ప్రొ.నాగేశ్వర్: వామపక్షాలతో జనసేన పొత్తు ఖరారయిందా..?

పవన్ కల్యాణ్ తన రాజకీయ కార్యాచరణను.. ఆంధ్రప్రదేశ్‌లో వేగ వంతం చేశారు. గతంలో ప్రకటించిన రీతిలో ఆయన.. రాజకీయ పర్యటనల్లో వేగం పెంచారు. 2018 నుంటి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటానని… గత ఏడాదే ప్రకటించారు. దాని ప్రకారం.. పవన్ కల్యాణ్ రాజకీయ ర్యాలీలు పెరిగాయి. ఇష్యూస్ ని టేకప్ చేయడం పెరిగింది. తన ప్రత్యర్థుల్ని విమర్శించడం పెరిగింది. గతంలో కన్నా.. చంద్రబాబుపై కానీ.. జగన్ పై కానీ విమర్శలు చేయడం పెరిగింది. ఇదంతా ఓ రాజకీయ పార్టీని నడిపే ప్రక్రియలో భాగం. దానితో పాటు పార్టీ నిర్మాణ కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీని నడిపే క్రమంలో ఇదే ముందడుగు.

ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడిగా పవన్..!

రాజకీయ పార్టీ నడిపే విషయంలో పవన్ కల్యాణ్.. ఓ అడుగు ముందుకేశారు. కానీ ఇంకా చేయాల్సి చాలా ఉంది. కానీ ఈ ప్రక్రియలో మాత్రం ఇదో మందడుగు. అన్ని సీట్లకు పోటీ చేస్తామని.. గత కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. అంతకు ముందు నా బలం ఎంతో తెలియదు. తెలుసుకున్న తర్వాత చెబుతానన్నారు. అందువల్ల ఓ రకంగా చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో… టీడీపీ, వైసీపీ మధ్య చీలిన రాజకీయాల్లో.. పవన్ కల్యాణ్.. ఎంటరవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలి పరిణామాలు చూస్తే ఇదే అర్థం అవుతోంది. అందుకే గతంలోలా పవన్ కల్యాణ్ గెస్ట్ యాక్టర్ గా వచ్చి పోతాడని చెప్పాడనికి వీల్లేదు. గెస్ట్ పొలిటిషియన్ గా ఉంటాడని అనుకోవాల్సిన అవసరం లేదు. అమరావతిలో ఇల్లు, పార్టీ ఆఫీసు కట్టుకోవడం వంటి కారణాల వల్ల పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమయిందని … మనం అనుకోవచ్చు. అయితే పవన్ కల్యాణ్… ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది చెప్పడం కష్టం. ముందు ముందు పొలిటికల్ యాక్టివిటీ ఎలా ఉంటుందన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

పవన్ మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు?

పవన్ కల్యాణ్ మిత్రులెవరు అన్నది కూడా ఇక్కడ పాయింట్. ఏ గేమ్ అయినా… పొలిటికల్ మ్యాచ్‌ లో అయినా .. నీ మిత్రులెవరు..? శత్రువులెవరు..? అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా మహాభారత పరిభాషలో చెప్పాలంటే.. అస్మదీయులెవరు..? తస్మదీయులెవరు..? నిర్వచించుకోవాల్సి ఉంది. గతంలో చంద్రబాబుకు మద్దతు ప్రకటించడం వల్ల … పవన్ కల్యాణ్ చంద్రబాబు మనిషి అనే విమర్శలు జగన్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జగన్మోహన్ రెడ్డిపై కన్నా.. ఇప్పుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. సీఎంను.. ఆయన కుమారుడు లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఓ విజన్ డాక్యుమెంట్ కూడా ప్రకటించి… తమ ఆలోచనలు వివరించారు. మ్యానిఫెస్టోలో అంతకు మించి ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో… చంద్రబాబునాయుడే కాదు.. జగన్ కూడా తనకు ప్రత్యర్థే అని చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీపై విమర్శలు చేశారు. దానికి స్పందనగా… జగన్… పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.

వామపక్షాలతో పవన్ పోరాటాలు..!

దీనిని బట్టి చూస్తే పవన్ కల్యాణ్… అటు చంద్రబాబుతోనూ.. ఇటు జగన్మోహన్ రెడ్డితోనూ కలసి నడవడానికి సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏపీలో ఓ ఫోర్సే కాదు. బీజేపీకి ఇప్పుడు ఓ పోటీ పార్టీగా ఏపీలో ఎవరూ చూడటం లేదు. ఆ పార్టీని భారంగా భావిస్తున్నారు. టీడీపీ వదిలించుకుంది. బీజేపీతో సంబంధం ఉందన్న… ఎవరైనా విమర్శలు చేస్తే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరించలేకపోతోంది. అంటే.. దీనర్ధం బీజేపీతో కలవడానికి ఏ పార్టీ కూడా సిద్దంగా లేదు. అందువల్ల జనసేన బీజేపీతో కలవడానికి సిద్ధంగా ఉండటానికి అవకాశం లేదు. ప్రత్యేకహోదా విషయంలో పవన్ కల్యాణ్… బీజేపీని విమర్శించిన సందర్భాలున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశమే లేదు. ఎందుకంటే.. తన అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు. డీ మార్కెట్ చేసుకున్నారు. అందువల్ల…జనసేన దృష్టిలో… టీడీపీ, వైసీపీ, కంగ్రెస్, బీజేపీ లేవు. ఇప్పుడు మిగిలింది వామపక్షాలు. ఆయన వామపక్షాలతో కలిసి వివిధ సమస్యలపై కలసి పోరాటం చేశారు. ప్రదర్శనలు చేస్తున్నారు.

