ప్రొ.నాగేశ్వర్ : రేవంత్ రెడ్డి అరెస్ట్ సమంజసమా..?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి.. రోజంతా కస్టడీలో ఉంచుకుని విడుదల చేయడం కలకలం రేపుతోంది. దీనికి అధికారవర్గాలు రకరకాల కారణాలు చెబుతున్నాయి. కొడంగల్ అభివృద్ధికి కేసీఆర్ ఎం చేశారో నిలదీస్తామని… రేవంత్ ప్రకటించడంతో పాటు.. నిరసనలు తెలిపేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారనే సమాచారం రావడంతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశామని.. ఈసీతో పాటు పోలీసులు చెబుతున్నారు.

అరెస్ట్ చేసి రేవంత్ హక్కులను హరించారా..?

రేవంత్ అరెస్ట్ అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే.. ఆయన ఓ అభ్యర్థి. ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫ్రీ గా జరగాలి. ఓ అభ్యర్థిని అరెస్ట్ చేయడం…. ఫెయిర్ అండ్ ఫ్రీ గా ఎన్నికలు జరగాల్సిన వాతావరణానికి భంగం కలిగించారు. ఓ అభ్యర్థిని అరెస్ట్ చేయడమంటే.. ఆ అభ్యర్థి చేసుకోవాల్సిన ప్రచారాన్ని అడ్డుకోవడమే. ఓ అభ్యర్థి ప్రచారం చేసుకుంటూ ఉంటే మరో అభ్యర్థిని… ఆ అభ్యర్థి ప్రచారం కోసం అరెస్ట్ చేయడం … హక్కుల్ని కాలరాయడమే అది అది ఫెయిల్ అండ్ ఫ్రీ ఎలక్షన్ కాదు… అలాగే.. రేవంత్ రెడ్డి కేసీఆర్ సభను అడ్డుకుంటానని ప్రకటించడం మరో అభ్యంతరం. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. రేవంత్ రెడ్డికి నిరసన తెలిపే హక్కు ఎలా ఉంటుందో.. కేసీఆర్‌కు సభను నిర్వహించే హక్కు అలాగే ఉంటుంది. ఈ అడ్డుకోవడానికి మూల పురుషులు టీఆర్ఎస్ వాళ్లే. తెలంగాణ ఉద్యమ కాలంలో.. వాళ్లను అడ్డుకుంటాం.. వీళ్లను అడ్డుకుంటాం… అనే ప్రకటనలు చేశారు. చంద్రబాబు, జగన్ సహా… అందర్నీ అడ్డుకుంటామని ప్రకటించారు. చివరికి.. సినిమాలను కూడా అడ్డుకుంటామని ప్రకటించారు. అలా ఈ సంస్కృతిని టీఆర్ఎస్‌నే తీసుకొచ్చింది. తెలంగాణ వ్యతిరేకించేవారైనా సరే.. తెలంగాణలో పర్యటనను అడ్డుకోకూడదు.. వచ్చిన వారికి… తెలంగాణ అవసరాన్ని చెప్పాలని చెప్పాను. అయితే టీఆర్ఎస్ మాత్రం అడ్డుకోవడమే ఓ విధానంగా మార్చుకుంది. అందువల్ల ఇప్పుడు అధికారంలో ఉన్న వారే.. అడ్డుకోవడాన్ని ఓ సంస్కృతిగా ప్రాచుర్యం కల్పించారు.

అడ్డుకుంటామని ప్రకటించగానే అరెస్ట్ చేసే హక్కు ఉందా..?

ఇప్పుడు.. అడ్డుకోబోతున్నారనే అంశంపైనే అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ప్రివెంటివ్ అరెస్ట్ అని పోలీసులు వాదిస్తున్నారు. అయితే.. అలా అడ్డుకుంటామనే ప్రకటన ద్వారానే అరెస్ట్ చేయవచ్చా.. అనే ప్రశ్న ఉంది. సుప్రీంకోర్టు చాలా సార్లు తీర్పులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి అనే అభ్యర్థి… ముఖ్యమంత్రి సభను అడ్డుకునే వాతావరణం ఉందా..?. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం.. ఓ వ్యక్తి సభను పెట్టుకోవడానికి కానీ.. ఓ వ్యక్తి స్వచ్చగా తిరిగే హక్కును కానీ.. ఓ వ్యక్తి వ్యక్తిగత స్వేచ్చను కానీ.. లా అం‌డ్ ఆర్డర్ కారణం చూపి హరించకూడదు. కానీ ఇప్పుడు పోలీసులు అల్లర్లు జరగబోతున్నాయని… ప్రివెంటివ్ అరెస్ట్ చేశామని.. పోలీసులు చెబుతున్నారు. దీన్ని చట్టం అంగీకరించదు. ఇదే జరిగితే… పోలీసులు ఇక ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. అల్లర్లు జరుగుతాయని.. మిమ్మల్ని రానీయబోమని… ఎవరినైనా అడ్డుకోవచ్చు.

సభకు భద్రత కల్పించలేరా..?

ఒక వేళ కేసీఆర్ సభ పెట్టుకుని… రేవంత్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే… ప్రజలే నిర్ణయించుకుంటారు కదా..!. కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రచారం చేసుకోకుండా.. రేవంత్ అడ్డుకుంటే.. దానిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ శాంతి భద్రతలకు భంగం కలుగుతాయనుకుంటే.. దానికి తగ్గట్లుగా పరిస్థితులు తీసుకోవచ్చు. బలగాలు మోహరించుకోవచ్చు. ఒక వేళ .. సభ దగ్గర అల్లరి చేసే అవకాశం ఉంటే.. అక్కడ వారిని అరెస్ట్ చేసుకోవచ్చు. సభ జరుపుకునే హక్కు అందరికీ ఉంది. కానీ ఆ సభకు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో… ఓ అభ్యర్థిని అరెస్ట్ చేయడం.. రాజ్యాంగ స్ఫూర్తి కాదు.

అరెస్ట్ రేవంత్ రెడ్డికే కలిసి వస్తుందా..?

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించడం ద్వారా… టీఆర్ఎస్ ఏమైనా రాజకీయ లక్ష్యాలను సాధిస్తుందా అంటే అదీ లేదు.. ఎందుకంటే.. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే.. అది వ్యక్తిగతం కాదు. ఎందుకంటే.. కొడంగల్‌కు అన్యాయం చేశారని.. దానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాంటి కారణంగా చెప్పి అరెస్ట్ చేస్తే..అది టీఆర్ఎస్ వర్సెస్ కొడంగల్ అన్నట్లుగా మారుతుంది. ఈ పరిస్థితి రేవంత్ రెడ్డికే కలిసి వస్తుంది. ఏ విధంగా చూసినా.. రేవంత్ రెడ్డి అరెస్ట్… రాజ్యాంగ, రాజకీయ స్ఫూర్తి కాదు. అడ్డుకోవడాలు.. నిరసన ప్రదర్శలకు పిలుపునివ్వడాలు.. ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో కామన్. కాబట్టి… రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి.. రాజకీయ స్ఫూర్తిని దెబ్బతీసినట్లే…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.