెబుతున్నారు. ఆ అంకె నిజంగా భ‌య‌పెట్టేదే. అటూ ఇటూ అయితే… అంతే సంగ‌తులు. షేర్ గ్యారెంటీ ఇస్తే గానీ, ఈ సినిమా కొన‌న‌ని ఆ నిర్మాత ష‌ర‌తు పెట్టాడ‌ట‌. దానికి త‌మిళ నిర్మాత‌లు ఒప్పుకోవ‌డం లేద‌ని టాక్‌. ఈ సినిమాకి త‌మిళ నిర్మాత‌లే.. నేరుగా విడుద‌ల చేసుకొనే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com