ప్రొ.నాగేశ్వర్ : పొత్తులపై పవన్ కళ్యాణ్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా…. వరుసగా….టీఆర్ఎస్, వైసీపీలను కలిసి విమర్శలు చేస్తున్నారు. తనతో పొత్తు కోసం.. వైసీపీ నేతలు.. టీఆర్ఎస్ నేతలతో రాయబారాలకు పంపుతున్నారు. సహజంగానే ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతునన్నాయి. టీఆర్ఎస్ .. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పడమే దీనికి కారణం. పవన్ కల్యాణ్… ఏపీ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ ను తీసుకు రావడానికి కారణం ఏమిటి..? పవన్ కల్యాణ్ విమర్శల్లో ఆంతర్యం ఏమిటి..?

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో టీడీపీకి లాభమేనా..?

పవన్ కల్యాణ్… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తనపై ఒత్తిడి తెస్తున్నారని… పవన్ కల్యాణ్ ఆరోపించడం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లాభించేదే. ఆయన టీడీపీకి లాభం చేయాలని ఆలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరు. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ వ్యాఖ్యలను సమర్థంగా వినియోగించుకుంటుంది. ఎందుకంటే… తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒకటే చెబుతోంది. నరేంద్రమోడీ, టీఆర్ఎస్, వైసీపీ, జనసేన కలిసి తమను ఇబ్బంది పెడుతున్నాయని ఆ ఆరోపణలు చేశారు. దానికి ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చినట్లయింది. పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడటానికి రాజకీయ కారణాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే.. టీడీపీ.. పవన్ కల్యాణ్ ను దూరం చేసుకుంది. పవన్ కల్యాణ్ నాలుగేళ్ల పాటు.. టీడీపీతో సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దూరం అయ్యారు. పవన్ కల్యాణ్ ను మనం సరిగ్గా డీల్ చేయలేదన్న భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. అందుకే.. పవన్ కల్యాణ్ కోసం.. చంద్రబాబునాయుడు ఇటీవల ఓ మైండ్ గేమ్ మొదలు పెట్టారు.

టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ పై పాజిటివ్ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు..?

పవన్ కల్యాణ్ మాతో కలిసి వస్తే తప్పేంటని ఓ సారి… కలసి రావాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు రెండు లక్ష్యాలను కోరుకుంటున్నారు. ఒకటి.. తాను జనసేనతో కలవడానికి సిద్దంగా ఉన్నామని సంకేతాలు పంపడం. గతంలో… పవన్ కల్యాణ్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న భావన ఏదైనా ఉంటే.. తన వ్యాఖ్యల ద్వారా పోతాయని.. ఇప్పటికీ.. కలసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామన్న సంకేతాలను… బలంగా జనసైనికుల్లో పంపినట్లవుతుంది. అందుకే ఇటీవలి కాలంలో.. జనసేనపై.. తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి విమర్శలు చేయడం లేదు. మంత్రులు కూడా కలసి రావాలని పిలుపునిస్తున్నారు. ఇక రెండోది.. పవన్ కల్యాణ్‌ కలసి రాకపోయినా… జససైనికుల్ని టీడీపీకి అనుకూలంగా మల్చుకోవడం. విడివిడిగా పోటీ చేసినప్పటికీ.. పవన్ కల్యాణ్ గెలిచే పరిస్థితి లేకపోతే.. జగన్ ను ఓడించడానికి తమతో కలసి వచ్చేలా.. జనసైనికుల్ని..మానసికంగా సిద్దంమ చేసుకోవడం. ఈ రెండు లక్ష్యాలను ఆశించి చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ పై… అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

పొత్తుల కోసం టీడీపీ, వైసీపీ అర్రులు చాస్తున్నాయని చెప్పదల్చుకున్నారా..?

టీఆర్‌ఎస్ సాయంతో జనసేనతో జగన్ పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రకటించిన తర్వాత జగన్ కూడా విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన ఒక్కటేనని చెప్పడం ప్రారంభించారు. నిజానికి ఇప్పుడు జససేన .. అటు టీడీపీతో కానీ.. ఇటు… వైసీపీతో కానీ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ నేరుగా ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలతో మాత్రమే పొత్తులుంటాయన్నారు. సీట్ల సర్దుబాటు చర్చలు కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. కమ్యూనిస్టు నేతలు, జనసేన నేతలు సమావేశం కూడా అయ్యారు. ఓ వైపు.. జనసేన ను తమతో కలిసి రావాలని టీడీపీ నేతలు ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి… టీడీపీ, జనసేన ఒక్కటేనని చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా రెండు సందేశాలను ప్రజల్లోకి పంపుతున్నారని అనుకోవచ్చు. ఒకటి .. తన పార్టీ కార్యకర్తలకు నమ్మకం కలిగించడం. తన పార్టీకి బలం లేదని విమర్శలు చేస్తున్న పార్టీలే పొత్తుల కోసం వస్తున్నయి.. అంటే బలం ఉన్నట్లే కదా అన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు.

కింగ్ మేకర్ అవుతామని పరోక్షంగాచెబుతున్నారా..?

రెండోది.. పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట… వరకూ తానే ముఖ్యమంత్రినని ప్రకటనలు చేసేవారు. ఆ తర్వాత ఇరవై ఏళ్ల రాజకీయం అన్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడటం లేదు. అంటే… ఆయన తన బలం గురించి అంచనా వేసుకున్నట్లే చెప్పుకోవాలి. బహుశా… తనంతట తాను… అధికారంలోకి వచ్చే పరిస్థితిలేదని పవన్ కల్యాణ్ గుర్తించినట్లు ఉన్నారు. కింగ్ మేకర్ని కాగలనని అనుకుంటున్నారు. అందుకే… ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవచ్చు. అటు టీడీపీతో కానీ.. ఇటు వైసీపీతో కానీ .. జనసేన కలవబోదని.. తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ చెప్పదల్చుకున్నారని అనుకోవచ్చు. టీడీపీతో కలపాలని కొంత మందికి ఉండొచ్చు. కానీ.. ఆ ఉద్దేశం లేదని చెప్పడంతో పాటు.. జనసేనను తేలిగ్గా తీసుకోవద్దని… నిర్ణయాధికార బలం ఉన్న పార్టీ అని.. ఆయన చెప్పదల్చుకున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.