పొత్తు ఉంటే వామపక్షాలతోనే..!

వామపక్షాలు… కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ లో అమరావతిలో బహిరంగసభ నిర్వరించడానికి ఏర్పాట్లు చేసుకుంటుున్నారు. వీరికి ఆమ్ ఆద్మీ లాంటి చిన్న పార్టీలు కలసి వస్తున్నాయి. దీనికి జనసేనను కూడా ఆహ్వానించారు. దీనికి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. హిందూ లాంటి పత్రికలకు ఇచ్చిన ఇంటర్యూల్లో.. కూడా.. సైద్దాంతికంగా.. సారూప్యత ఉంది. వామపక్షాలు కూడా మారాలని వ్యాఖ్యానించారు. స్థూలంగా ఆయన ఆలోచన… వామపక్షాల భావజాలం.. వారితో కలిసి పని చేస్తామని పరోక్షంగా చెప్పారు. వారితో పొత్తు పెట్టుకుంటామనే రీతిలో మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడు… పవన్ కల్యాణ్ కానీ… ఇటు వామపక్షాలు రూఢీగా చెప్పలేకపోతున్నాయి. వీటిని చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఏమైనా ఉంటే.. అది జనసేన, వామపక్షాల మధ్యే ఉంటాయి.

పవన్ కు అభిమానుల బలం – వామపక్షాలకు అనుభవం..!

జనసేన- వామపక్షాల మధ్య పొత్తు ఇద్దరికీ లాభం. జనసేనకు ఉన్న సమస్య ఏమిటంటే… టీడీపీ, వైసీపీతో కలసి పని చేయలేదు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదు కాబట్టి.. టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే.. తాను ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించారో… అప్పుడు నుంచి రేసులోకి వచ్చినట్లవుతుంది. మామూలుగా సినిమాల్లో స్టార్లుగా ఉన్న వారు.. తాము రాజకీయాల్లో స్టార్లుగా ఉండాలనుకుంటారు. అందుకే.. చంద్రబాబుకో.. జగన్ కో… జూనియర్ పార్టనర్ గా పవన్ కల్యాణ్ ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వల్ల ఉపయోగం లేదు. పవన్ కల్యాణ్ కు జనాకర్షణ ఉంది. వామపక్షాలకు కార్యకర్తల బలం ఉంది. నిర్మాణబలం ఉంది. గత చరిత్ర చూసినా.. చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో వామపక్షాలు చేసిన పోరటమే… తెలుగుదేశం పార్టీ పాలనకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో.. ఓ వాతావరణం ఏర్పడటానికి కారణం అయింది. ఆ వాతావరణమే… తర్వాత కాలంలో వైఎస్ ముఖ్యమంత్రి అవడానికి కారణం అయింది. అందువల్ల.. వామపక్షాలకు ఉన్న కార్యకర్తల బలం.. జనసేనకు ఉపయోగపడుతుంది. జనసేనకు లేని జనాకర్షణ పవన్ కల్యాణ్ కు ఉంది. పవన్ కల్యాణ్ తో పోల్చదగిన.. జనాకర్షణ ఉన్న నాయకుడు లేడు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు లెఫ్ట్ పార్టీలకు లేరు. అంటే.. జనసేనకు లేనిది… వామపక్షాలకు ఉంది. వామపక్షాలకు లేనిది.. జనసేనకు ఉంది. జనసేనకు లక్షల సంఖ్యలో యువ అభిమానులున్నారు. అదే సమయంలో క్షేత్ర స్థాయిలో నిర్మాణం లేదు. నాయకత్వం లేదు. ఒక బలమైన రాజకీయం, ఎలక్టోరల్ యాక్టివిటీని నడిపిన… అనుభవం లేదు. ఇది వామపక్షాలకు ఉంది.

జన సేన, వామపక్షాల పొత్తు ఇద్దరికీ లాభం!

వామపక్షాలు గతంలో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నయి. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకున్నాయి. రెండు బలమైన పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ బలమైన పార్టీలతో పొత్తుల పెట్టుకవడం వల్ల ఏమీ ప్రయోజనం కలగలేదని గుర్తించారు. అలాగే.. ఓటింగ్ మొత్తం బదలాయింపు జరగడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. టీడీపీ ఓట్లు మొత్తం.. లెఫ్ట్ కి టాన్స్‌ఫర్ కావడం లేదు. కానీ లెఫ్ట్ ఓట్లు మొత్తం టీడీపీకి టాన్స్ ఫర్ అవుతున్నాయి. 2014లో ప్రజారాజ్యంతోనే పొత్తులు పెట్టుకోవాలని వామపక్షాలు అనుకున్నాయి. కానీ జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పోషించిన పాత్ర వల్ల… టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ప్రజారాజ్యంతో పొత్తులు పెట్టుకుని ఉంటే… వామపక్షాలకు.. ప్రజారాజ్యానికి కూడా సీట్లు పెరిగేవి. అందుకే… ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య ఉన్న బైపొలారిటీని బద్దలు కొట్టడానికి వామపక్షాలు-జనసేనకు అవకాశం ఉంది. వారిద్దరి మధ్య పొత్తు.. విన్ – విన్ సిట్యూయేషన్ లాంటిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com